గత వారంలో విడుదల అయిన చిన్న సినిమాల్లో ఒకటైన బ్రాందీ డైరీస్ చూపు ఇప్పుడు ఓటీటీ మీద పడింది. వాస్తవానికి చిన్న సినిమాలకు గత వారం మంచి అవకాశమే లభించింది. పెద్ద సినిమాలు పోటీ లేకపోవడంతో ఎక్కువ సంఖ్యలో థియేటర్లు దక్కాయి. బ్రాందీ డైరీస్ కూడా పెద్ద సంఖ్యలోని థియేటర్లలోనే విడుదల అయ్యిందట. అయితే కరోనా పరిస్థితుల్లో ప్రేక్షకులు ధైర్యంగా థియేటర్ల తలుపు తట్టడానికి ఇంకా వెనుకాడుతూ ఉండటంతో.. ఎక్కువ సంఖ్య థియేటర్లలో విడుదల అయినా, కలెక్షన్ల విషయంలో మాత్రం నిరాశ ఎదురయిన పరిస్థితి.
థియేటర్లకు రెంట్లను చెల్లించినా, ప్రేక్షకులు థియేటర్లకు సులువుగా రాకపోవడంతో ఈ సినిమాలపై కలెక్షన్ల వర్షం అవకాశాలు బాగా తగ్గాయి. అయితే ధైర్యంగా విడుదల అయితే.. చేసిన నేపథ్యంలో, వచ్చిన బజ్ తో ఈ సినిమాను ఓటీటీ, డిజిటల్ రైట్స్ అమ్మకం గురించి ప్రయత్నాలు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ట్రెండింగ్ టైటిల్ తో వచ్చిన బ్రాందీ డైరీస్ .. కూడా ఇప్పుడు ఓటీటీ, డిజిటల్ రైట్స్ మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది.
మద్యపానం ఆరోగ్యానికి హానికరం..అనే పాయింట్ ను చెప్పడం అనే కాన్సెప్ట్ తో ఏకంగా ఒక సినిమానే రూపొందించారు. పరిమిత వనరులతో రూపొందిన ఇండిపెండెంట్ సినిమా. ఒక రకంగా చెప్పాలంటే అభినందించదగిన ప్రయత్నం కూడా! మద్యం బారిన పడి యువత తమ కెరీర్ ను చెల్లాచెదురుచేసుకునే వైనాన్ని, కుటుంబాలను మద్యం దెబ్బతీసే వైనాన్ని కూలంకషంగా చర్చించారు. కాన్సెప్ట్ కు తగ్గట్టుగా సంభాషణలు కూడా ఇన్నొవేటివ్ గా ఉంటాయి.
థియేటర్లలో పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో విడుదల అయిన ఈ సినిమాకు డిజిటల్, ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది. అక్కడ ఈ సినిమా మంచి అమ్మకం రేటును రాబట్టుకుంటే.. ఈ మూవీ మేకర్ల ప్రయత్నం సఫలం అయినట్టే.