రివ్యూ: డాటరాఫ్ వర్మ
నిర్మాణం :ఫరెవర్ ఫెంటాస్టిక్ ఫిల్మ్స్
నటీనటులు- వెన్నెల కిషోర్, రోజా, నవీనా జాక్సన్, కవిత, ఉత్తేజ్, జీవా, మాస్టర్ వీరేన్
సంగీతం – ఆదేష్ రవి
సినిమాటోగ్రాఫర్ –పిజి విందా
దర్శకత్వం – ఖాజా
నిర్మాత- నరేంద్రరెడ్డి బొక్కా
వెన్నెల కిషోర్ పెద్దగా హిట్ లు కొట్టకపోయనా, అప్ కమింగ్ కమెడియన్ గా కాస్త ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుడు. ఇటీవల వరుసగా వెన్నెల కిషోర్ సినిమాలు రెండు మూడు ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి. అయితే రామ్ గోపాల్ వర్మ పేరే ఓ బ్రాండ్ నేమ్ కావడం, ఇటీవలే అతగాడి కూతరు పెళ్లికావడం, ఇప్పుడు డాటరాఫ్ వర్మ అంటూ సినిమా సిద్ధం కావడంతో, కాసింత ఆసక్తి ఏర్పరుచుకుందీ సినిమా. ఇటు నాటక రంగంలో, అటు సినిమా రంగంలో కాస్త గట్టి అనుభవమే కున్న ఖాజా తొలిసినిమా ఇది. ఎలా వుందో చూదాం.
కథేంటీ?
వున్నట్లుండి పిల్లో పిల్లాడో ఊడిపడి…డాడీ అని పిలిచి, నేను నీ కొడుకునే/కూతుర్నే అంటే షాక్ తినే హీరో, ఆపై జరిగే గందరగోళంతో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. అదే కాన్సెప్ట్ ను కాస్త ఇంప్రూవ్ చేసారు. రేడియో మిర్చిలో అల్లరి జాకీ వర్మ (వెన్నెల కిషోర్). అతగాడి మాటలకే అమ్మాయిలు పడిపోతుంటారు. అతనికి కూడా పెళ్లి , పెళ్లాం, సంసారం వంటి బంధాలు ఇష్టం వుండదు. సదా, ఎవరో ఒకరితో రొమాన్స్ అన్నది ఒకటే లక్ష్యం. అలాంటి రావుగోపాల వర్మ ఇంటికి వున్నట్లుండి వస్తుంది దీక్ష(నవీన జాక్సన్). తన చిన్న బాబు (మాస్టర్ వీరేన్) తో సహా. వర్మ ఇంటర్ ఏజ్ లోనే తన తల్లిని ప్రేమించిన ఫలితమే తానని చెబుతుంది. డీఎన్ఎ టెస్ట్ లో కూడా అదే నిజమని తేలుతుంది. సదా యూత్ అనుకునే వర్మ, ఇప్పుడు తాతయ్య అయిపోతాడు ఒక్కసారిగా. ఇలా ప్రారంభమైన కథ ఎక్కడకు చేరిందన్నది మిగిలిన సినిమా.
కళాకారుల పనితీరు
వెన్నెల కిషోర్, నవీన జాక్సన్, కవిత, మాస్టర్ వీరేన్ ల నడుమ తిరిగే కథ ఇది. ఉతేజ్ మేల్కొటే తదితరులు వున్నారు, కానీ పాత్రల నిడివి తక్కవ. వెన్నెల కిషోర్ ఈ మధ్యకాలంలో చాలా బ్యాలెన్స్డ్ గా నటించిన సినిమా ఇదే నేమో? పాత్ర అతగాడికి టైలర్ మేడ్ కాకపోయినా, ఇటు రొమాన్స్ కోసం అలమటించే వాడిగా, అటు అభిమానం పెంచుకునే తండ్రిగా బాగానే చేసాడు. కానీ సీరియస్ సీన్లలోనటించేటపుడు, ముఖ్యంగా ఎమోషనల్ అయ్యే సమయంలో తన ముఖ కవళికలు ఎలా వుంటే మరింత బాగుంటాయో కాస్త గమనించుకోవడం అవసరం. బాధ కూడా కొందరి ముఖాల్లో అందంగానే వుంటుంది. అంతగా అందంగా లేని ముఖాల్లో మరింత ఇబ్బందిగా వుంటుంది. ఆ తేడాని గమనించి, సరి చేసుకోవాలి. నవీన జాక్సన్ ఫరవా లేదు. కాదీ తరచు ఒకే రకమైన ఎక్స్ ప్రెషన్ రిపీట్ చేయడం బాగాలేదు. కవిత వీలయింనంత అందంగా కనిపించడానికి ప్రయత్నించిందంతే. మిగిలిన వారంతా సోసో. రోజా గెటప్ తాను ఈ విధమైన కొత్త క్యారెక్టర్లకు సరిపోతానని చెప్పినట్లయింది. స్లిమ్ గా, బాగుంది. దీన్ని చూసి, ఎవరైనా కాస్త వైవిధ్యమైన పాత్రలకు ఆమెను ఎంచుకునే అవకాశం వుంది.
సాంకేతిక వర్గం పనితీరు
దర్శకుడు సినిమాటోగ్రాఫర్ గా పి.జి.విందాను ఎంపిక చేసుకుని, సగం మార్కులు కొట్టేసారు. సినిమా ఆద్యంతం నీట్ గా, కలర్ ఫుల్ గా వుంది. ఆదేష్ రవి సంగీతం పెద్దగా క్యాచీగా లేదు. మాటలు ఓకె కానీ చాలా చోట్ల పాజ్ కావడం చికాకు పెడుతుంది. నేపథ్య సంగీతం మాత్రం ఓకె. దర్శకుడు ఖాజా తనకు స్టామినా వుందని, తన అనుభవం వృధా పోలేదని కొంతవరకు నిరూపించుకొవడానికి పనికి వస్తుందీ సినిమా. నటీనటుల చేత తూకం వేసిన నటన రాబట్టుకోవడం, స్ర్కిప్ట్ సరిగ్గా రాసుకొవడం వరకు ఓకె. అయితే ఒక కమర్షియల్ లేదా వైవిధ్యమైన చిన్న సినిమా రూపొందించాలంటే, మరింత స్టామినా అవసరం.
ప్లస్ పాయింట్లు
- ఫస్టాఫ్
- ఫొటోగ్రఫీ
మైనస్ పాయింట్లు
- ఎక్కడో మొదలై ఎక్కడో తేలడం
- పాటలు
- సెకండాఫ్
విశ్లేషణ
తెలుగు సినిమా దౌర్భాగ్యమేమిటంటే ప్రేక్షకులు ఇప్పుడు జోనర్ వారీగా విడిపోయారు. అన్ని జోనర్ ప్రేక్షకులు చూడాలంటే పెద్ద సినిమాలకు సాధ్యమవుతుంది కానీ చిన్న సినిమాలకు కాదు. దర్శకుడు ఈ సినిమాకు పెట్టిన టైటిల్, ప్రారంభించిన వైనం, కొండవలస నెరేషన్ వంటివి చూస్తే, టేకిట్ ఈజీ పాలసీతొ నడిచిపోతుంది..ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర ట్విస్ట్ పడి, చివరకు తల తిరిగి, చక్కబడతాడు అన్నది రొటీన్ స్ర్కీన్ ప్లే, పోనీ వైవిధ్యం కోసం ఈ రొటీన్ స్ర్కీన్ ప్లేను విడిచి పెట్టి, కొత్తగా ఆలోచించడం వరకు ఓకె. కానీ ఫన్ కామెడీ రొమాంటిక్ జోనర్ లో ప్రారంభించి, ఫ్యామిలీ ప్రేమానుబంధాల్లోకి పయనించి, అక్కడే పెద్దగా హడావుడి లేకుండా, ఉత్కంఠ లేకుండా ముగించడం సినిమాను ఎటూ చెందకుండా చేసింది. అసలే జనాలు ఇప్పుడు కుటుంబాలు, అనుబంధాలు, కన్నీళ్లు అంటే కిలోమీటర్ దూరంలో వుంటున్నారు.
పైగా వెన్నెల కిషొర్, ఎడబాటు, నేపథ్య గీతాలు అంటే ఎవరు చూస్తారు? దర్శకుడు ఎంత బాగా డీల్ చేసినా, జనం కూర్చోవడం కష్టం. పైగా ఫస్టాఫ్ ప్రారంభంలోనే సినిమా ఎటు వెళ్తోందో తెలిసిపోతుంది. అలాగే వెళ్తుంది. కానీ విశ్రాంతికి పది నిమషాలకు ముందే ట్విస్ట్ రివీల్ అయిపోతుంది. ఆపై సినిమా నెమ్మదించడం ప్రారంభిస్తుంది. పోనీ సెకండాఫ్ లో ఏదైనా వుంటుందేమో అనుకుంటే, అసలు సినిమా లైనే మారిపోతుంది. కుటుంబం, తాతా మనవళ్ల ఆప్యాయతలు, కూతరు, అల్లుడు వగైరా వ్యవహారాల్లొకి దిగిపోతుంది. అయినా మళ్లీ ప్రేక్షకులు ఎక్కడ ఫన్ రొమాన్స్ మిస్ అవుతారో అని మరో కథానాయికను రంగంలోకి దింపారు అప్పటిదాకా సాఫ్ట్ గా మారిన మనవడి క్యారెక్టర్ కాస్త అల్లరిగా మారుతుంది.
మంచి గ్రాండ్ పా అనిపించుకుంటున్న క్యారెక్టర్ మళ్లీ రొమాంటిక్ బాట పడుతుంది. దీనికి తోడు పాటలే పాటలు ముంచెత్తుతాయి. ఇలా ఫ్రేమ్ కో జోనర్ అంటూ మారి జనం తల పట్టుకుంటారు. ఇంతలోనే వారి బాధ గమనించినట్లు ఏ హడావుడి లేకుండా వుంటే బాగుండదని,చిన్న కిడ్నాప్ డ్రామా ఆడి, సినిమా టప్ న ముగించేస్తాడు దర్శకుడు. దాంతో పేరు లాగే హడావుడి ఎక్కువ అసలు తక్కువ అని అనుకుంటూ ప్రేక్షకుడు థియేటర్ల నుంచి బయటకు వస్తాడు
బాటమ్ లైన్: బోరింగ్ ఆఫ్ వర్మ
వంశీ