టిల్లూ స్క్వేర్ విడుదలకు ముందు సంగతి. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నిర్మాత నాగవంశీ ఓ భారీ స్టేట్ మెంట్ ఇచ్చాడు. తమ సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరుతుందనేది ఆ స్టేట్ మెంట్. ఆ టైమ్ లో ఆ కామెంట్ చాలామందిని ఆశ్చర్యపరిచింది. కానీ రిలీజై, మొదటి వారాంతం గడిచిన తర్వాత చూస్తే, అతడు చెప్పిందే నిజమయ్యేలా ఉంది.
అంతా ఊహించినట్టుగానే టిల్లూ స్క్వేర్ సినిమా సూపర్ హిట్టయింది. అయితే వంద కోట్ల రేంజ్ కు వెళ్తుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేదు. ఇప్పుడు అది కూడా సాకారం అయ్యేలా ఉంది. ఇప్పటికే ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా, 3 రోజుల్లో ఏకంగా వరల్డ్ వైడ్ 68.1 కోట్ల రూపాయల గ్రాస్ కొల్లగొట్టింది.
మరో 3 రోజులు ఇదే ఊపు కొనసాగితే, ఈ సినిమా కచ్చితంగా వంద కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరిపోతుంది. అటు ఓవర్సీస్ లో టిల్లూ స్క్వేర్ పెద్ద హిట్టయింది. 2 మిలియన్ డాలర్ల వసూళ్లు సాధించే దిశగా దూసుకుపోతోంది.
సో.. నాగవంశీ చెప్పింది నిజం కాబోతోంది. మరికొన్ని రోజుల్లో టిల్లూ స్క్వేర్ వంద కోట్ల క్లబ్ లోకి చేరుతుంది. ఇప్పటికే కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయిన ఈ సినిమా.. టైర్-2 హీరోలకు భారీ టార్గెట్ సెట్ చేసే దిశగా పయనిస్తోంది.