మలయాళీ హీరోల్లో.. సూపర్ హీరోయిజం ఉట్టిపడే పాత్రలు చేసే ఆసక్తికలిగిన హీరోగా పేరు టోవినో థామస్ కు. అడపాదడపా ఇతడూ రియలిస్టిక్ టచ్ ఇస్తూ సినిమాలు చేసినా, ఓవర్ ద టాప్ హీరోయిజం సినిమాలు చేసే హీరో అంటూ మలయాళీలే ఇతడిపై సెటైర్లు వేస్తూ ఉంటారు. ఆ తరహా సినిమానే అయినా.. ఓ మోస్తరు గ్రిప్పింగ్ గా సాగే సినిమా ‘ఐడెంటిటీ’. ఈ వారం జీ ఫైవ్ లో విడుదలైంది ఈ సినిమా. కొంతకాలం కిందట థియేటరికల్ రిలీజ్ పొందిన ఈ సినిమా అనువాదాల విషయంలో ఎక్కడా థియేటర్లలో ఆసక్తి రేకెత్తించలేకపోయినా, ఓటీటీలో మాత్రం మంచి వినోదాన్ని అందించే సినిమా నిలుస్తుంది.
‘2018’ సినిమా అనువాదంతో టోవినోకు తెలుగునాట కాస్త గుర్తింపు దక్కింది. దాన్ని కొనసాగిస్తూ.. తన సినిమాలను తెలుగునాట ప్రమోట్ చేసుకోవడానికి కాస్త ప్రయత్నించాడు. ఆ మధ్య వచ్చిన సూపర్ హీరోయిజం సినిమా ‘ఆర్’మ్ ను తెలుగులో కూడా విడుదల చేశారు. పాటల పరంగా ఆ సినిమా బాగానే గుర్తింపుకు నోచుకున్నా తెలుగు థియేటరికల్ రిలీజ్ లో నిలబడలేకపోయింది. ఆ తర్వాత విడుదలైన ‘ఐడెంటిటీ’ సినిమాకు అలాంటి ప్రయత్నం కూడా పెద్దగా జరిగినట్టుగా లేదు. త్రిష, ‘వాన’ ‘హనుమాన్’ ఫేమ్ వినయ్ రాయ్, మందిరాబేడీ వంటి తెలుగు వారికి కూడా తెలిసిన నటులున్న సినిమా ఇది.
సగటు మలయాళీ థ్రిల్లర్ తరహాలోనే సాగిన, ద్వితియార్థంలో హీరో పాత్రను ఎయిర్ మార్షల్ గా చూపించేసి, సూపర్ హీరోయిజం, విమానంలో ఫైటు వంటి పెట్టేశారు. ఎక్కడో మొదలై.. ఎక్కడికెక్కడో సాగే ఈ సినిమా విషయంలో సెకెండాఫ్ లో కాస్త గ్రిప్ జారినట్టుగా ఉన్నా.. ఓటీటీలో వీక్షించడానికి అయితే పెద్ద ఇబ్బంది ఉండదు!
తొలి సగం వరకూ అయితే సినిమా ఎక్కడా కన్నార్పనీయకుండా చూడనిస్తుంది. షాపింగ్ మాల్స్ లోనూ, కాలేజీ ఫంక్షన్ల సమయంలోనూ.. అమ్మాయిల డ్రస్సింగ్ రూమ్ లలో కెమెరాలు సెట్ చేసి వీడియోలను రికార్డ్ చేసి వారిని బ్లాక్ మెయిల్ చేసే ఒక అనామకుడి దగ్గర నుంచి కథ మొదలవుతుంది. రెండో సీన్ లోనే అతడిని ఒక గుర్తు తెలియని వ్యక్తి చంపుతాడు! అలా హత్యకు గురైన వ్యక్తి విషయంలో పోలీసుల విచారణ మొదలవుతుంది.
అయితే ఒక అనామకుడు, అందునా బ్లాక్ మెయిలర్ హత్యపై పోలీసుల సీరియస్ విచారణ వెనుక పెద్ద కథ ఒకటి దాగి ఉంటుంది. ఆ బ్లాక్ మెయిలర్ ను చంపిన వ్యక్తిని కాస్త దూరం నుంచి చూసి ఉంటుంది త్రిష పాత్ర. ఆమె చెప్పే ఐడెంటీస్ ను స్కెచ్ గా మార్చే ఒక డిఫరెంట్ పాత్రలో టోవినో కనిపిస్తాడు. అనామకుడిగా కనిపించే అతడి పాత్ర ప్రస్థానాన్ని సూపర్ హీరోయిజం స్థాయికి తీసుకెళ్తారు. ఎప్పటికప్పుడు చిన్న చిన్న ట్విస్ట్ లను రివీల్ చేస్తూ.. ఆసక్తిదాయకంగా సాగుతుంది ఈ సినిమా.
కథకు కీ అనదగ్గ పాయింట్ పూర్తి స్థాయిలో కన్వీన్సింగ్ అనిపించకపోయినా.. సమాజంలో జరిగే పోకడలు, వాటిపై హీరో రియాక్షన్ ప్రేక్షకుడికి తొలి సగం వరకూ బాగానే కనెక్ట్ అవుతుంది. ద్వితియార్థంలోనే ఈ కనెక్షన్ కాస్త మిస్ అవుతుంది. తొలి సగం థ్రిల్లర్ సినిమాగా, రెండో సగం సూపర్ హీరోయిజం సినిమాగా .. ఓవరాల్ గా చూడదగ్గ సినిమాగా, ఓటీటీల్లో మలయాళీ సినిమా హవాను కొనసాగించే సినిమా ‘ఐడెంటిటీ’.
sollu movie…