నెల మొత్తం ఒక్క హిట్ కూడా లేదు

నవంబర్ నెలలో ఒక్క పెద్ద హిట్ కూడా లేకుండానే బాక్సాఫీస్ క్లోజ్ అయింది.

సాధారణంగా నవంబర్ ను కలిసిరాని నెలగా భావిస్తుంది టాలీవుడ్. అందుకే పెద్ద సినిమాలు చాలా తక్కువగా వస్తుంటాయి. గతేడాది నవంబర్ లో పెద్ద సినిమాలేం రాలేదు. హిట్స్ కూడా లేవు. ఈ ఏడాది నవంబర్ లో కూడా అంతే. 22 సినిమాలొచ్చాయి. అందులో ఒక్క హిట్ కూడా లేదు.

మొదటివారం ఏకంగా 10 సినిమాలొచ్చాయి. వీటిలో కూసింత స్టార్ ఎట్రాక్షన్ ఉన్న సినిమా ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ మాత్రమే. పోటీ లేకపోయినా ప్రచారం చేయకుండా రిలీజ్ చేయడం ఈ సినిమాకు పెద్ద దెబ్బ. దీనికితోడు కంటెంట్ కూడా ఆకట్టుకోకపోవడంతో రిలీజైన మొదటి రోజే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా.

ఈ సినిమాతో పాటు హెబ్బా పటేల్ ధూం ధాం, మంచు లక్ష్మి ఆదిపర్వం లాంటి సినిమాలు రిలీజయ్యాయి. ఇవన్నీ వేటికవే ఫ్లాప్స్ అయ్యాయి.

రెండో వారంలో రెండే సినిమాలొచ్చాయి. అవే మట్కా, కంగువా. నవంబర్ నెలలో అంతా దృష్టిపెట్టిన వారం ఏదైనా ఉందంటే అది ఇదే. ఈసారి వరుణ్ తేజ్ ఏదైనా మేజిక్ చేస్తాడని అనుకున్నారు కొందరు. ప్రమోషన్ ఆ స్థాయిలో చేశారు మరి. కానీ ప్రచారానికే పరిమితమైంది మట్కా. వరుణ్ తేజ్ కెరీర్ లో వరుసగా మరో ఫ్లాప్ వచ్చి చేరింది.

ఇక భారీ అంచనాలతో వచ్చిన కంగువా సినిమాది కూడా ఇదే దారి. సూర్య హీరోగా, శివ దర్శకత్వంలో వచ్చిన ఈ పీరియాడిక్ మూవీ ఆకట్టుకోలేదు. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి ఒక కారణం కాదు. ఓవైపు మంచి థియేటర్లు దొరకలేదు, మరోవైపు టెక్నికల్ సమస్యలు, ఇంకోవైపు కంటెంట్ లో లోపాలు,.. ఇలా చెప్పుకుంటే ఎన్నో కారణాల వల్ల కంగువా ఫ్లాప్ అయింది.

మూడోవారం వచ్చిన మెకానిక్ రాకీకి కూడా గట్టిగా ప్రచారం చేశారు. విశ్వక్ సేన్ సినిమా కాబట్టి ఓ వర్గం బాగానే ఎదురుచూసింది. ఆశలు పెట్టుకుంది. విశ్వక్ కూడా మరీ ఓవర్ చేయకుండా సినిమా ఎలా ఉండబోతోందో ముందుగానే హింట్ ఇస్తూ వచ్చాడు. కానీ పాపం ప్రేక్షకులే అర్థం చేసుకోలేకపోయారు. ఫస్టాఫ్ బాగాలేదని సినిమా మొత్తం రిజెక్ట్ చేశారు. అలా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత విశ్వక్ కు మరో ఫ్లాప్ పడింది.

మెకానిక్ రాకీతో పాటు దేవకీ నందన వాసుదేవ అనే సినిమా వచ్చింది. మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా నటించిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అయితే ఈ ఫ్లాప్ ఎఫెక్ట్ గల్లాపై కంటే హిట్ దర్శకుడు ప్రశాంత్ వర్మపై గట్టిగా పడింది. దీనికి కారణం, ఈ సినిమాకు కథ అందించింది ఇతడే.

ఇదే వారం వచ్చిన సత్యదేవ్ జీబ్రా మాత్రం ఉన్నంతలో నిలబడింది. మొదటి రోజు మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ, రోజురోజుకు స్క్రీన్స్ తో పాటు, వసూళ్లు పెంచుకుంటూ ముందుకుసాగుతోంది. లాజిక్స్ పట్టించుకోకుండా, దర్శకుడు పెట్టిన మెలికల్ని ఫాలో అవుతూ జాగ్రత్తగా చూస్తే సినిమా నచ్చుతుంది.

నవంబర్ చివరి వారంలో రోటీ కపడా రొమాన్స్ లాంటి 4 సినిమాలొచ్చాయి. అయితే అప్పటికే ప్రేక్షకులు పుష్ప-2 ఫీవర్ లోకి వెళ్లిపోయారు. దీంతో ఈ సినిమాల్ని పట్టించుకున్న నాథుడు లేడు. అలా నవంబర్ నెలలో ఒక్క పెద్ద హిట్ కూడా లేకుండానే బాక్సాఫీస్ క్లోజ్ అయింది. జీబ్రా సినిమా సత్యదేవ్ కెరీర్ కు ఆక్సిజన్ అందించింది తప్ప, మార్కెట్ కు కాదు.

10 Replies to “నెల మొత్తం ఒక్క హిట్ కూడా లేదు”

    1. నాక్కూడా కొన్ని సినిమాల గురించి ఈ ఆర్టికల్ చదివితేనే తెలిసింది …

  1. డిసెంబరు నేలకూడా అలాగే వెళ్ళిపోతుందని నా అనుమానం, అది కావొద్దని ఆశిద్దాం…

Comments are closed.