సామాజిక పింఛన్ల పంపిణీ… టీడీపీ ఫిర్యాదుతో తీవ్ర వివాదాస్పదమైంది. మే 1వ తేదీ దగ్గర పడడం, పింఛన్ల పంపిణీకి సమయం సమీపిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. లబ్ధిదారుల ఖాతాల్లో పింఛన్ సొమ్ము వేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇదే సందర్భంలో కదల్లేని, నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్ సొమ్ము అందజేయాలని స్పష్టంగా పేర్కొన్నారు.
అయితే ఈ ఉత్తర్వులపై చంద్రబాబు రాజగురువు పత్రిక తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ… జవహర్‌రెడ్డి జగన్నాటకం అంటూ ఘాటు కథనం రాసింది. వైసీపీకి వంత పాడేలా మరో వికృత క్రీడకు సీఎస్ తెరలేపారంటూ తన మార్క్ కథనాన్ని వండివార్చిన సంగతి తెలిసిందే. మరోవైపు చంద్రబాబునాయుడు మీడియా సమావేశం నిర్వహించి, లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బు జమ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
అయితే నిజం నిప్పులాంటిదంటారు. అసలు సామాజిక పింఛన్లను నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి పంపాలనే దిశానిర్దేశం లేదా ఎల్లో మీడియా భాషలో చెప్పాలంటే జగన్నాటకం వెనుక అసలు సూత్రధారి నిమ్మగడ్డ రమేశ్‌కుమారే అని తేలిపోయింది. వలంటీర్లపై ఫిర్యాదు అనంతరం మీడియాతో నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ బ్యాంక్ ఖాతాల్లోకి పంపాలన్న మాటలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అది కూడా నిమ్మగడ్డ మీడియా సమావేశాన్ని ప్రసారం చేసిన ఈటీవీ వీడియో వైరల్ అవుతుండడం గమనార్హం. సీఎఫ్‌డీ ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఏమన్నారంటే…
“పెన్షన్స్, రేషన్ పంపిణీలో వలంటీర్ల పాత్ర ఏదీ లేదు. వీటికి వలంటీర్లను దూరంగా పెట్టినట్టైతే వారికి ఓటర్లను నేరుగా కలిసే సంబంధాలు తెగిపోతాయని రాష్ట్ర ఎన్నికల అధికారికి చెప్పాం. వృద్ధుల పింఛన్లకు సంబంధించి ఎవరైతే అంగవైకల్యంతో బాధపడుతుంటారో, వారు సచివాలయం వద్దకెళ్లి పింఛన్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్న వారికి మినహాయింపు ఇవ్వొచ్చు. అలాంటి వారి ఇళ్లవద్దకెళ్లి పింఛన్ ఇస్తే సీఎఫ్‌డీకి ఎలాంటి అభ్యంతరం లేదని ఎన్నికల అధికారికి తెలియజేశాం. బ్యాంక్ ఖాతాలున్న లబ్ధిదారులకు నేరుగా డబ్బు జమ చేయాలని సూచించాం. బ్యాంక్ ఖాతాలు లేని లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, వారు సచివాలయాల వద్దకెళ్లి పింఛన్ తీసుకునే అవకాశం కల్పించాలి. అప్పుడు వలంటీర్ల ప్రమేయం పూర్తిగా పోతుందని ఎన్నికల సంఘం అధికారులకు తెలియజేశాం” అని నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ స్పష్టంగా చెప్పారు.
సీఎఫ్‌డీ ముసుగులో నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం పని చేస్తున్నారో అందరికీ తెలుసు. నెల క్రితం ఎన్నికల సంఘానికి నిమ్మగడ్డ ఇచ్చిన ఫిర్యాదులో వలంటీర్లను అడ్డుకునేందుకు సామాజిక పింఛన్లను లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో వేయాలని కోరారు. అప్పుడు ఆయన ఫిర్యాదును కళ్లకద్దుకుని ప్రసారం చేసి, ప్రచురించిన ఈటీవీ, ఈనాడుకు …నేడు సీఎస్ జవహర్‌రెడ్డి జగన్నాటకం ఆడుతున్నారని ఎలా కనిపిస్తున్నారనే నిలదీత ఎదురవుతోంది. తప్పులన్నీ తాము చేసి, ఇప్పుడు సీఎం జగన్, సీఎస్ జవహర్‌రెడ్డిపై వేయడం వారికే చెల్లింది. అందుకే ఎల్లో బ్యాచ్ అభాసుపాలవుతోంది.