‘ప్రైమ్ షో’ ‘రియల్ షో’

ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ వాళ్లు నిజంగా డబుల్ ఇస్మార్ట్ సినిమాను 55 కోట్లకు కొన్నారా?

టాలీవుడ్ లో ఇప్పుడు డిస్కషన్ ఏమిటంటే హనుమాన్ సినిమా నిర్మాతలు ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ వాళ్లు నిజంగా డబుల్ ఇస్మార్ట్ సినిమాను 55 కోట్లకు కొన్నారా? మరో అయిదు కోట్లు రిటర్న్ బుల్ అడ్వాన్స్ ఇచ్చారా? ఏ విధంగా డబుల్ ఇస్మార్ట్ కు 55 కోట్ల బిజినెస్ వస్తుందని లెక్కలు కట్టారు. ఇదంతా ఓ స్క్రిప్ట్… కేవలం ప్రైమ్ షో ను అడ్డం పెట్టి మార్కెటింగ్ చేయడానికి వేసిన ఎత్తుగడా? ఇదో అనుమానం.

ఎందుకంటే ఎంత ఒకటికి రెండు సార్లు లెక్క పెట్టినా తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, ఓవర్ సీస్ కలిపి 45 కోట్లకు మించి మార్కెట్ చేయడం కష్టం. మరి అలాంటిది 55 కోట్లు ఎందుకు ఇస్తారు? ఎవరైనా కొన్న మేరకు అమ్మేసుకున్నా ఫరవాలేదు. చేతి డబ్బులు మరో పది కోట్లు పెట్టుకోవాల్సిన పనేమిటి? పైగా హిందీ విడుదల అంటే చేతి డబ్బులు అయిదు కోట్లు ఖర్చు చేయాలి కదా. పైగా ఎగ్జిబిటర్ల తలనొప్పులు వుండనే వున్నాయి కదా. అది తెలిసీ ఎందుకు దిగారు అని మరో అనుమానం. ఇవన్నీ కలిసి పూరి- చార్మి, ప్రైమ్ షో కలిసి సినిమాను మార్కెట్ చేయడానికి ఏదో చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ అనుమానాలతోనే, ప్రైమ్ షో కొని వుండదు అని టాలీవుడ్ లో గుసగుసలు మొదలయ్యాయి. అయితే ఈ విషయం మీద ప్రైమ్ షో అధినేతల్లో ఒకరైన చైతన్య నిరంజ‌న్ రెడ్డిని ప్రశ్నించగా.. అడ్వాన్స్ ల మీద తీసుకుని విడుదల చేయడానికి చాలా మంది వున్నారని, నాన్ రిటర్నబుల్ అడ్వాన్స్ ఇవ్వడానికి అంగీకరించాము కనకే తమకు సినిమా ఇచ్చారని అన్నారు. ఇందులో అబద్దం చెప్పాల్సిన పని లేదని, తాము రిస్క్ చేసామని ఇప్పుడు అర్థం అవుతోందని అన్నారు.

ఎందుకంటే తాము తీసుకున్నపుడు సోలో విడుదల అనే భావంతో తీసుకున్నామని, ఇప్పుడు మాత్రం చాలా సినిమాలు వచ్చాయని, అందువల్ల అనుకున్న మేరకు బిజినెస్ కాకపోవడం అన్నది వాస్తవమని అన్నారు. ఫిగర్లు చెప్పలేము కానీ 55 కోట్ల మేరకు బిజినెస్ కావడం కష్టమే అని ఇప్పుడు తమకూ తెలిసిందని, కానీ ఒకసారి మాట ఇచ్చాక, దాని మీదే వుండాలి తప్ప, వెనుకడుకు వేయకూడదనే భావంతో ముందుకు వెళ్తున్నామని వివరించారు. దేవుడి మీద భారం వేసామని, సినిమా పెద్ద హిట్ అవుతుందని, తమ డబ్బులు తమకు వస్తాయని నమ్మకంతో వున్నామన్నారు.

3 Replies to “‘ప్రైమ్ షో’ ‘రియల్ షో’”

Comments are closed.