Mathu Vadalara 2: మూవీ రివ్యూ: మత్తు వదలరా 2

ఇలాంటి సినిమాల్లో లాజిక్కులు చూడకూడదు నిజమే, కానీ ఆ స్థాయిలో కామెడీ పండినప్పుడు మాత్రమే లాజిక్కుల వైపు ఆలోచన వెళ్లదు.

చిత్రం: మత్తు వదలరా 2
రేటింగ్: 2.5/5
తారాగణం: శ్రీసింహా కోడూరి, సత్య, సునీల్, వెన్నెల కిషోర్, ఫరియా అబ్దుల్లా, అజయ్, ఝాన్సీ, రోహిణి తదితరులు
సంగీతం: కాలభైరవ
కెమెరా: సురేష్ సారంగం
నిర్మాత: చెర్రీ
రచన- దర్శకత్వం: రితేష్ రానా
విడుదల: 13 సెప్టెంబర్ 2024

క్రైమ్ కామెడీ సినిమాల్లో మత్తు వదలరా సినిమా ట్రెండ్ సెట్టర్. అలాంటి హిట్ సినిమాకు సీక్వెల్ గా వచ్చింది మత్తు వదలరా 2 సినిమా. సీక్వెల్ కోసం కావాల్సిన సెటప్ మొత్తం బాగానే సిద్ధం చేశాడు దర్శకుడు. ఇంతకీ మొదటి సినిమా రేంజ్ లో ఈ సీక్వెల్ ఉందో లేదో చూద్దాం

మొదటి భాగంలో ఓ క్రేజీ కేసు నుంచి తప్పించుకున్న బాబు (శ్రీసింహా), యేసు (సత్య) గత్యంతరం లేక హీ-టీమ్ లో చేరతారు. కిడ్నాప్ కేసులు ఛేదించడంలో ఫేమస్ అవుతారు. అయితే వాళ్లకు ఇచ్చే జీతం సరిపోక, ఛేదించే కేసుల నుంచే కొంత ‘తస్కరించి’ డిపార్ట్ మెంట్ లో అబద్ధాలు చెబుతుంటారు. ఈసారి కాస్త గట్టిగా తస్కరించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోతారు. ఏకంగా ఓ మర్డర్ కేసులో ఇరుక్కుపోవడమే కాక, పక్కా సాక్ష్యాలతో బుక్కయిపోతారు. ఈ కేసు నుంచి బాబు- యేసు ఎలా బయటపడ్డారు. వాళ్లకు అదే హీ-టీమ్ లో పనిచేస్తున్న నిధి (ఫరియా అబ్దుల్లా) ఎలా సహకరించింది అనేది ఈ సినిమా స్టోరీ.

ఈ సినిమాలో కథ- కథనం కంటే కామెడీనే చూడండి అంటూ దర్శకుడు రితేష్ రానా ప్రచారంలో చెబుతూనే ఉన్నాడు. అతడు చెప్పింది నిజం. ఈ సినిమాలో లాజిక్స్ కోసం వెదక్కూడదు. కామెడీని ఎంజాయ్ చేయాలంతే. ఈ విషయంలో సినిమా తొలి భాగం పైసా వసూల్ అనిపిస్తుంది.

మరీ ముఖ్యంగా సత్య కామెడీ హైలెట్. అతడి వన్- లైనర్ పంచ్ లు, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ అన్నీ బాగున్నాయి. ఇంకా చెప్పాలంటే, మొదటి భాగం వరకు హీరో సత్యానే. అలా ఇంటర్వెల్ పాయింట్ వరకు సినిమాను బాగానే లాక్కొచ్చాడు దర్శకుడు. మలి భాగంపై మరిన్ని అంచనాలు పెంచుతూ ఇంటర్వెల్ కార్డు వేస్తాడు.

కానీ సెకండాఫ్ కు వచ్చేసరికి కథ ముందుకొచ్చింది, సత్య కమెడీ వెనక సీటుకు చేరుకుంది. కథను ముందుకు తీసుకెళ్లి కంచికి చేర్చే క్రమంలో దర్శకుడు కామెడీ డోస్ తగ్గించాడు. అక్కడక్కడ కామెడీ ఉన్నప్పటికీ.. ఫస్టాఫ్ లో వినిపించిన స్థాయిలో సెకెండాఫ్ లో థియేటర్ లో నవ్వులు వినిపించలేదు. ఎప్పుడైతే కామెడీ తగ్గిందో, ఆటోమేటిగ్గా ప్రేక్షకుడి దృష్టి కథపైకి వెళ్లింది.

లాజిక్కులే లేకుండా వచ్చే సన్నివేశాలు, ఒకే సెటప్ లో అక్కడక్కడే తిరుగుతున్నట్టు అనిపించే కథనం కాస్త ఇబ్బంది పెడుతుంది. తిరిగి ప్రీ-క్లయిమాక్స్ నుంచి సినిమా ఊపందుకుంది. మరోసారి సత్య మార్క్ కామెడీతో సినిమాను ముగించారు.

ఇప్పటివరకు మనం హీరో గురించి చెప్పుకోలేదు. కేవలం సత్య గురించి మాత్రమే చెప్పుకున్నాం. అది నిజమే, ఈ సినిమాలో హీరో కంటే సత్యానే ఎక్కువ ఆకర్షిస్తాడు. చాలా స్క్రీన్ టైమ్ అతడే తస్కరించాడు. ఈ సినిమా అతడి కెరీర్ లో బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలిచిపోతుంది. ఇక శ్రీసింహ తన గత సినిమాలతో పోలిస్తే మరింత మెరుగ్గా నటించాడు. కానీ అతడి బాడీ లాంగ్వేజ్ లో ఇంకాస్త ఎక్కువ చలాకీతనం కనిపిస్తే బాగుండేది.

కీలక పాత్రలు పోషించిన అజయ్, ఫరియా అబ్దుల్లా, రోహిణి తన పాత్రలకు న్యాయం చేయగా.. వెన్నెల కిషోర్ తన పార్ట్ వరకు బాగానే మెప్పించాడు. సునీల్ మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. అతడిలోని కామెడీ టైమింగ్ ను దర్శకుడు ఎక్కడా వాడుకోలేకపోయాడు. ఇంకా చెప్పాలంటే, సునీల్ పాత్ర నవ్వులు పంచకపోగా.. టోటల్ గా మిస్-ఫైర్ అయింది. అతడి క్యారెక్టర్ కూడా పండితే సినిమా నెక్ట్స్ లెవెల్లో ఉండేది. దీనికితోడు సెకెండాఫ్ లో కొన్ని లాజిక్కులు మిస్సయ్యాయి.

ఇలాంటి సినిమాల్లో లాజిక్కులు చూడకూడదు నిజమే, కానీ ఆ స్థాయిలో కామెడీ పండినప్పుడు మాత్రమే లాజిక్కుల వైపు ఆలోచన వెళ్లదు.

ఇందులో పావలా శ్యామల ఉండదనే విషయాన్ని ఓపెనింగ్ లోనే చెప్పేశారు. చిరంజీవి, పవన్ కల్యాణ్ సినిమాల రిఫరెన్సులు, పాటలు స్క్రీన్ ప్లేకు తగ్గట్టు బాగానే వాడుకున్నారు. దర్శకుడు రితేష్ రానా సీక్వెల్ తీయాలనే ఆలోచనతో కథ మొదలుపెట్టడమే, ఈ పార్ట్-2కు ఇబ్బందికరంగా మారింది. అప్పటి పాత్రల్ని బాగానే కొనసాగించినప్పటికీ, డ్రగ్స్ ఎలిమెంట్ ను కూడా బాగానే ఇరికించినప్పటికీ.. సెకెండాప్ లో తన మార్క్ రైటింగ్ ను అతడు కోల్పోయినట్టు అనిపిస్తుంది.

క్రైమ్ థ్రెడ్ పై దర్శకుడు అంతగా దృష్టి పెట్టలేదు. మొదటి భాగం అంత హిట్టవ్వడానికి కారణం, క్రైమ్ థ్రెడ్ లో ఉత్కంఠ. పార్ట్-2లో అది మిస్సయింది. క్లయిమాక్స్ లో చూపించిన ట్విస్ట్ కూడా షాకింగ్ గా అనిపించలేదు. దీనికి తోడు టీవీ సీరియల్ ఎపిసోడ్ కూడా ఆశించిన స్థాయిలో పేలలేదు. ఇంకా చెప్పాలంటే ట్రయిలర్ లో చూపించిన క్లిప్ మాత్రమే నవ్వించింది. ఇక ట్రయిలర్ లో చూపించిన వెన్నెల కిషోర్ క్లిప్ అయితే సినిమాలో లేనేలేదు. టీవీ సీరియల్ ఎపిసోడ్ ను, వెన్నెల కిషోర్ ట్రాక్ ను మరింత హిలేరియస్ గా రాసుకోవచ్చు.

టెక్నికల్ గా మూవీ బాగుంది. కాలభైరవ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సురేష్ సినిమాటోగ్రఫీ మూడ్ ను బాగా సెట్ చేసింది. డబ్బుల్లేని హీ-టీమ్ డిపార్ట్ మెంట్ కాబట్టి, సెట్ వర్క్ ను కూడా అలానే చూపించారు. ఎడిటింగ్ ఓకే.

ఓవరాల్ గా మత్తు వదలరా 2 సినిమాను సత్య కామెడీ కోసం ఓసారి చూడొచ్చు. మొదటి భాగాన్ని బాగా ప్రేమించిన ప్రేక్షకులు మాత్రం ఈ సీక్వెల్ ను చూసి కాస్త నిరాశచెందుతారు.

బాటమ్ లైన్ : కామెడీ ‘మత్తు’ సరిపోలేదు

5 Replies to “Mathu Vadalara 2: మూవీ రివ్యూ: మత్తు వదలరా 2”

Comments are closed.