‘పాన్‌ ఇండియా’ చిత్రాలకు కథే ప్రాణం

అన్ని సినిమాలకూ కథలు వుంటాయి. కానీ ఏ కథ తీస్తే తీసిన భాషలోనే కాక, ఇతర భాషల వారంతా చూస్తారూ?

కొడితే సిక్సర్‌ కొట్టాలీ, అన్నట్లు తీస్తే పాన్‌ ఇండియా సినిమా తియ్యాలి. బాల్‌ బౌండరీలు దాటాల్సిందే. సినిమాలకీ బౌండరీలు వుంటాయా? ఎందుకుండవూ? భాష ఒక హద్దు. మార్కెట్‌ మరో హద్దు. తెలుగులో నే తీసుకోండి. కానీ తెలుగు వాళ్లు మాత్రమే చూడాలని కోరుకోకండి. హిందీ, తమిళ, కన్నడ, మళయాళ తదితర ప్రేక్షకులు కూడా ఏకకాలంలో ఎగబడి చూడగలగాలి. బాహుబలిని చూడలేదూ? కేజీఎఫ్‌ ను కన్నడంలో తీశారు. మనం చూసి విస్తుబోలేదూ?

మంచిదే. అలా దేశమంతా జనం వెర్రెత్తి చూడాలంటే సినిమాలో ఏముండాలి? వందల కోట్ల పెట్టుబడీ, హీరోగా పెద్ద స్టార్‌. ఊపిరాడని గ్రాఫిక్స్‌. చాలా? చాలవు. ఇవేమీ సరిపోవు. ఒకటి ఖచ్చితంగా వుండాలి. అది వున్నప్పుడు, ఇవన్నీ ఉన్నా ఒకటే, లేక పోయినా ఒకటే. అదే కథ. కథచేతనే ప్రేక్షకుడి ఆదరణను బౌండరీలు దాటించగలం. బౌండరీలు దాటటమేమిటి? దాటి,దాటి ఆస్కార్‌ అవార్డు వరకూ వెళ్ళిపోగలవు. ట్రిపుల్‌ ఆర్‌ (ఆర్‌ఆర్‌ఆర్‌) సినిమాలోని ‘నాటునాటు’ పాట అలా వెళ్ళిపోలేదూ? ఎంత కాదన్నా ట్రిపుల్‌ ఆర్‌కు డబ్బూ,స్టారూ,గ్రాఫిక్సూ వగైరాలన్నీ వున్నాయి. అది వెళ్ళటమే పెద్ద ఆశ్చర్యమనిపించింది.

కానీ పెట్టుబడి పెద్దగా లేకుండా, పేరొందిన స్టారుని పెట్టకుండా, అత్యంత సాదాసీదాగా ఒక పల్లెటూరు, రెండు రైల్వేస్టేషన్లలోనే సినిమా మొత్తం నడిపించేసిన సినిమా, ఈ ఏడాది (97వ) ఆస్కార్‌ అకాడమీ అవార్డుకు ఇండియానుంచి ‘ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్‌ ఫిల్మ్‌’ గా నామినేట్‌ అయ్యింది. ఈ తక్కువ బడ్జెట్‌ సినిమా పేరు ‘లాపతా లేడీస్‌’. దర్శకత్వం వహించింది కిరణ్‌ రావు. కారణం కథే.

అందచేత పాన్‌ ఇండియా సినిమాకు ప్రాణం కథే. వందల కోట్ల ఖర్చు పెట్టిన ‘పాన్‌ ఇండియా’ చిత్రాలు కూడా బాగా ఆడాయీ అంటే కథ వల్లే. కానీ అలా అంటే నమ్మ బుధ్ధి కాదు. ‘బాహుబలి’ ప్రభాస్‌ వల్లా, కేజీఎఫ్‌ ‘యాష్‌’ వల్లా ఆడిరదంటే అవునూ అనాలీ, అనిపిస్తుంది.

నిజమే. హీరో పాత్రల్లో వారిని తప్ప వేరే వారిని ఊహించుకోవటమే కష్టం. కానీ కేజీఎఫ్‌ వచ్చే వరకూ తెలుగు ప్రేక్షకుడికి యాష్‌ పెద్దగా తెలీదు. ప్రభాసూ అంతే, తెలుగువాళ్ళకి సుపరిచితుడు కానీ, ఇతర భాషల వారికి అంతవరకూ అపరిచితుడూ. కాకుంటే స్వల్ప పరిచితుడు. బాహుబలి రెండు భాగాలూ వచ్చాక ప్రభాస్‌ ఖ్యాతి ఇండియా మొత్తం పాకటమే కాదు, ఇండియా ఎల్లలు దాటేసింది. లండన్‌ లో ని టుస్సాడ్స్‌ మ్యూజియంలో మైనపు బొమ్మయి మెరిసాడు కూడా.

కారణం కథ. అవును కథే. ‘బాహుబలి’ లోని కథే. అత్యంత సమర్థవంతుడయిన రాజమౌళి చేతికి చిక్కిన కథ. తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ కథే. కేజీఎఫ్‌ విజయానికి కూడా కథే కారణం. బంగారు గనుల్లో ని భారీ సెట్టింగులు ప్రేక్షకుణ్ణి క్షణం పాటు ఆశ్చర్య చకితుల్ని చేస్తాయి కానీ, పార్ట్‌ వన్‌ నుంచి పార్ట్‌ టూ వరకూ అతణ్ణి వేచివుండేటట్టు చెయ్యగలిగింది కథ మాత్రమే. ఆ కథలో వున్నది బంగారం కాదు, బానిసత్వం. అక్కడ పనివాడు ఊపిరితో వుండాలి, ఊడిగం చెయ్యాలి. అంతెందుకు? కథ ఎంతగా కట్టిపడ వెయ్యక పోతే, ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడూ?’ అన్న చిన్నట్విస్టుతో రెండోభాగం కోసం రెండేళ్ళు ఎదురు చూడ లేదూ?

అన్ని సినిమాలకూ కథలు వుంటాయి. కానీ ఏ కథ తీస్తే తీసిన భాషలోనే కాక, ఇతర భాషల వారంతా చూస్తారూ? ఆ కథకు ఎలాంటి లక్షణాలు వుండాలీ? ఇది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. మాటవరసకే కాదు, ‘నోటు’ వరసకు కూడ ఇదే ప్రశ్న. ఎలాగూ పాన్‌ ఇండియా మూవీకి రావాల్సిన కలెక్షన్లు ‘మిలియన్ల డాలర్లే’ కదా! ఇతర దేశాలలో (ఓవర్‌సీస్‌లో) వచ్చే కలెక్షన్లు కలుపుకో వద్దూ? అక్కడకూడా వివిధ భాషల్లో చూసేది ప్రవాస భారతీయులే.

కథ దేశంలోని అన్ని ప్రాంతాల వారికీ పట్టేదయి వుండాలి. దేశమంతటా గనులు లేక పోవచ్చు. గనిలో కనిపించే వాస్తవమే ‘వని’లోనూ, ‘కార్ఖానా’లోనూ కనిపిస్తుంది. కూలీల కార్మికుల దైన్య పరిస్థితి దేశమంతటా ఒకేలాగ వుంటుంది.

ఆ దైన్యాన్ని కళాత్మకంగా చూపించి, ఆ పీడన మీద మనకు తారాస్థాయి కోపం రప్పించి, ఆ కోపాన్ని ఎదురులేని ‘తార’ (హీరోతో) తీర్చిపెడతాడు ‘కేజీఎఫ్‌’ లో దర్శకుడు. అలాగే భారతీయులందరికీ తెలిసిన కథా, నెత్తుటిలో ఇంకి పోయిన కథ మహాభారతం. దానినే ఒకానొక ‘పిరియడ్‌’లో పెట్టి తిరగ రాశారు విజయేంద్ర ప్రసాద్‌.

బాహుబలి ఎవరు. అర్జునుడూ అతడే, భీముడూ అతడే. ద్రౌపదే దేవసేన(అనుష్క), సూత పుత్రుడుగా కురుసామ్రాజ్యానికి కర్ణుడు ఎలా కాపలా కాశాడో, మాహిష్మతీ సామ్రాజ్యానికి ‘కట్టప్ప’ అలా కట్టుబడి వుంటాడు. మరి దుర్యోధనుడు. వేరే చెప్పాలా? భల్లాల దేవుడే (రానా). మరి దృతరాష్ట్రుడు ఎవరు? ఇంకెవరు బిజ్జలదేవుడు(నాజర్‌). అంగవైకల్యంలో చిన్న తేడా. దృతరాష్రుడు అంధుడు. బిజ్జలదేవుడు అవిటి వాడు. శివగామి(రమ్యకృష్ణ) కుంతీదేవే. ‘తింటే గారెలే తినాలి. వింటే భారతం వినాలి’ అన్న నానుడి వుండనే వుంది.

మహాభారతం ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వింటారు, చూస్తారు. చూసేశారు. దేశంలోని అన్ని భాషల్లోనూ..? వ్యవసాయ సమాజంలోని కథే. మన దేశంలో పరిశ్రమలు వచ్చినా, ఐటీ వచ్చినా, మన జీవనశైలులన్నీ వ్యవసాయ సమాజంలోనివే. అందుకే అంతలా సినిమా ఎక్కేసింది. అడవినీ అడవిభూమినీ కాపడటానికి గతంలో ‘విప్లవ కారులు’ వచ్చినట్టుగా సినిమా కథలు రాసేవారు. ఆ స్థానంలోకి సాక్షాత్తూ భగవంతుడే వచ్చేస్తే..? అదే రిషబ్‌ షెట్టి తీసిన ‘కాంతార’ సినిమా. ఇదీ దేశమంతటా వున్నదే. ఈ కథా దేశమంతటా ఎక్కుతుంది. ఎక్కింది కూడా.

అలా ఎక్కేసిందే.‘లాపతా లేడీస్‌’ కథ. మోజుతీరాకో, కట్నం ఖర్చయ్యాకో, బోరు కొట్టేశాకో భార్యను కడతేర్చేసి, రెండో పెళ్ళికి రెడీ అయ్యే ‘నిత్యపెళ్ళికొడుకు’లు దేశమంతటా వుంటారు. అన్ని రాష్ట్రాల్లోనూ వుంటారు. అన్ని భాషలోనూ వుంటారు. పెళ్ళయిన రెండు జంటల్లో ‘వధువులు’ మారిపోయినట్టుగా కథను బిప్లబ్‌ గోస్వామి రాస్తే, కిరణ్‌ రావు తెరకెక్కించారు. ఈ విషాదాలు దేశమంతటా చాలా ఇళ్ళల్లో వుంటాయి. కథ మలచిన తీరు గొప్పది. అందుకే ఇది పాన్‌ ఇండియా చిత్రమయ్యింది. కాబట్టి, పాన్‌ ఇండియా చిత్రానికి కథే మూలం. డబ్బూ, దస్కం కాదు.

7 Replies to “‘పాన్‌ ఇండియా’ చిత్రాలకు కథే ప్రాణం”

    1. తమరు OTT లో చూడాలి అనుకున్నా ముందు సినిమా నిర్మాణం జరగాలి కదా! మీరు OTT లోనే చూస్తాను అంటే వద్దు అని ఎవరూ బలవంతం చేయటం లేదు కదా! ఎవరికీ నచ్చిన ఫార్మటు లో వాళ్ళు చూసుకునే సౌలభ్యం ఉంది.

  1. అక్కడ ఎంపిక చేసే ప్యానల్ లో కొంత మంది తిష్ట వేసుకొని కూర్చున్నారు.

    వారికి నచ్చిన సినిమాలు ఆస్కారుకు వెళతాయి.

    అంతే వేగంతో తిరిగి వస్తాయి ఓడిపోయి.

    కధ పరంగా మాత్రమే చూసుకుంటే కొరియన్ మూవీ ‘పారసైట్’ ఏమంత గొప్ప మూవీ???

    అజ్ఞాత వాసం లో పాండవులు మారు వేషాలలో ఒకరొకరుగ వెళ్లి విరాటరాజు కొలువులో చేరడం.

    ఇదే కద ఆ సినిమా మూలం కూడా.

    ‘RRR’ సినిమాను విమర్శించే వారు ఇది గుర్తుంచుకోవాలి

Comments are closed.