బాలీవుడ్ లో మరో జంట విడిపోయింది. మొన్నటికిమొన్న అర్బాజ్ ఖాన్, మలైకా అరోరా విడిపోయారు. అర్బాజ్ తో ఇలా విడిపోయిన వెంటనే అలా అర్జున్ కపూర్ తో డేటింగ్ షురూ చేసింది మలైకా. ఇదే కోవలో ఇప్పుడు మరో బాలీవుడ్ జంట విడిపోయింది. ఒకప్పుడు అందాల తారగా పేరుతెచ్చుకున్న దియామీర్జా.. తన భర్తకు విడాకులిచ్చింది. ఐదేళ్ల వీళ్ల వివాహ బంధం వీగిపోయింది.
వీళ్లిద్దరిదీ కేవలం ఐదేళ్ల బంధం మాత్రమేకాదు. ఒకరికొకరు దాదాపు 11 ఏళ్లుగా తెలుసు. ఒకర్నొకరు ఎంతో గాఢంగా ప్రేమించుకున్నారు. బాగా అర్థం చేసుకున్న తర్వాతే పెళ్లి చేసుకున్నామని గతంలో ప్రకటించారు. అలాంటి ఈ జంట విడాకులు తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. వీళ్లకు పిల్లలు లేరు.
తను విడాకులు తీసుకున్న విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన దియామీర్జా, అందుకు కారణాల్ని మాత్రం వెల్లడించలేదు. తామిద్దరం ఇష్టపూర్వకంగానే విడిపోతున్నామని, తమ వ్యక్తిగతాన్ని అంతా గౌరవించాలంటూ కోరింది. భవిష్యత్తులో కూడా తామిద్దరం ఫ్రెండ్స్ గా కొనసాగుతామని స్పష్టంచేసిన ఈమె.. తన ఐదేళ్ల వైవాహిక బంధం చాలాగొప్పగా సాగిందని చెప్పుకొచ్చింది.
దియామీర్జా విడాకులతో ఆమెపై సరికొత్త గాసిప్స్ బాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. మలైకా టైపులోనే దియాకు కూడా ఓ సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటూ బాలీవుడ్ లో పుకార్లు ప్రారంభమయ్యాయి. వీటిపై ఇంకా దియా స్పందించలేదు. ప్రస్తుతం ఆమె తన యాక్టింగ్ కెరీర్ పై దృష్టిపెట్టింది. సంజు సినిమాలో మాన్యతా దత్ పాత్ర పోషించిన దియా.. మరిన్ని సినిమాల్లో నటించాలనుకుంటోంది.