ఊరి పేరు భైరవ కోన అంటూ మరో ప్రయత్నం చేస్తున్నాడు హీరో సందీప్ కిషన్. ఎలా చేసినా, ఎన్ని చేసినా విజయం అన్నది మాత్రం సందీప్ కిషన్ తో దోబూచులాడుతూనే వుంది. తనకు ఎలాంటి పాత్రలు సరిపోతాయి అన్నది మాత్రం అర్థం కావడం లేదు.
మాస్, హీరోయిజం వీటికి దూరంగా జరగలేకపోతున్నారు. విఐ ఆనంద్ తో థ్రిల్లర్ సినిమా ప్లాన్ చేసారు. బాగానే వుంది. కానీ దాంట్లో కూడా హీరోయిన్ తో పాట, వెనకాల జనాలను వేసుకుని డ్యాన్స్ లు. ఇలాంటివి థ్రిల్లర్ సినిమాల్లో బ్రేక్ ల్లా వుంటాయి తప్ప హీరోలకు బ్రేక్ ఇవ్వడం కష్టం.
అసలే కాంతారా, విరూపాక్ష లాంటి మాంచి థ్రిల్లర్లను చూసి వున్నారు ప్రేక్షకులు. వీళ్లకి అంతకు మించిన ఎక్స్ పీరియన్స్ ఇవ్వాల్సి వుంటుంది. అంతే తప్ప రొటీన్ అమ్మాయిల వెనుకాల పడే పాయింట్ ను వదలకపోతే వేరేగా వుంది. విఐ ఆనంద్ మీద మంచి నమ్మకం వుంది. థ్రిల్లర్ టచ్ సినిమాలను బాగానే డీల్ చేస్తారు. కానీ ఈ రోజు వదిలిన పాట, డ్యాన్స్ లు, సందీప్ కు సెట్ కాని రామ్ మిరియాల గొంతు ఇవన్నీ కలిసి కాస్త అనుమానం కలిగిస్తున్నాయి.
నిర్మాత అనిల్ సుంకర అసలే కష్టాల్లో వున్నారు. ఏజెంట్, భోళాశంకర్ దారుణంగా దెబ్బతీసాయి. ఇలాంటి టైమ్ లో సరైన హిట్ పడాలి. అలా హిట్ పడితే బాగానే వుంటుంది. ఆయనకు, అంతకు మించి సందీప్ కిషన్ కు కూడా. ప్రస్తుతానికి సినిమా నుంచి వచ్చిన పాట మాత్రం సినిమాకు సాయం చేసేదిగా మాత్రం లేదనే చెప్పాలి.