దర్శకుడు ఒకరు వుండిన అదే భాగ్యము!

ఇదేమీ మొగుడు పెళ్లాల ముచ్చట కాదు. లేదా స్నేహబంధం కుబుర్లు కాదు. అచ్చంగా టాలీవుడ్ ముచ్చట. అవును, ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే ట్రెండ్. ప్రతి నిర్మాణ సంస్థకు ఓ బలమైన దర్శకుడి తోడు…

ఇదేమీ మొగుడు పెళ్లాల ముచ్చట కాదు. లేదా స్నేహబంధం కుబుర్లు కాదు. అచ్చంగా టాలీవుడ్ ముచ్చట. అవును, ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే ట్రెండ్. ప్రతి నిర్మాణ సంస్థకు ఓ బలమైన దర్శకుడి తోడు కావాలి. అలాంటి తోడు వుంటే ఇక ఆ నిర్మాణ సంస్థదే భాగ్యం అంతా. సరైన దర్శకుడి మద్దతు వున్న సంస్థలే ఇప్పుడు టాలీవుడ్ లో కోట్లకు కోట్లు కొల్ల గొడుతున్నాయి. నిజానికి ఓ దర్శకుడు ఓ సంస్థకు ఎక్కువగా సినిమాలు చేయడం అన్నది కొత్త కాదు. అలనాటి కేవి రెడ్డి, ఆదుర్తి, వి మధుసూదనరావు ఇలా చాలా మంది దగ్గర నుంచి కొనసాగుతోంది. కానీ ఇప్పుడు ట్రెండ్ వేరు. దర్శకులు ఏకంగా ఓ సంస్థను ఎంచుకుని వాటితో ఫిక్స్ అయిపోవడం.

దర్శకుడు త్రివిక్రమ్ లేకుంటే హారిక హాసిని, సితార సంస్థల పరిస్థితి ఏమిటి? ఇప్పుడు అవి ఓ రేంజ్ కు చేరుకుని వుండొచ్చు. కానీ వాటి స్థాయికి, బలానికి ఫౌండేషన్ అండ దండ త్రివిక్రమ్ నే కదా. త్రివిక్రమ్ కారణంగానే పెద్ద హీరోల సినిమాలు అన్నీ వచ్చాయన్నది వాస్తవం. అలాగే సితార సినిమాలకు క్వాలిటీ చెక్, పెద్ద దిక్కు కూడా త్రివిక్రమ్ నే కదా. కథలు వింటారు. కరెక్షన్లు చెబుతారు. ఎడిటింగ్ కరెక్షన్లు చూస్తారు. ఇంకా..ఇంకా. ఇప్పుడు వేల కోట్ల సినిమా అనిపించుకునే బన్నీ సినిమా చేయబోతున్నారు.

అంతే కాదు. మంచి మంచి దర్శకులను, నటులను ఇప్పుడు ఇదే థియరీతో తమ దగ్గరే వుంచేసుకుంటున్నారు. వెంకీ అట్లూరి, కళ్యాణ్, గౌతమ్ తిన్ననూరి ఇలాంటి పేర్లు అన్నీ వరుసగా సితారలోనే వినిపిస్తున్నాయి.

హారిక హాసిని-త్రివిక్రమ్ బంధం చూసి సుకుమార్ ను దగ్గరకు తీసారు మైత్రీ మూవీస్ అధినేతలు. రంగస్థలం నుంచి ప్రారంభమైంది బంధం. రంగస్థలంతో పాటు సుకుమార్ శిష్యుడు బచ్చిబాబు కూడా మైత్రీకే వచ్చారు. రంగస్థలం తరువాత పుష్ప, ఇప్పుడు పుష్ప 2, ఆపై రామ్ చరణ్ సినిమా. దేశ వ్యాప్తంగా క్రేజ్, వేల కోట్ల బిజినెస్ ఇదంతా పుష్ప 2 స్వంతం. ఎలా? సుకుమార్ ద్వారా.

అశ్వనీదత్ పెద్ద నిర్మాత, భారీ సినిమాలు తీసారు. కానీ కల్కి సినిమా ఆయన ఖాతాలో పడింది అంటే మాత్రం కారణం దర్శకుడు నాగ్ అశ్విన్. మహానటి, కల్కి ఇవన్నీ నాగ్ అశ్విన్ కారణంగానే. అంతే కాదు. సీతారామం, జాతిరత్నాలు సినిమాకు తెర వెనుక అన్నీ విధాలుగా చూసుకున్నదీ నాగ్ అశ్విన్ నే. ఆ విధంగా ఆ సంస్థకు అతగాడి అండ వుంది.

నిజానికి ఇలాంటి అండ వుంచుకునే అవకాశం వచ్చింది ప్రయిమ్ షో నిరంజన్ రెడ్డికి. కానీ తనకు భారీ సక్సెస్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ ను పట్టి వుంచుకోలేకపోయారు. వదిలేసుకున్నారు. కారణాలు వారిద్దరికే తెలియాలి. నిజానికి పెద్ద దర్శకులను పట్టి వుంచుకోవడం అంత సులువు కాదు. కొన్ని వదులుకుంటేనే ఇది సాధ్యం. అలా కాకుండా ఎందుకు వదలుకోవాలి అనుకుంటే దర్శకుడిని వదిలేసుకోవాల్సి వస్తుంది.

నిర్మాత దిల్ రాజు ఆస్థానంలో కూడా ఇలా దర్శకులు వుండేవారు. కానీ ఆయన ఎందుకో ఈ దిశగా ఆలోచించినట్లు లేదు. వంశీపైడిపల్లి, అనిల్ రావిపూడి, వేణు శ్రీరామ్ ఇలా చాలా మంది ఆయన కంపెనీకి వుండేవారు. కానీ స్థిరంగా ఆయన కంపెనీకే కాదు. అదే సమస్య

ఇలా ఓ మంచి దర్శకుడి అండ లేని సంస్థలు అన్ని విధాలా నష్టపోతున్నాయి. ఇది కేవలం డబ్బు సమస్య కాదు. బ్యాకెండ్ లో సలహాలు, సూచనలు, క్వాలిటీ చెక్, ఇంకా.. ఇంకా. పీపుల్స్ మీడియాకు ఇలాంటి ఓ దర్శకుడి అండ వుండి వుంటే ఎక్కడో వుండేది. అది లేకనే మిస్టర్ బచ్చన్, రామబాణం లాంటి స్క్రిప్ట్ లు తలకెత్తుకుని, కోట్లకు కోట్లు నష్టపోతోంది.

బోగవిల్లి ప్రసాద్ చాలా సీనియర్. తన బ్యానర్ లో ఒక్క దర్శకుడిని పట్టి వుంచలేకపోతున్నారు. యువి లాంటి పెద్ద సంస్థ కూడా అలా చేయలేకపోయింది. ఇకపైనన్నా కొత్త దర్శకులను పరిచయం చేసే ముందు, సక్సెస్ లు చూసిన తరువాత నిర్మాతలు ఇదే దారిలో వెళ్తే బెటరేమో? అలా అని సక్సెస్ లు కొట్టిన అందరూ దీనికి పనికి రారు. మల్టీ టాలెంటెడ్ పర్సన్ లు కావాలి.

5 Replies to “దర్శకుడు ఒకరు వుండిన అదే భాగ్యము!”

Comments are closed.