డబుల్ ఇస్మార్ట్.. ఎంత వరకు వచ్చింది?

తమ బకాయిలు పూర్తిగా చెల్లిస్తే తప్ప, జిల్లాలో పోస్టర్ కూడా పడనివ్వమని పట్టుదలగా వున్నారు.

డబుల్ ఇస్మార్ట్ మీద పడిన లైగర్ బాకీల వివాదం కొన’సాగు’తోంది. బహుశా లాస్ట్ మినిట్ వరకు ఇలాగే కొనసాగే అవకాశం వుంది. వాయిదా పడుతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి కానీ అవి వాస్తవం కాదు. లాస్ట్ మినిట్ లో సమస్య పరిష్కారమై సినిమా విడుదలకు మార్గం సుగమం అవుతుందని తెలుస్తోంది.

లైగర్ బకాయిలు 16 కోట్ల వరకు వున్నాయని తెలుస్తోంది. వీటిలో నలభై శాతం వరకు చెల్లించానికి నిర్మాత చార్మి ముందుకు వచ్చారు. పోయిన దానికి దక్కిందే దక్కుడు అని ఒప్పుకుంటున్నారు. కానీ అక్కడ మళ్లీ మెలిక ఏమిటంటే, నలభై శాతం కూడా ఇప్పుడు కాదు సినిమా విడుదల తరువాత అంటున్నారు చార్మి అని తెలుస్తోంది. దానికి బకాయి దారులు అంగీకరించడం లేదు. ఇన్నాళ్లు ఇబ్బంది పెట్టినట్లే, సినిమా విడుదలకు ఓకె అన్న తరువాత పెట్టరు అని గ్యారంటీ లేదనే భావనతో వున్నారు వారంతా.

మధ్యే మార్గంగా బకాయిలు రావాల్సిన వారు, హోల్ సేల్ బయ్యర్ నిరంజ‌న్ రెడ్డిని మధ్యలో హామీ వుండమని కొరుతున్నారు. మరి దానికి నిరంజ‌న్ రెడ్డి ఒప్పుకుంటారో లేదో అన్నది తేలాల్సి వుంది. ప్రస్తుతానికి అయితే సమస్య అలాగే మిగిలి వుంది.

కానీ ఇప్పుడు ఈ సమస్య వల్ల చాలా వరకు థియేటర్లు బచ్చన్ సినిమాకు ఫిక్స్ అయ్యాయి. అందువల్ల ఏం జ‌రుగుతుంది అంటే థియేటర్ అడ్వాన్స్ లు పెద్దగా రావు. రెండు కోట్లు అడ్వాన్స్ లు వస్తాయి అనుకున్న చోట కోటి రూపాయలు మాత్రమే వస్తాయి. దీని వల్ల బయ్యర్ నిరంజ‌న్ రెడ్డికి ఇది కాస్త ఇబ్బందిగా మారవచ్చు.

అన్ని ఏరియాలు అలా వుంటే ఈస్ట్ గోదావరిలో మాత్రం పట్టుగా వున్నారు. తమ బకాయిలు పూర్తిగా చెల్లిస్తే తప్ప, జిల్లాలో పోస్టర్ కూడా పడనివ్వమని పట్టుదలగా వున్నారు. బహుశా సోమవారం నాటికి లైగర్ బకాయిల సమస్య ఓ కొలిక్కి రావచ్చు. లేదా ఎగ్జిబిటర్లను పట్టించుకోకుండా కేవలం మల్టీ ఫ్లెక్స్ ల్లో విడుదల చేసుకుంటామని పంతం పట్టి, వారిని దారికి తెచ్చుకునే ప్రయత్నం బుధవారం వరకు కొనసాగవచ్చు.

5 Replies to “డబుల్ ఇస్మార్ట్.. ఎంత వరకు వచ్చింది?”

Comments are closed.