సినిమా రివ్యూ: కె.జి.యఫ్‌

రివ్యూ: కె.జి.యఫ్‌ – చాప్టర్‌ 1 రేటింగ్‌: 2.5/5 బ్యానర్‌: వారాహి చలనచిత్రం, హొంబాలె ఫిలింస్‌ తారాగణం: యష్‌, శ్రీనిధి షెట్టి, అనంత్‌ నాగ్‌, అచ్యుత్‌ కుమార్‌, మాళవిక అవినాష్‌, అయ్యప్ప పి. శర్మ,…

రివ్యూ: కె.జి.యఫ్‌ – చాప్టర్‌ 1
రేటింగ్‌: 2.5/5
బ్యానర్‌: వారాహి చలనచిత్రం, హొంబాలె ఫిలింస్‌
తారాగణం: యష్‌, శ్రీనిధి షెట్టి, అనంత్‌ నాగ్‌, అచ్యుత్‌ కుమార్‌, మాళవిక అవినాష్‌, అయ్యప్ప పి. శర్మ, తమన్నా భాటియా తదితరులు
సంగీతం: రవి బస్రూర్‌
కూర్పు: శ్రీకాంత్‌
ఛాయాగ్రహణం: భువన్‌ గౌడ
నిర్మాత: విజయ్‌ కిరగందుర్‌
రచన, దర్శకత్వం: ప్రశాంత్‌ నీల్‌
విడుదల తేదీ: డిసెంబర్‌ 21, 2018

ట్రెయిలర్‌తో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించి, అందరి దృష్టిని ఆకర్షించిన కన్నడ చిత్రం 'కె.జి.యఫ్‌' మొదటి అధ్యాయం ఆ సంచలనానికి తగ్గట్టే వుందా? యూనివర్సల్‌ అప్పీల్‌ వుందనుకున్న ఈ కన్నడ చిత్రం కర్ణాటక దాటి ఇతర రాష్ట్రాల వారిని ఆట్టుకోగలదా?

విఖ్యాతి గాంచిన కె.జి.యఫ్‌ అనగా 'కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌' నేపథ్యంలో అల్లుకున్న ఫిక్షనల్‌ స్టోరీ ఇది. ఈ ఇతివృత్తం కేవలం ఒక ప్రాంతాన్ని మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఆకట్టుకోగలిగే లక్షణాలున్నదే అనిపించినా కానీ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కె.జి.యఫ్‌ని బ్యాక్‌డ్రాప్‌కే పరిమితం చేసి తన హీరో యష్‌ని 'లార్జర్‌ దేన్‌ లైఫ్‌' హీరోని, సూపర్‌ హీరోని చేయడంతో కన్నడ యాక్షన్‌ చిత్రాన్ని చూస్తోన్న ఫీలింగ్‌ మాత్రమే కలుగుతుంది.

'హీరో వర్షిప్‌' అనేది మాస్‌ సినిమాల్లో ఒక స్థాయి వరకు యాక్సెప్టబుల్‌. అయితే ఇక ప్రతి సన్నివేశంలో హీరో వర్షిప్‌, సోకాల్డ్‌ ఎలివేషన్‌ మీదే దృష్టి పెడతా కానీ ఎంతో డెప్త్‌ వున్న స్టోరీని డీప్‌గా ఎక్స్‌ప్లోర్‌ చేయను అంటే అది సదరు హీరో అభిమానులని దాటి రీచ్‌ అవలేదు. ప్రశాంత్‌ నీల్‌ 'కె.జి.యఫ్‌'లో బానిసత్వాన్ని, సదరు ఫీల్డ్స్‌ యజమానుల నిరంకుశత్వాన్ని, అక్కడి రక్షకుల కర్కశత్వాన్ని చూపిస్తూ సదరు పరిస్థితుల నుంచి పుట్టుకొచ్చిన హీరోని చూపించి వుండొచ్చు. ఎమోషనల్‌ కనక్ట్‌కి ఎక్కువ అవకాశమున్న పంథా ఇది. కానీ ఒక 'వన్‌ మ్యాన్‌ ఆర్మీ' లాంటి హీరోనే సరాసరి కె.జి.యఫ్‌కి పంపించడం వల్ల హీరో ఎలివేషన్‌కి మినహా ఈ బ్యాక్‌డ్రాప్‌ ఉపయోగ పడలేదు.

'పుట్టేటపుడు పేదరికంలో పుట్టడం నీ తప్పు కాదు. పోయేటపుడు పేదవాడిగా పోతే మాత్రం నీ తప్పే' అనే కోట్‌ని ఒక తల్లికి అన్వయించి… 'ఎలా బతుకుతావో తెలీదు. కానీ చనిపోయేటపుడు మాత్రం రాజులా, శ్రీమంతుడిలా చనిపోవాలి' అని ఓ పిల్లాడికి చెప్పించడంతో కె.జి.యఫ్‌ మొదలవుతుంది. తల్లి మాటని అనుసరించి డబ్బు కోసం, పవర్‌ కోసం పసితనం నుంచి తపించిపోయే పిల్లాడు రామకృష్ణ పవన్‌ ముంబయిని గడగడలాడించే రాకీ (యష్‌) అనే బ్రాండ్‌గా ఎదుగుతాడు. ముంబయిని గుప్పెట్లో పెట్టుకునే అవకాశం ఫలానా కె.జి.యఫ్‌ అధినేతని చంపితే వస్తుందని తెలిసి డీల్‌ ఒప్పుకుంటాడు. అతడిని చంపడం కోసం కె.జి.యఫ్‌ గనుల్లోకి ఒక కార్మికుడిగా వెళతాడు. అక్కడ్నుంచి అదను చూసి తన లక్ష్యం ఎలా చేరుకుంటాడనేది కె.జి.యఫ్‌ మొదటి అధ్యాయం.

అటు కె.జి.ఎఫ్‌ విస్తరణతో పాటు అది కనుగొన్న రోజే పుట్టిన రాకీ ఎదుగుదలని దర్శకుడు సమాంతరంగా చూపిస్తుంటాడు. చిన్న పిల్లాడిగా పవర్‌ కోసం పాకులాడిన రాకీ పెద్దయ్యే సరికి చావు దెబ్బలు తిని, చేతులు ఇనప గొలుసులతో కట్టేసి వున్నా వంద మంది రౌడీలు వణికిపోయే వస్తాదు అన్నట్టుగా పరిచయమవుతాడు. అతడిని డాన్‌ అనడానికి లేదు. ఎందుకంటే అతని వెంట ఒక గ్యాంగ్‌ వుండదు. కానీ అతను ఒక్కడు కూర్చుని వుంటే వందల మంది వెనక్కి పారిపోతుంటారు.

ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా ఒక్కడే అన్నట్టుగా ఆది నుంచీ రాకీని సూపర్‌ పవర్‌లా చిత్రీకరిస్తూ వెళ్లడమే కాకుండా అతని ధీరత్వాన్ని, కండబలాన్ని కథలు, కథలుగా చెప్పడానికి పలు పాత్రల తాలూకు నెరేషన్‌ని కూడా దర్శకుడు వాడుతుంటాడు. 'ఓకే… రాకీ బలవంతుడు. ఏదైనా చేయగలిగిన వాడు. ఎంతటి సైన్యాన్ని అయినా ఒంటి చేత్తో మట్టుబెట్టగలడు' లాంటి పాయింట్స్‌ అన్నీ మొదటి సీన్లోనే రిజిష్టర్‌ అయిపోయినా కానీ అదే విషయాన్ని పదే పదే చెబుతూ, చూపిస్తూ అసలు కథలోకి మాత్రం ఎంతకీ వెళ్లడు.

సినిమా అంటేనే వాస్తవాతీత సంఘటనలని, పాత్రలని నిజమన్నట్టు భ్రమ కలిగించడం… పోనీ అలాంటి భ్రమకి జనం లోనవడం అనుకున్నా కానీ సదరు 'రాకీ' మాత్రం ఎంతటి భ్రమలో వున్నా కానీ 'ఇది నమ్మశక్యంగా లేదు' అనిపించేంత అన్‌రియలిస్టిక్‌గా కనిపిస్తుంటాడు. ఆ అవాస్తవిక ప్రెజెంటేషన్‌కి తోడు ఎంతకీ పాయింట్‌కి వెళ్లడు ఈ చిత్ర దర్శకుడు. ప్రథమార్ధంలో ఎలాగైతే అదే పనిగా చెప్పిందే చెబుతూ రాకీని ఎలివేట్‌ చేస్తుంటాడో, ద్వితియార్థంలో బంగారు గనుల్లో జనాల కష్టాలని అదే విధంగా మళ్లీ మళ్లీ రుద్దుతుంటాడు.

అన్ని సన్నివేశాలని వారు పడుతోన్న కష్టాల కోసం కేటాయించినా కానీ వారి కోసం కాసింత అయినా ఎమోషన్‌ కలగకపోవడం, వారి పట్ల సింపతీ ఏర్పడకపోవడం ఖచ్చితంగా దర్శకత్వ లోపమే. ఉదాహరణకి రాజమౌళి చిత్రాల్లో (ఛత్రపతి, విక్రమార్కుడు) ఇలాంటి నియంతలు విలన్లుగా కనిపించేవారు. వారిని ఎస్టాబ్లిష్‌ చేయడానికి రాజమౌళి ఒక పది సన్నివేశాలు తీయడు. రెండే సన్నివేశాల్లో ప్రజలు పడుతోన్న కష్టాలని చూపించడంతో పాటు విలన్లని హీరో చంపేయాలన్నంత కసి ప్రేక్షకుల్లో కలిగిస్తాడు.

ఎంత మాస్‌ చిత్రమైనా, ఎంతటి హీరో ఎలివేషన్‌ అయినా సదరు సింప్లిసిటీ అవసరం. విషయాన్ని క్లుప్తంగా చెప్పినప్పుడే ఆ భావన లోతుగా తగులుతుంది. సదరు హీరో రేంజ్‌ పెరుగుతుంది. ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌లో ఆ 'క్లుప్తత' లోపించింది. ఆరంభంలో రాకీకి ఇచ్చిన ఎలివేషన్స్‌ మెప్పించినా పోను పోను మాస్‌ మసాలాలని ఇష్టపడే వారికి కూడా మొహం మొత్తే రేంజ్‌కి అవి వెళ్లిపోయి 'చాలు.. ఇక పాయింట్‌కి రా' అనిపిస్తాయి. హీరో ఎలివేషన్‌ సీన్లలో రాజమౌళి ప్రభావం, స్క్రీన్‌ప్లే ఫార్మాట్‌పై ఉపేంద్ర (ఏ సినిమా) ఎఫెక్ట్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో కనిపిస్తుంది.

దుస్సాధ్యమైన కోలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌లోకి హీరో ఎంట్రీ, అక్కడ్నుంచి విలన్‌ వరకు హీరో చేరుకుని లక్ష్యాన్ని సాధించడం లాంటివి చాలా ఎఫెక్టివ్‌గా వుండాలి. అలాంటి చోట్ల కేవలం కథానాయకుడి బలాన్ని మాత్రమే చూపించేసి అతని వల్ల ఏదైనా సాధ్యమే కనుక 'ఇదీ నమ్మేయండి' అన్నట్టుంటుంది సన్నివేశాల ధోరణి. అవసరం లేని దృశ్యాలపై అపరిమితమైన ఫోకస్‌, కీలకమైన సన్నివేశాల్లో మాత్రం 'హీరో మాస్‌ ఇమేజ్‌' వెనుక హైడింగ్‌ 'కె.జి.యఫ్‌'ని ఆల్‌ స్టయిల్‌… లెస్‌ సబ్‌స్టెన్స్‌ సినిమాగా పరిమితం చేసేసింది.

నటీనటవర్గంలో హీరో యష్‌కి మంచి మాస్‌ కటౌట్‌ వుంది. బాహుబలిలా చూపించిన అతడికి ఆ బలం వుందనే నమ్మకమైతే కలుగుతుంది. కథానాయిక అవసరమే లేని ఈ చిత్రంలోకి శ్రీనిధి షెట్టికి స్పేస్‌ క్రియేట్‌ చేయాల్సి వచ్చింది. ఆమె ఎందుకని హీరోని ప్రేమిస్తుందనేది ఆమెకీ, దర్శకుడికీ మాత్రమే తెలిసుండాలి. లెక్కకు మించి వున్న విలన్స్‌లో దాదాపుగా అందరూ ఓవరాక్షనే చేసారు. సాంకేతికంగా మాత్రం ఈ చిత్రం ఉన్నత స్థాయిలో తెరకెక్కింది. సెట్స్‌, ప్రొడక్షన్‌ డిజైన్‌, సినిమాటోగ్రఫీ, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ టాప్‌ క్లాస్‌ అనిపిస్తాయి.

ఎంతో పొటెన్షియల్‌ వున్న కథని ఎక్కడో గనుల లోతుకి కప్పెట్టేసి, హీరోకి మాత్రం బంగారు పూత పూసి పైన నిలబెట్టి ఒక అధ్యాయం ముగిసిందనిపించేసిన దర్శకుడు కనీసం అధ్యాయం 2లో అయినా క్యారెక్టర్‌ డెవలప్‌మెంట్‌కి, ఎమోషనల్‌ కనక్ట్‌కి ఇంపార్టెన్స్‌ ఇస్తాడా లేక హీరో వర్షిప్‌తోనే కానిచ్చేస్తాడా అనేది వేచి చూడాలి.

బాటమ్‌ లైన్‌: కె.జి.యఫ్‌లో ఛత్రపతి!
– గణేష్‌ రావూరి

పడి పడి లేచె మనసు… పడి… మళ్లీ లేవలేదు! ఎందుకో తెలుసా? 

భేకార్ మాటల్.. థియేటర్స్ గుప్పిట్లో పెట్టుకుని డ్యాన్స్ ఏస్తామా