Advertisement

Advertisement


Home > Movies - Reviews

సినిమా రివ్యూ: మహేష్‌

సినిమా రివ్యూ: మహేష్‌


రివ్యూ: మహేష్‌

రేటింగ్‌: 1/5

బ్యానర్‌: ఎస్‌.కె. పిక్చర్స్‌

తారాగణం: సందీప్‌ కిషన్‌, డిరపుల్‌, జగన్‌, లివింగ్‌స్టన్‌ తదితరులు

సంగీతం: గోపీ సుందర్‌

ఛాయాగ్రహణం: రాణ

నిర్మాత: సురేష్‌ కొండేటి

కథ, కథనం, దర్శకత్వం: ఆర్‌. మదన్‌ కుమార్‌

విడుదల తేదీ: సెప్టెంబర్‌ 20, 2013

అడల్ట్‌ కామెడీస్‌ పేరిట తలా తోకా లేని సినిమాలు తీసినా కానీ కాసులు రాలిపోతున్నాయనే ఉద్దేశంతో అన్ని భాషల్లోను అలాంటి బూతు కథా చిత్రాలని తెరకెక్కిస్తున్నారు. అలా తెరకెక్కిందే ‘యారుడా మహేష్‌’. సందీప్‌ కిషన్‌ హీరోగా నటించిన ఆ చిత్రాన్ని తెలుగులోకి ‘మహేష్‌’గా అనువదించారు.

కథేంటి?

శివ (సందీప్‌ కిషన్‌) చదువులో సున్నా అయినా మిగతా అన్నిట్లో ముందుంటాడు. సంధ్య (డిరపుల్‌) అతని ప్రేమలో పడుతుంది. శివ, సంధ్య ప్రేమ ముదిరి... ఆమె గర్భవతి అవుతుంది. దాంతో వాళ్లిద్దరికీ పెళ్లి జరిపిస్తారు. పెళ్లయినా కానీ బాధ్యత లేకుండా ఉంటున్న శివకి తమకి పుట్టిన బిడ్డకి తను తండ్రే కాదనే సంగతి తెలుస్తుంది. మహేష్‌ అనేవాడు సంధ్య గర్భవతి కావడానికి కారణమని తెలుసుకుని అతని కోసం అన్వేషణ మొదలు పెడతాడు శివ.  

కళాకారుల పనితీరు!

‘ప్రస్థానం’ చిత్రంలో తన నటనతో ఆకట్టుకున్న సందీప్‌ కిషన్‌ మళ్లీ అలాంటి చెప్పుకోతగ్గ పాత్ర ఇంతవరకు చేయలేదు. స్క్రిప్ట్‌లోనే సవాలక్ష లొసుగులున్న ఈ సినిమాలో సందీప్‌ పూర్తిగా నిస్సహాయుడైపోయాడు. ఏ నటుడైనా సరే ‘నైట్‌మేర్‌’ అనుకుని మర్చిపోవాల్సిన టైప్‌ క్యారెక్టర్‌ ఇది.     

హీరోయిన్‌ డిరపుల్‌ గురించి చెప్పడానికేమీ లేదు. ఇలాంటి సినిమాల్లో హీరోయిన్లని చూసి జాలిపడడం మినహా ఏమీ చేయలేం. హీరో స్నేహితుడి పాత్రలో జగన్‌ అదే పనిగా వాగుతూనే ఉంటాడు. అడపాదడపా అతను పేల్చే బూతు జోకులే ఈ సినిమాకి ఆధారం. మిగిలిన నటీనటులంతా కూడా పావలాకి రూపాయి యాక్షన్‌ చేసి యాతన పెట్టారు. 

సాంకేతిక వర్గం పనితీరు:

అసలు ఈ సినిమాకి పని తెలిసిన వాళ్లు ఎవరైనా పని చేశారా అనే అనుమానం కలుగుతుంది. కెమెరా ఆన్‌ చేసి ఆఫ్‌ చేయడం మినహా సినిమాటోగ్రాఫర్‌ చేసిందేమీ ఉండదు. ఎడిటర్‌ని అయితే సన్మానించి తీరాలి.. ఏ సీన్‌ ఎందుకుందో తెలియని ఈ సినిమాకి ఎడిటర్‌గా పని చేసినందుకు! దర్శకుడు పెట్టే హింస చాలదన్నట్టు సంగీత దర్శకుడు కూడా జత కలిశాడు. దాంతో టార్చర్‌ డబుల్‌ అయ్యి పాటలు రాగానే జనం సురక్షిత ప్రాంతాల వైపు పరుగులు పెట్టారు. 

డైరెక్టర్‌ హోల్‌ అండ్‌ సోల్‌ ఎయిమ్‌ వచ్చి... ఏవో నాలుగు చీప్‌ జోకులతో కాలం గడిపేసి హిట్టు కొట్టాననిపించుకోవడమే. తెలుగులో ఈ తరహా సినిమాలు తీసి మారుతి బిజీ అయ్యాడు. అలాగే ప్రతి భాషలోను కొందరు దర్శకులు ఈజీ సక్సెస్‌ కోసం ఇలాంటి నీచ్‌, నికృష్ట్‌ సినిమాలు తీసి వదుల్తున్నారు. ఫిలిం మేకింగ్‌ అనేది జస్ట్‌ మనీ మేకింగ్‌ కోసమే అనుకునే ఎథిక్స్‌ లేని వారు తప్ప... దానిని ఒక ఆర్ట్‌గా భావించేవాళ్లు ఎవరూ కూడా ఇలాంటి సినిమాలు తీసి డైరెక్టర్‌ అని గర్వంగా పేరు వేసుకోరు. 

హైలైట్స్‌:

  •  హైలైట్సా... ఈ సినిమాలోనా? మాట్టాడితే మీనింగుండాలి!

డ్రాబ్యాక్స్‌:

  •  డ్రాబ్యాక్సా... మహేష్‌లోనివా? రాసుకోడానికి టన్ను పేపర్లుండాలి!

విశ్లేషణ:

సినిమాలో నాలుగైదు బూతు జోకులుంటే చాలు... ఇంకేమీ అక్కర్లేదు, నా టిక్కెట్‌ డబ్బులు గిట్టుబాటు అయిపోతాయనే చీప్‌ టేస్ట్‌ మీకున్నట్టయితే... మహేష్‌ చూడొచ్చు. మారుతి తీసిన ఇలాంటి సినిమాలు కొన్ని ఆడాయి కాబట్టి ప్రేక్షకులు అదే కోరుకుంటున్నారని చాలా మంది భావిస్తున్నారు. మంచి కథ కోసం అన్వేషించడం, దానిపై పెట్టుబడి పెట్టి ఆడుద్దో లేదోనని ఆదుర్దా పడడం కంటే... ఇలాంటి బూతు సినిమాలపై ఇన్వెస్ట్‌ చేస్తే రిస్క్‌ తక్కువ, ప్రాఫిట్స్‌ ఎక్కువ అని ఇలాంటి వాటిని నెత్తిన పెట్టుకుంటున్నారు. 

అయితే మారుతిలా నాన్‌స్టాప్‌గా బూతు కామెడీ పండిరచడం కూడా ఒక కళే. అది అందరికీ రాదు. ఈ అరవ అనువాద సినిమాలో మొత్తమ్మీద నాలుగో, అయిదో జోకులు పేలతాయి. వాటి కోసం కక్కుర్తి పడితే మిగతా రెండు గంటల సోది భరించాల్సి వస్తుంది. ఫస్టాఫ్‌లో అయితే ఏ సీన్‌ ఎందుకు జరుగుతుందనేది అర్థం కాదు. అలాంటి హీరోని హీరోయిన్‌ ఎందుకు ప్రేమిస్తుందో, అతనితో అంత దూరం ఎందుకు వెళ్లిపోతుందో బోధ పడదు. పైగా ఆమె కాలేజ్‌ టాపర్‌ అని, యుఎస్‌లో అడ్మిషన్‌ దొరికిందని కూడా చెప్తారు. 

అలాంటి తెలివైన అమ్మాయిలు ఇలాంటి సినిమాల్లో తప్ప ఇంకెక్కడా ఇంతగా దిగజారిపోరు. దర్శకుడి మైండ్‌లో పుట్టిన ఆ అద్భుతమైన కథ ఇంటర్వెల్‌ దగ్గర మొదలవుతుంది. మహేష్‌ కోసం సాగించే అన్వేషణ చూస్తే ఏ దిక్కూ లేకుండా సాగిపోయిన ఆ ఫస్ట్‌ హాఫే బెటర్‌ కదా అనే ఫీలింగొస్తుంది. చివర్లో అసలు మహేష్‌ కథేంటో, ఎందుకిదంతా జరిగిందో అనేది వివరంగా చెప్పాక... మన చెప్పుతో మనల్ని మనమే కొట్టుకోవాలనిపిస్తుంది. ప్రేక్షకుడి ఇంటెల్లిజెన్స్‌పై ఇంత చీప్‌ అభిప్రాయం ఉన్న దర్శకుడి సినిమాని టికెట్‌ కొనుక్కుని చూసినందుకు చెప్పుదెబ్బలతో కూడా శాస్తి జరగదనే చెప్పాలి. 

వినోదమే కావాలనుకుంటే వివిధ మార్గాల్లో దొరుకుతుంది. సినిమా టికెట్‌కి, థియేటర్లో ఇతరత్రా చిరుతిళ్లకీ పెట్టే ఖర్చుల్లో సగం పెట్టినా కానీ ఇంతకు మించి టైమ్‌పాస్‌ అయిపోయే ప్లేసులు చాలా ఉంటాయి. ఈ టైప్‌ సినిమాల్ని ఎంకరేజ్‌ చేసేకొద్దీ చెలరేగిపోయి మరింత చెత్తని మన మొహాన కొడుతుంటారు. వీటిని తిప్పికొట్టడం మొదలుపెడితే తప్ప మన సెన్సిబులిటీస్‌పై ఈ ఎటాక్‌ ఆగదు. లేదంటే తాము తీసిన చెత్త చిత్రాల్ని చూసుకునే ఎవరికి వారు క్రియేటర్స్‌మని, ట్రెండ్‌ సెట్టర్స్‌మని సిగ్గు లేకుండా కాలరెగరేసేస్తూ ఉంటారు!

బోటమ్‌ లైన్‌:మటాష్‌!

విహారి

Feedback at 

 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?