Aay Review: మూవీ రివ్యూ: ఆయ్

లో బడ్జెట్టులో, పెద్దగా హంగులేవీ లేకుండా కేవలం కథ చెప్పడం మీదనే దృష్టి పెట్టి తీసిన సినిమా ఇది.

చిత్రం: ఆయ్
రేటింగ్: 2.75/5
తారాగణం: నార్నె నితిన్, నయన్ సారిక, రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య, గోపి, సురభి ప్రభావతి, వినోద్ కుమార్, శ్రీనివాస్ వడ్లమాని తదితరులు
కెమెరా: సమీర్ కళ్యాణి
సంగీతం: రాం మిరియాల, అజయ్
ఎడిటర్: పవన్ కళ్యాణ్
నిర్మాత: బన్నీ వాసు
దర్శకత్వం: అంజి కె మణిపుత్ర
విడుదల: 15 ఆగస్టు 2024

“మ్యాడ్” లో ముగ్గురిలో ఒకడిగా నటించిన నార్నె కార్తిక్, కొత్తమ్మాయి నయన్ సారిక జంటగా నటించిన “ఆయ్” అలరిస్తుందనే సంకేతాలు ట్రైలర్ ని బట్టి వచ్చాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ కావడంతో నమ్మకం ఇంకాస్త పెరిగింది.

కథలోకి వెళితే కార్తిక్ (నార్నె నితిన్) ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్. కరోనా సంధికాలంలో వర్క్ ఫ్రం హోం ప్రకటించగానే గోదావరి జిల్లాలోని తన సొంత ఊరుకి వస్తాడు. అక్కడ చిన్ననాటి ఫ్రెండ్స్ సుబ్బు (కసిరెడ్డి రాజ్ కుమార్), హరి (అంకిత్ కొయ్య) అతనికి తోడవుతారు. అదే ఊరికి చెందిన పల్లవి (నయన్ సారిక) అనే అమ్మాయిని ఇష్టపడతాడు కార్తిక్. ఆమె కూడా సానుకూలంగా స్పందిస్తుంది.

అయితే ఆమెకు క్యాస్ట్ ఫీలింగ్ జాస్తి. తన తండ్రినుంచి పుచ్చుకున్న వారసత్వమది. కార్తిక్ ది తన క్యాష్ట్ కాదన్న కారణం చేత ఆమె పెళ్లికి మాత్రం “నో” చెబుతుంది. ఇంతకీ హీరోయిన్ ఉద్దేశ్యమేమిటి? హీరో ఈ సమస్యని ఎలా అధిగమిస్తాడు? అనేది తక్కిన కథ.

నటీనటులు, మేకింగ్ స్టాండర్డ్స్ పరంగా ఒక దశలో సుదీర్ఘమైన షార్ట్ ఫిలిం చూస్తున్న ఫీలింగొస్తుంది. డైలాగుల్లో పదును ఇంకా ఉండొచ్చు. ఈవీవీ, జంధ్యాల వంటి దర్శకులు తీసిన చిత్రాల్లో డైలాగులు, కౌంటర్లు చాలా బలంగా ఉండేవి. ఈ రచయిత కూడా ఆ స్థాయిని అందుకునే ప్రయత్నం చేసుండాలిసింది. నటీనటుల డైలాగ్ డెలివెరీ టైమింగ్ పట్ల కూడా దర్శకుడు ఇంకాస్త అవగాహన పెంచుకోవాలి.

నటీనటుల గురించి చెప్పుకోవాలంటే.. నార్నె నితిన్ కి జూనియర్ ఎన్.టి.ఆర్ బావమరిదిగా గుర్తింపు. అతనా అడ్రస్ నుంచి బయటికొచ్చి స్వంతంగా ఎదగాలంటే నటన మీద, మేకోవర్ మీదా చాలా దృష్టి పెట్టాలి. ప్రస్తుతమున్న కాంపిటీషన్లో హీరోగా నిలబడాలంటే ఎంచుకునే సబ్జెక్ట్స్ విషయంలో కూడా విపరీతమైన కృషి చేయాలి.

నయన్ సారిక పేరుకు తగ్గట్టు నయనాలతో ఆకట్టుకుంది. నటన పరంగా కూడా ఈజ్ చూపించింది.

రాజ్ కుమార్ కసిరెడ్డి, అంకిత్ కొయ్య జంట హాస్యాన్ని పండించారు.

వినోద్ కుమార్ పాత్ర చిన్నదే అయినా చివరికి అర్ధవంతమైన సీన్లొ తన పాత్రకి అర్ధం చేకూరింది. మైం గోపి ఓకే.

పనిమనిషిగా చేసిన నటి కూడా తన హైపర్ యాక్టివ్ నటనతో ఆకట్టుకుంది.

మొబైల్లో నీలిచిత్రాలు చూస్తూ గడిపే వృద్ధుడి సీన్ ఒకసారికి ఓకే గానీ, పదే పదే రావడం విసిగిస్తుంది. వెగటుగా కూడా ఉంది.

గోదావరి సీమ పచ్చదనాన్ని, వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాడు ఛాయాగ్రహకుడు. సంగీతం జస్ట్ ఓకే. సూఫియానా అనే పాట తప్ప తక్కినవన్నీ రొట్టకొట్టుడుగా ఉన్నాయి.

ప్రధమార్ధం సరదాగా సాగి ఇంటర్వల్ ట్విస్ట్ తో ఆగుతుంది. రెండో సగానికి వచ్చే సరికి కథ కులాల యాంగిల్ తీసుకుని డ్రాగ్ చేసినట్టుగా అనిపిస్తుంది. కానీ చివర్లో వచ్చిన 15 నిమిషాల సెంటిమెంటల్ ఎపిసోడ్ వల్ల పైన చెప్పుకున్న మైనస్సులన్నీ మర్చిపోయేలా చేస్తుంది.

లో బడ్జెట్టులో, పెద్దగా హంగులేవీ లేకుండా కేవలం కథ చెప్పడం మీదనే దృష్టి పెట్టి తీసిన సినిమా ఇది. కొన్ని లోపాలున్నా క్యాష్ట్ ఫీలింగ్ వల్ల సమాజంలో ఒరిగేదేం లేదు అనే సందేశాన్ని హాస్యంతో కూడిన ప్రేమకథ ద్వారా చెప్పాలనుకున్న ప్రయత్నాన్ని మెచ్చుకోవచ్చు. సినిమాటిక్ వండర్లు, అద్భుతాలు ఆశించకుండా టైం పాస్ కోసం చూడాలనుకునే వారికి ఈ చిత్రం ఓకే.

బాటం లైన్: కామెడీ కాలక్షేపం

16 Replies to “Aay Review: మూవీ రివ్యూ: ఆయ్”

  1. జీ ఏ గాడి ఈగో ని హరీష్ శంకర్ హర్ట్ చేశాడు..

    ఆతని సినిమా ఫ్లాప్ అవ్వాలంటే ఇలాంటి ముతక సినిమలన్నింటినీ లేపాలి

  2. సినీమా ఇంపాక్ట్ : 5%

    క్లైమాక్స్ ఇంపాక్ట్ : 95%

    అంత పవర్ ఫుల్ మెసేజ్ ఉంది.. క్లైమాక్స్ లో..

    ధియేటర్ లో తప్పక చూడండి..

Comments are closed.