ఊహించని విధంగా హీరోయిన్ తమన్నాకు మహారాష్ట్ర సైబర్ సెల్ నుంచి నోటీసులందాయి. 29వ తేదీన విచారణకు హాజరుకావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొన్నారు. ఇంతకీ తమన్నా ఎందులో ఇరుక్కుంది? ఆ కేసులో ఆమె ప్రమేయం ఎంత?
గతేడాది ఐపీఎల్ ప్రసారాలకు సంబంధించిన కేసు ఇది. ఐపీఎల్-2023 మ్యాచుల్ని చట్ట వ్యతిరేకంగా ఫెయిర్ ప్లే అనే యాప్ లో స్ట్రీమింగ్ చేశారు. దీని వల్ల తమకు కోట్ల రూపాయల్లో నష్టం వచ్చిందని ఆరోపిస్తోంది వయాకమ్ సంస్థ. ఈ మేరకు ఫైల్ అయిన కేసులో సాక్ష్యాధారాల కోసం రావాల్సిందిగా తమన్నాకు నోటీసులిచ్చారు. ఎందుకంటే, అప్పట్లో ఆ యాప్ కు ప్రచారకర్తగా పనిచేసింది తమన్నా.
ఈ ఫెయిర్-ప్లే యాప్ వెనక చాలా పెద్ద నెట్ వర్క్ ఉంది. వేల కోట్ల రూపాయల బెట్టింగ్ ఆరోపణలు, మనీ ల్యాండరింగ్ మోసాలతో సంబంధం ఉన్న మహాదేవ్ ఆన్ లైన్ గేమింగ్ కంపెనీకి చెందిన అనుబంధం సంస్థ ఇది. ఈ కేసులో విచారణ ముందుకు సాగే కొద్దీ డొంక మరింత కదలడం ఖాయం అంటున్నారు నిపుణులు.
ఇదే కేసుకు సంబంధించి సంజయ్ దత్ కు కూడా నోటీసులిచ్చారు. అయితే తను విచారణకు హాజరుకాలేదనని ఆయన మహారాష్ట్ర సైబర్ సెల్ కు తెలియజేశారు. బదులుగా తన స్టేట్ మెంట్ ను రికార్డ్ చేయడానికి తేదీ-సమయం కోరాడు. ఎందుకంటే, ఆ తేదీకి అతడు ఇండియాలో ఉండడం లేదు.
ఇక తమన్నా విషయానికొస్తే.. ఫెయిర్ ప్లేని ఆమె గట్టిగా ప్రమోట్ చేసింది. ఆ యాప్ ను ప్రమోట్ చేయడానికి ఆమెను ఎవరు సంప్రదించారు, ఎంత పేమెంట్ చేశారు, ఆ పేమెంట్స్ ఎలా జరిగాయి.. లాంటి విషయాలను తమన్నా నుంచి తెలుసుకోవాలనుకుంటున్నారు పోలీసులు.
మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ను దుబాయ్‌కి చెందిన సౌరభ్ చంద్రకర్, రవి ఉప్పల్ ఆపరేట్ చేశారు. వీరిద్దరూ ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌కు చెందినవారు. ఈ కంపెనీకి చెందిన మనీ లాండరింగ్ కేసును ఏడాదికి పైగా దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వివిధ రాజకీయ నాయకులు, ఉన్నత స్థాయి అధికారుల ప్రమేయం ఉన్నట్లు తమ దర్యాప్తులో తేలిందని గతంలో ప్రకటించింది. ఈడీ అంచనా ప్రకారం, ఈ స్కామ్ అంచనా విలువ 6000 కోట్ల రూపాయలు.