“రాజాసాబ్ సినిమా టీజర్ వచ్చేస్తోంది.. కుదిరితే క్రిస్మస్ కు.. కుదరకపోతే జనవరి 1కి పక్కా” అంటూ చాలా ప్రచారం సాగుతోంది. మరీ ముఖ్యంగా రెబల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నారు. దీనిపై క్లారిటీ ఇచ్చింది యూనిట్.
అంతా అనుకుంటున్నట్టు రాజాసాబ్ సినిమా టీజర్ ఈ క్రిస్మస్ కో లేక జనవరి 1కో రాదని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ స్పష్టం చేసింది. సరైన టైమ్ లో టీజర్ రిలీజ్ ఎప్పుడనేది ఎనౌన్స్ చేస్తామని ప్రకటించింది.
సినిమా వాయిదా..?
నిజానికి రాజాసాబ్ టీజర్ జనవరి 1కి వస్తుందంటూ యూనిట్ లో కీలకమైన సభ్యులే కొంతమంది ఆఫ్ ది రికార్డ్ వెల్లడించారు. అయితే ఇదంతా నెల రోజుల కిందటి ముచ్చట. ఇప్పుడు లెక్కలు మారిపోయాయి.
చెప్పిన తేదీకి, అంటే ఏప్రిల్ 10కి రాజాసాబ్ వచ్చేలా ఉంటే అంతా అనుకున్నట్టు క్రిస్మస్ లేదా న్యూ ఇయర్ కు టీజర్ వచ్చి ఉండేది. కానీ రాజాసాబ్ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
దీనికి బలం చేకూరుస్తూ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న జాక్ సినిమాను ఏప్రిల్ 10న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ప్రభాస్ లాంటి హీరో సీన్ లో ఉన్నప్పుడు, సిద్ధు తన సినిమా రిలీజ్ పెట్టుకోడు కదా.
ప్రస్తుతానికి రాజాసాబ్ షూటింగ్ 80 శాతం పూర్తయింది. రాత్రిపగలు ఈ సినిమా షూటింగ్ నడుస్తోందని, సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుతోందని యూనిట్ ప్రకటించింది. అయితే గ్రాఫిక్స్ కు ఇంకాస్త ఎక్కువ టైమ్ పట్టేలా ఉంది. అందుకే ఏప్రిల్ 10 డెడ్ లైన్ అందుకోవడం కష్టమంటున్నారు.