దశాబ్దాల కాలం వెనక్కు వెళ్లి రాజకీయాలు చూస్తే ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ వెనుక ఫైళ్లు పట్టుకోవడానికి, ఎన్నికల టైమ్ లో అన్ని పనులు చక్కబెట్టడానికి, తన తరపున రాయబారాలు, బేరాలు ఇలా ప్రతీదీ దగ్గర వుండి చూసుకోవడానికి ఓ మనిషి వుండేవారు. ఉత్తరోత్తరా.. అదే మనిషి, ఎదిగి ప్రజా ప్రతినిధిగా మారిన సందర్భాలు చాలా అంటే చాలా వున్నాయి. ఇప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ ఒకప్పుడు అప్పటి ఎమ్మెల్యే, మంత్రి సాంబమూర్తి రాజు దగ్గర అన్నీ తానై వ్యవహరించేవారు.
కానీ ఇప్పుడు రోజులు మారుతున్నాయి. నమ్మకం అన్నది కనిపించని సరుకైపోయింది. నమ్మకస్తులు కరువైపోతున్నారు. ఎవరిని నమ్ముకున్నా ఓ స్టేజ్ కు వచ్చాక, తమకే పోటీ అయిపోతున్నారు. తుని యనమల రామకృష్ణుడు తరపున నియోజకవర్గంలో తమ్ముడు కృష్ణుడు అన్నీ చక్కబెడుతూ వచ్చారు. అన్న రిటైర్ అయితే తనకే ప్రమోషన్ అనుకున్నారు.
విజయవాడ కేశినేని నాని.. కేశినేని చిన్న వ్యవహారం కూడా ఇలాంటిదే. అంతెందుకు వైఎస్ జగన్, షర్మిల వ్యవహారం ఎలా మారింది. అన్న తరపున ప్రచారం చేశారు. రాజకీయాల మీద ఆసక్తి పెరిగింది. ఎంపీ కావాలనుకున్నారు. అన్న వద్దన్నారు. వివాదం ముదిరి ఎక్కెడెక్కడికో వెళ్లిపోయింది.
అయినా కూడా ప్రజాప్రతినిధులు అయితే తమ రక్తం పంచుకుని పుట్టిన వారినో, భార్యలనో ఇంతో అంతో నమ్మగలుగుతున్నారు తప్ప అనుచరులను మాత్రం పూర్తిగా నమ్మడం లేదు. పైగా ఇప్పుడు డిజిటల్ యుగం వచ్చేసింది. ప్రతి వాళ్ల చేతిలో స్మార్ట్ ఫోన్ లే. అందువల్ల ఏ మూల నుంచి ఏం బయటపుడుతుందో అన్న భయం వెంటాడుతూనే వుంటుంది. అలాగే ఎన్నికలు అంటే ఇప్పుడు పదుల కోట్ల వ్యవహారం. అందువల్ల కచ్చితంగా మన వాళ్లే, మన ఇంటి వాళ్లే వుండాల్సి వుంది.
అందువల్లే ఇప్పుడు పోటీ చేస్తున్న వాళ్లందరి తరపున ఫస్ట్ ప్రయారిటీగా భార్యలు రంగంలోకి దిగుతున్నారు. భార్యలు ప్రచారం నిర్వహించడం అన్నది కామన్ గా మారింది. అది లోకేష్ అయినా జగన్ అయినా. కేవలం ప్రచారం చేయడంతో సరిపోవడం లేదు చాలా చోట్ల. ఆర్ధిక వ్యవహారాలు, పేమెంట్లు, సర్దుబాట్లు కూడా వాళ్లే చూడాల్సి వస్తోంది. కొన్ని చోట్ల అన్నదమ్ములు, లేదా కొడుకులు రంగ ప్రవేశం చేస్తున్నారు.
మిగిలిన పనులు అన్నింటికీ అనుచరులను నమ్ముకున్నా, వ్యక్తిగత, ఆర్ధిక వ్యవహారాలకు మాత్రం ఇప్పుడు పూర్తిగా రక్త సంబంధీకులే అవసరం పడుతున్నారు. కాలం మారుతోంది.