Pottel Review: మూవీ రివ్యూ: పొట్టేల్

రొటీన్ రొట్టకొట్టుడు చిత్రాలు కాకుండా కాస్త కొత్త అనుభూతి పొందాలనుకునే ప్రేక్షకుల కోసం తీసిన చిత్రమిది.

టైటిల్: పొట్టేల్
రేటింగ్: 2.25/5
తారాగణం: యువచంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల, అజయ్, నోయెల్, ప్రియాంక శర్మ, శ్రీకాంత్ అయ్యంగర్, చత్రపతి శేఖర్ తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర
కెమెరా: మోనిష్ భూపతిరాజు
ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్
నిర్మాతలు: నిశాంక్ రెడ్డి, సురేష్ కుమార్
దర్శకత్వం: సాహిత్ మోతుకూరి
విడుదల తేదీ: 25 అక్టోబర్ 2024

పెద్ద నటీనటవర్గం కాకపోయినా “పొట్టేల్” ప్రచారం బాగా జరిగింది. అన్నీ కుదిరి జనం దృష్టి దీనిపై పడింది. నేడు విడుదలయ్యింది. ఎలా ఉందో చూద్దాం.

1980లలో తెలంగాణా పల్లెలో కథ మొదలవుతుంది. వంశపారంపర్యంగా ఆ ఊరి పటేళ్లకి అమ్మవారు పూనుతూ ఉంటుంది. అలా పూనినప్పుడు వాళ్లేది చెబితే అదే వేదం. అలా కొత్త పటేల్ (అజయ్) నిమ్నవర్గాల వాళ్లని బడికి వెళ్లకూడదని అమ్మవారి పూనకంలో చెబుతాడు. కానీ గంగాధర్ (యువచంద్ర) తన కూతురు సరస్వతి (తనశ్వి) ని చదివించాలనుకుంటాడు. అతని భార్య బుజ్జమ్మ (అనన్య నాగళ్ల) కి పటేల్ అసలు రూపం తెలుసు. అతను వేసేది వేషమని, నిజంగా అతనికి అమ్మవారు పూనదని ఆమెకు మాత్రమే తెలుసు. ఈ నేపథ్యంలో సరస్వతి చదువుని పటేల్ ఎలా అడ్డుకుంటాడు, దానికి గంగాధర్ ఎలా ఎదుర్కుని పోరాడతాడనేది కథ.

ఈ కథలో లోపం లేదు కానీ కథనంలో మాత్రం కొట్టొచ్చినట్టు లోపాలు కనిపించాయి. ముఖ్యంగా భావోద్వేగాలన్నీ బలవంతంగానో, కృతకంగానో ఉన్నాయి.

అమ్మవారు పూనే సన్నివేశాలు గగుర్పాటుకి గురిచేసేలా, వశీకరణంలా ఉండాలి. దానికి ప్రధానంగా నటుడి మెధడ్ యాక్టింగ్, కెమెరా వర్క్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అన్నీ వర్కౌట్ అవ్వాలి. ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ ఒక్కటే వర్కౌట్ అయ్యింది. ఎక్కిళ్ల శబ్దంతో కూడిన డైలాగ్ కూడా బాగుంది. కానీ అజయ్ ఆ పాత్రలో జీవించినట్టు లేదు. పాత్రపరంగా చేసేది నటనే అయినా అది ఎంత కన్విన్సింగ్ గా ఉంటే జనం నమ్ముతున్నారు అని అనిపించాలి చూసే ప్రేక్షకులకి. అదొక మైనస్.

అలాగే చదువు ప్రాముఖ్యత తెలుపుతూ మూఢవిశ్వాసాల మీద అవగాహన కల్పించాలనుకునే ఆలోచన బాగుంది. కానీ అది కూడా సగం-సగం వండిన వంటకంలా ఉడికీ ఉడికనట్టుగా తయారైంది.

ప్రధానంగా స్క్రీన్ ప్లేలో కొంత గందరగోళం, ఎడిటింగ్ దానిని సరిదిద్దలేకపోవడం జరిగింది. అందుకే అవసరానికి మించి వచ్చిన సీన్లే మళ్లీ వస్తూ నిడివి పెంచాయి తప్ప అనుభూతి కలిగించలేదు.

పేరుకు “పొట్టేల్” అని టైటిల్ పెట్టి ఒక పొట్టేల్ ని చూపించారు కానీ, ఈ సినిమాలో ఊరి జనమంతా గొర్రెలమందలాగానే ఉన్నారు. ఒక్కరూ తెలివిగా ఆలోచించరు హీరోతో సహా. అందరూ అమాయకులే. ఎవ్వరూ కనీస లోకజ్ఞానం ఉన్నట్టు కనపడరు. 1980ల నాటి కథన్నప్పుడు పోలీసులు, చట్టాలు ఏమైనట్టు? పైగా అవి నక్సలైట్ల రోజులు. వాళ్ళేమయ్యారు? ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి చూస్తున్నప్పుడు. కథనంలో ఎమోషన్ కొరవడినప్పుడే ఇలాంటి లాజికల్ ప్రశ్నలు పుడుతుంటాయి.

ప్రధమార్ధం కాసేపు ఆసక్తికరంగానే సాగింది. ఒక మూడ్ ని సెట్ చేసింది. పాటలు బాగున్నాయి. కానీ నెమ్మదిగా గ్రిప్ సడలుతూ వచ్చింది. కథగా తెర మీద కదులుతోంది కానీ మనసుకి హత్తుకోవడం ఆగింది. కొన్ని పాత్రలు చనిపోతున్నా, బాధపడుతున్నా ప్రేక్షకులకి పెద్దగా బాధకలగదు. కారణం ఇంపాక్ట్ లోపించడమే.

తమిళంలో పా రంజిత్, వెట్రిమారన్ తీసే సినిమాల టైపులో దళితులని ఎదగకుండా తొక్కి పెట్టే ఊరి పెద్ద కాన్సెప్ట్ ఇది. కానీ ఇక్కడ గ్రిప్పింగ్ గా తీయలేదు.

1980ల నాటి మారుమూల తెలంగాణా గ్రామంలోని వాతావరణాన్ని, యాసని తెర మీదకు తెచ్చే ప్రయత్నమైతే జరిగింది. కొంతవరకు పాసైనా ఇంకా పనితనం చూపించి ఉండొచ్చు అనిపిస్తుంది.

ఇంటర్వల్ ట్విస్ట్ పర్వాలేదనిపించినా, ద్వితీయార్ధంలో కష్టాల వలయం పెద్దదయిపోయి సహనాన్ని పరీక్షిస్తుంది.

రెండు గంటల నలభై నిమిషాల సుదీర్ఘ కథనం ఈ చిత్రం. రిపీట్ సీన్స్ తగ్గించి ఉన్నా కాస్త నిడివి తగ్గుండేది.

పైన చెప్పుకున్నట్టు అజయ్ కి మంచి అవకాశం వస్తే మెధడ్ యాక్టింగ్ చేయకుండా తనదైన రొటీన్ శైలిలో చేసుకుపోయాడు. ఈ పాత్రని తన నటనాప్రతిభని చూపించడానికి పూర్తిగా వాడుకుని ఉంటే అవార్డొచ్చేంత స్కోప్ ఉండేది.

అనన్య నాగళ్ల పాత్ర రొటీన్ గా మొదలయ్యి, కొంతసేపటికి బాగుందనిపిస్తూ అంతలోనే తేలిపోయింది.

యువచంద్ర జస్ట్ ఓకే. ఈ పాత్ర వరకు పర్వాలేదనిపించాడు. అతనిలో హీరోయిజం కంటే ఆద్యంతం బాధితుడే కనిపించాడు.

చైడ్ ఆర్టిస్ట్ తనశ్వి మాత్రం ఆకట్టుకుంది. ఆ వయసులో పాత్రకు అవసరమరమైన హావభావాలను చక్కగా పలికించింది.

ఈ చిత్రంలో మంచి విషయాలు- సందేశం, ప్రధమార్ధంలో సగం, నేపథ్య సంగీతం. మైనస్సుల విషయానికొస్తే– ఎమోషన్ అందకపోవడం, ద్వితీయార్ధం.

రొటీన్ రొట్టకొట్టుడు చిత్రాలు కాకుండా కాస్త కొత్త అనుభూతి పొందాలనుకునే ప్రేక్షకుల కోసం తీసిన చిత్రమిది. 1980ల నాటి మారుమూల తెలంగాణా ప్రాంతం నేపథ్యంలో సాగే కథ కనుక ఆ తరహా చిత్రాలను ఇష్టపడే వాళ్లకి బాగుండొచ్చు. అలా కాని ఆడియన్స్ మాత్రం జాతర పొట్టేళ్లుగా మిగిలిపోతారు.

బాటం లైన్: హత్తుకోలేదు

9 Replies to “Pottel Review: మూవీ రివ్యూ: పొట్టేల్”

    1. Paid review le basu. vadiley.

      Actual gaa ilaanti chinna cinemalaku review lu veellu raayaru, maree adhbutham gaa vunte thappa. Review vacchindante, konchem gattigaa muttinatte.

Comments are closed.