లెక్కప్రకారం, ఈరోజు ముంబయిలో సైబర్ సెల్ పోలీసుల ఎదుట విచారణ ఎదుర్కోవాలి తమన్న. కానీ ఆమె ఆ విచారణకు హాజరుకాలేదు. ప్రస్తుతం ఆమె చెన్నై, హైదరాబాద్ మధ్య రౌండ్స్ కొడుతోంది. తను నటించిన బాక్ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది.
ఇదే విషయాన్ని మహారాష్ట్ర సైబర్ సెల్ కు తన లాయర్ల ద్వారా తెలిపింది తమన్న. తను ముంబయిలో లేకపోవడం వల్ల విచారణకు హాజరుకాలేకపోయానని, త్వరలోనే హాజరవుతానని ఆమె తెలియజేసినట్టు సమాచారం. దీనికి సంబంధించి పోలీసులు, మరోసారి తమన్నాకు నోటీసులు ఇవ్వబోతున్నారు.
ఈ కేసుకు సంబంధించి సింగల్ బాద్షా, నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వాంగ్మూలాల్ని ఇప్పటికే రికార్డు చేశారు పోలీసులు. ఈ క్రమంలో సంజయ్ దత్, తమన్నాలకు కూడా నోటీసులివ్వగా.. సంజయ్ దత్ ఇండియాలో లేడు, తమన్న ముంబయిలో లేదు.
ఫెయిర్ ప్లే యాప్ ద్వారా ఐపీఎల్ మ్యాచుల్ని నిబంధనలకు విరుద్ధంగా స్ట్రీమింగ్ చేశారనే అభియోగాలున్నాయి. దీని వల్ల తమకు దాదాపు 100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్టు వయకామ్ ప్రకటించింది. మహాదేవ్ బెట్టింగ్ స్కామ్ లో ఉన్న వ్యక్తులకు సంబంధించిన యాప్ ఇది. దీనికి తమన్నా ప్రచారం చేసింది. అందుకే ఇప్పుడు సమన్లు అందుకుంది.