Raayan Review: మూవీ రివ్యూ: రాయన్

దర్శకుడిగా ధనుష్ ప్రయత్నం మెచ్చుకోదగ్గదే కానీ మరింత జాగ్రత్త వహించి ద్వితీయార్ధంపై దృష్టి పెట్టుంటే ఫలితం బాగుండేది.

చిత్రం: రాయన్
రేటింగ్: 2.5/5
నటీనటులు: ధనుష్, ఎస్.జె.సూర్య, సందీప్ కిషన్, కాళిదాస్ జయరాం, సెల్వరాఘవన్, ప్రకాష్ రాజ్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు
కెమెరా: ఓం ప్రకాష్
సంగీతం: ఎ.ఆర్. రెహ్మాన్
ఎడిటింగ్: ప్రసన్న జీకె
నిర్మాత: సన్ పిక్చర్స్
దర్శకత్వం: ధనుష్
విడుదల: 26 జూలై 2024

పెద్దగా సడి-చప్పుడు చేయకుండా ఈ వారం విడుదలైన సినిమా “రాయన్”. ధనుష్ హీరోగా వచ్చిన ఈ డబ్బింగ్ చిత్రానికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. ధనుష్ నటించడం మాత్రమే కాదు తానే ఈ చిత్రానికి రచయిత, దర్శకుడు కూడా! విడుదలయింది కూడా ధనుష్ జన్మదినం నాడే! ఇంతకీ విషయమేంటో, ధనుష్ దర్శతవ ప్రతిభ ఎలా ఉందో చూద్దాం.

కథలోకి వెళితే… కార్తవరాయన్ (ధనుష్) ఒక ఫుడ్ ట్రక్ నడుపుతుంటాడు. తన తమ్ముళ్లని (సందీప్, కాళిదాస్), చెల్లెలు దుర్గ (దుషారా విజయన్) ను చిన్నప్పటి నుంచీ పెంచి పోషిస్తుంటాడు. అదే ఊళ్లో సేతు (ఎస్ జె సూర్య), దురై (శరవణన్) అనే ఇద్దరు డాన్ లు ఉంటారు. వాళ్లిద్దరికీ పడదు.

ఇదిలా ఉంటే ఆ ఊరికొచ్చిన టాప్ పోలీస్ ఆఫీసర్ (ప్రకాష్ రాజ్) అక్కడున్న యాంటి సోషల్ ఎలెమంట్స్ ని వాళ్లల్లో వాళ్లకే గొడవ పెట్టి క్లీన్ చేయాలనుకుంటాడు. దానికి తన తండ్రితో కూడిన ఒక రివెంజ్ ప్లే కూడా ఉంటుంది.

సరిగ్గా రాయన్ తన చెల్లెలి పెళ్లికి సిద్ధమవుతున్న సమయంలో సేతు మనుషులతో రాయన్ కుటుంబానికి ఇబ్బంది ఎదురవుతుంది. ఆ ఇబ్బంది ఏవిటి? ఎలా ఎదుర్కుంటాడు అనేది తక్కిన కథ.

కథగా ఇది కొత్తదేం కాదు. అన్నగారు, ఆయన తమ్ముళ్ళు… కాన్సెప్టుతో కమర్షియల్ జానర్లో చాలా సినిమాలొచ్చాయి. కనుక కథనంతోనే ప్రత్యేకత చాటుకోవాలి. దానికి ప్రతి పాత్రకి ప్రత్యేకమైన క్యారక్టరైజేషన్ రాసుకోవాలి. అంతవరకు రచయితగా ధనుష్ పాసయ్యాడు.

ఒక బలవంతుడు అత్యంత సామాన్యుడిలా బతకడం, గొడవలెందుకని కొందరి ముందు చేతులు కట్టుకుని నిలబడి క్షమాపణ చెప్పడం, తమ్ముళ్లు- చెల్లెల బాధ్యత, వాళ్లని పద్ధతిగా గొడవలకి దూరంగా పెంచాలనుకోవడం… ఇవన్నీ చూస్తే రజనీకాంత్ “బాషా” గుర్తొస్తుంది.

అయితే ఇది పూర్తి సహజత్వానికి దగ్గరగా మలచిన చిత్రం. అంత సౌమ్యంగానూ ఉన్నవాడు తన కుటుంబసభ్యులకి ఎవరైనా హాని తలపెడితే తనలోని కోపాన్ని బయటపెట్టడమనే క్యారక్టరైజేషన్ బాగుంది.

ప్రధమార్ధం నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లి ఒక దశనుంచి ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. ఇంటర్వల్ బ్యాంగుతో ఎమోషన్ ని సరైన స్థాయిలో నిలబెట్టాడు. అయితే ప్రధాన పాత్ర యొక్క క్యారక్టర్ ఆర్క్ ని రాసుకోవడంలో ప్రధమార్ధంలో చూపించిన గ్రిప్ ని ద్వితీయార్ధంలో చూపించలేకపోయాడు దర్శక రచయిత ధనుష్.

ద్వితీయార్ధానికి వచ్చే సరికి కథలో బిగువు తగ్గి బలవంతపు ఎమోషన్స్ కి చోటిచ్చినట్టయ్యింది. తన తమ్ముళ్లే తనకి ఎదురు తిరగడమనే ఐడియా ఏదో ట్విస్టులాగ రాసుకున్నప్పుడు బాగానే ఉండొచ్చు కానీ, వాళ్లలా మారడానికి ఉసిగొల్పిన కారణాలు చాలా బలహీనంగా ఉన్నాయి. అందుకే రెండవ భాగం కథ ఎక్కడా ఆకట్టుకోదు.

అనవసరపు అరవ పైత్య కథనం, అక్కర్లేని చోట ఏదో జాతర పాట, సుదీర్ఘ సాగతీత.. వెరసి ద్వితీయార్ధం పెదవి విరిచేలా ఉంది.

ఏ సినిమా అయినా సెకండాఫులో క్రైసిస్, చివరిలో క్లైమాక్స్ బలంగా అనిపించినప్పుడే బాగుందన్న టాక్ బయటికొస్తుంది. ఆ కీలకమైన స్కోరింగ్ పార్ట్ లోనే ఈ సినిమా వీక్ అయ్యింది. యాక్షన్ డ్రామా వరకు బాగానే ఉన్నా ఎమోషన్ ని నడిపించడంలో తడబాటు కనపడింది.

సాంకేతికంగా చూసుకుంటే కెమెరా వర్క్ బాగుంది. ఎడిటింగ్ మాత్రం ద్వితీయార్ధంలో పరీక్ష పెట్టింది. చాలా వరకు ట్రిం చేసి ల్యాగ్ తగ్గించి ఉండాల్సింది.

ఎ.ఆర్. రహ్మాన్ నేపథ్య సంగీతం ఈ సినిమాని నిలబెట్టింది. సాధారణంగా అనిపించే సన్నివేశాలు కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వల్ల గ్రిప్పింగ్ గా అనిపించాయి. అయితే ఒక్క పాట కూడా హత్తుకునేలా లేదు. విడుదల ముందు ప్రచారలోపం వల్ల అలా జరిగిందనుకున్నా తెరపై పాటల్ని చూస్తున్నప్పుడైనా ఆస్కార్ సంగీత దర్శకుడి పనితనం కనపడాలి కదా! అలాంటిదేమీ కలగలేదు.

ధనుష్ నటనని మాత్రం తప్పుపట్టలేం. ఎక్కాడా ఓవర్ చేయకుండా పాత్రోచితంగా చాలా సటిల్ గా నటించాడు.

సందీప్ కిషన్ పాత్రలో ఇంపాక్ట్ ఉంది. తనకు జంటగా నటించిన హీరోయిన్ అపర్ణా బలమురళి చాలా సహజంగా కనిపించింది. “ఆకాశమే హద్దురా” లో సూర్య సరసన నటించి మెప్పించిన ఈ నటి ప్రస్తుతం బాగా లావయ్యి సగటు హీరోయిన్ లక్షణాలకు దూరమైనా కూడా ఆమెనే ఈ పాత్రకి ఎంపిక చేసుకోవడంతో దర్శకుడిగా ధనుష్ తన ప్రత్యేకతని చాటుకున్నాడు.

కళిదాస్ జయరాం ఓకే. ఇక మెప్పించే నటన కనబరిచిన నటి ధనుష్ కి చెల్లెలిగా నటించిన దుసరా విజయన్. కొన్ని కీలక సన్నివేశాల్లో తన నటనాప్రతిభని బయటపెట్టింది.

సెల్వరాఘవన్ తన క్యారక్టర్లో ఇమిడిపోయాడు. ప్రకాష్ రాజ్ కనిపించింది తక్కువే అయినా కథ పరంగా ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర. ఎస్ జె సూర్య నెగటివ్ పాత్రలో ఆకట్టుకున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్ కేవలం ప్యాడింగ్ ఆర్టిష్టులా ఉంది. మిగిలిన పాత్రలు ఓకే.

దర్శకుడిగా ధనుష్ ప్రయత్నం మెచ్చుకోదగ్గదే కానీ మరింత జాగ్రత్త వహించి ద్వితీయార్ధంపై దృష్టి పెట్టుంటే ఫలితం బాగుండేది. యాక్షన్ కి ఇచ్చిన విలువ, సరైన ఎమోషన్ ని పండించడంలో కూడా పెట్టాల్సింది. ఈ సారికి మాత్రం ధనుష్ ఎక్కుపెట్టిన దర్శకత్వమనే ధనస్సు గురి తప్పిందనే చెప్పుకోవాలి.

బాటం లైన్: “ధనుష్” గురి తప్పింది

13 Replies to “Raayan Review: మూవీ రివ్యూ: రాయన్”

  1. నారప్ప ( అది కూడా ధనుష్ మూవీ రీమేక్ నే) ఛాయలు ఉన్నట్టుగా అనిపిస్తోంది.

  2. సెల్వరాఘవన్ తన క్యారక్టర్లో ఇమిడిపోయాడు.”

    నయం. ఆ చేతిలో ఉన్న bucket లో ఇమిడిపోలేదు.

Comments are closed.