Satyam Sundaram Review: మూవీ రివ్యూ: సత్యం సుందరం

భావోద్వేగభరితమైన చిత్రాలు ఇష్టపడేవారికి ఇది కచ్చితంగా నచ్చే సినిమా. కేవలం 2 పాత్రలతో కూర్చోబెట్టిన సినిమా.

చిత్రం: సత్యం సుందరం
రేటింగ్: 3/5
తారాగణం: కార్తి, అరవింద్ స్వామి, శ్రీదివ్య, రాజ్ కిరణ్, జయప్రకాష్ తదితరులు
సంగీతం: గోవింద్ వసంత్
ఎడిటర్: గోవింద రాజు
నిర్మాత: జ్యోతిక-సూర్య
దర్శకత్వం: ప్రేమ్ కుమార్
విడుదల తేదీ: సెప్టెంబర్ 28 2024

ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కార్తి లడ్డూకి సంబంధించిన విషయంలో ఏదో అంటే, పవన్ కల్యాణ్ పుణ్యమా అని అది వివాదమయ్యింది. దాంతో జనం దృష్టి ఈ చిత్రంపై పడింది. ట్రైలర్ చూస్తే ఫీల్ గుడ్ సినిమాలా అనిపించింది. “96” తీసిన ప్రేం కుమార్ దర్శకుడు కావడంతో ఆ సినిమా నచ్చినవారికి దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇంతకీ ఎలా ఉందో చూద్దాం.

అయినవాళ్లే మోసం చేస్తే తట్టుకోలేకపోతాడు సత్యమూర్తి అలియాస్ సత్యం (అరవింద్ స్వామి). ఉద్దండరాయపాలెంలోని సొంతింటిని అర్థరాత్రి ఆఘమేఘాల మీద ఖాళీ చేయాల్సి వస్తుంది. అలా విశాఖకు షిఫ్ట్ అవుతాడు. ‘ఆ కొంతమంది’ బంధువులపై కోపంతో ఏకంగా సొంతూరికి వెళ్లడం మానేస్తాడు. ఇది 1996లో జరుగుతుంది. కానీ తనతో కలిసి పెరిగిన చెల్లెలి పెళ్లి కోసం తప్పనిసరి పరిస్థితుల మధ్య మళ్లీ ఊరిలో అడుగుపెడతాడు. ఇది 2018లో మొదలవుతుంది.

అలా కల్యాణ మంటపంలో అడుగుపెట్టిన సత్యంకు ఓ వ్యక్తి (కార్తి) ఎదురవుతాడు. బావ అంటూ ఆప్యాయంగా పలకరిస్తాడు. ప్రతి నిమిషం సత్యంతోనే ఉంటాడు. అతడెవరో ఎంత ఆలోచించినా సత్యంకు గుర్తురాదు. ఆ ఆలోచనతోనే అతడి ఇంట్లో ఓ రాత్రి బస చేస్తాడు కూడా. సత్యంకు చెందిన చిన్ననాటి జ్ఞాపకాలన్నింటినీ గుర్తు చేసే ఆ వ్యక్తి ఎవరు? సత్యంకు అతడికి సంబంధం ఏంటి?

పై పేరాలో చివరి రెండు ప్రశ్నలే సినిమా అని అనుకోవడానికి వీల్లేదు. నిజానికి ఆ రెండు ప్రశ్నలతో సంబంధమే లేదు. మనసుకు హత్తుకునే సన్నివేశాలతో, మంచి మూమెంట్స్ తో సినిమా అలా సాగిపోతూనే ఉంటుంది.

ఇందులో ఇంటర్వెల్ ట్విస్ట్, ఫైట్స్ లాంటివేం ఉండవు. కమర్షియల్ ఫార్ములా సినిమాల మధ్యలో సున్నితమైన కథతో, మనసుకు హత్తుకునే ఎమోషన్స్ తో ఎలాంటి మలుపుల్లేకుండా ఓ సినిమా వస్తే మైండ్ ట్యూన్ అవ్వడానికి కాస్త టైమ్ పడుతుంది. అలాంటి సినిమానే ఇది. ఇదేంటి సీరియల్లా స్లో గా ఉంది అనిపిస్తున్నా, కాస్త అడజస్ట్ అయ్యి 30 నిమిషాలు ఓపికపడితే, నెమ్మదిగా కథనం ఇద్దరి ప్రపంచంలోకి, వారిలోని సున్నితమైన ఎమోషన్ లోకి లక్కుపోతుంది.

ఏ షాకులు, మలుపులు లేని సన్నని దారంలాంటి కథ ఇది. అందులో పూసగుచ్చినట్టు తిన్నగా సాగే కథనం.. ఇదే ఈ సినిమా. ఇందులో కార్తి పాత్ర ప్రధానమైనది. జీవితంలో తనకు తారసపడే ప్రతి అంసాన్ని మనసుకి హత్తుకుంటాడు; అందర్నీ ప్రేమిస్తాడు; అన్నిటినీ ఇష్టపడతాడు; ఎవరి మీదా కంప్లైంట్ ఉండదు; ఏదైనా ఉన్నా క్షమించేయాలంటాడు; బలమైన ఎద్దైనా, విషమున్న పామైనా, ప్రాణం లేని సైకిలైనా, ఎప్పుడో చిన్నప్పుడు సెలవల్లో ఆడించిన వ్యక్తి అయినా…అందరూ తనకి ఇష్టమే. అందరికీ, అన్నిటికీ తన ఇంట్లో చోటివ్వాలనుకుంటాడు.

అలాంటి వ్యక్తి జీవితాన్ని తాకినప్పుడు మరొక పాత్ర అయిన అరవింద్ స్వామిలో ఎటువంటి మార్పు చోటుచేసుకుంటుంది, అనేది కథ. ఒకదశలో కార్తి జీవనవిధానం, ఆలోచన అరవింద్ స్వామికి చాలా ఉన్నతంగా కనిపిస్తాయి.

ఒక మనిషిని సంపూర్ణ మనిషితనంతో బతికితే ఎంత ప్రశాంతంగా, ఆహ్లాదంగా బతకవచ్చో చెప్పే కథ ఇది. అయితే అది అంతర్లీనంగా ఉంటూ మనసుకి మాత్రమే అందుతుంది. కథగా చెప్పాలంటే మాత్రం..”పేరు గుర్తురాదు.. చివరికి గుర్తుచేసుకుంటాడు.. అంతే కదా” అనిపిస్తుంది.

నిశ్చలమైన చెరువులో, ఓ అందమైన పడవలో, మెల్లగా అలా సాగిపోయేలా అనిపించే ప్రయాణం ఈ సినిమా. కార్తి మాటల్లోనే చెప్పాలంటే, ఓ మంచి నవలను ఆద్యంతం చదివిన ఫీలింగ్. ఇప్పుడొస్తున్న సినిమాలకు పూర్తి భిన్నమైనది. ఓ మంచి అనుభూతిని అందించే జర్నీ ఇది.

కొన్నిచోట్ల నెమ్మదిగా సాగుతుంది, కొన్నిచోట్ల పరుగు పెడుతుంది. ఉన్నట్టుండి సడెన్ గా ఆగిపోయింది. అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ ఇస్తుంది. ఆ ఫ్లో అలా ఆస్వాదించాలంతే. ఇక్కడ ఫైట్ కావాలి, పాట ఇంకా రాదేంటి, కమెడియన్లు కనిపించరేంటి అనే ఆలోచన వచ్చిందంటే ఇంటర్వెల్లోనే వెళ్లిపోవాలనిపించవచ్చు.

ఒక సన్నివేశంలో చెల్లెలికి గిఫ్ట్ ఇచ్చి వెళ్లిపోదాం అనుకుంటాడు అరవింద్ స్వామి. కానీ దశాబ్దాల తర్వాత అన్నను చూసిన ఆ చెల్లెలు, అతడ్ని వదలదు. స్టేజీపైనే గిఫ్ట్ ఓపెన్ చేస్తుంది, అన్నతోనే పట్టీలు తొడిగించుకుంటుంది. ఆ సీన్ టోటల్ సినిమాకే హైలెట్. ఇక తనను ఆప్యాయంగా చూసుకున్న కార్తి ఎవరో తెలియక, అరవింద్ స్వామి పడే బాధ, ఆ బాధలోనే అతడు ఊరు విడిచి వెళ్లడం లాంటి సన్నివేశాలు హత్తుకుంటాయి. “నిజంగా నేను ఎవరో గుర్తుపట్టలేదా బావ” అంటూ కార్తి అమాయకంగా అడిగే సీన్ గుండెల్ని పిండేస్తుంది. ఇక ఫైనల్ గా కార్తి పేరు బయటపెట్టే సన్నివేశంతో సినిమా ముగుస్తుంది.

ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఇదేదో కార్తి పేరోంటో తెలుసుకునే కథ కాదు. ఇదొక ఎమోషనల్ రైడ్. కార్తి, అరవింద్ స్వామి పాత్రలతో చేసే ప్రయాణం. అమాయకత్వం, మంచితనం నిండిన పాత్రలో కార్తి, గిల్టీ భారాన్ని మోసే పాత్రలో అరవింద్ స్వామి ఈ సినిమాను వేరే లెవెల్ కు తీసుకెళ్లారు. అరవింద్ స్వామి ఛైల్డ్ ఎపిసోడ్ తో సినిమా మొదలవుతుంది. అలా సినిమా స్టార్ట్ అయిన 38 నిమిషాలకు కార్తి పాత్ర ఎంటర్ అవుతుంది. ఇక అక్కడ్నుంచి 2 గంటల పాటు ఈ పాత్రలతో ప్రయాణం ఉంటుంది.

96 సినిమాతోనే దర్శకుడు ప్రేమ్ కుమార్ తన పంథా ఏంటో చెప్పకనే చెప్పాడు. సత్యంసుందరం కథ కూడా అలానే సాగుతుంది. నెరేషన్ స్లోగా ఉందనేది కొంతమంది కంప్లయింట్ కావొచ్చేమో కానీ అదే ఈ దర్శకుడి బలం అనుకోవచ్చు. సంగీత దర్శకుడు గోవింద్ వసంత్ మరోసారి మంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. డబ్బింగ్ వల్ల పాటల్లో మాధుర్యం తెలియలేదు. కానీ అదే డబ్బింగ్ వల్ల సినిమాలో చాలా సన్నివేశాలు మెరిశాయి.

భావోద్వేగభరితమైన చిత్రాలు ఇష్టపడేవారికి ఇది కచ్చితంగా నచ్చే సినిమా. కేవలం 2 పాత్రలతో కూర్చోబెట్టిన సినిమా. నిడివి ఎక్కువైందని అక్కడక్కడ అనిపించినా, మళ్లీ కథలో లీనమైపోవడం ఈ సినిమా ప్రత్యేకత.

బాటమ్ లైన్: ఎమోషన్ సత్యం- నెరేషన్ సుందరం

28 Replies to “Satyam Sundaram Review: మూవీ రివ్యూ: సత్యం సుందరం”

  1. ఇంకా మన మహర్షి తాత కి కావాల్సిన స్టఫ్ దొరికింది దీనిలో కూడా స్పేస్ తీసుకుని అన్న అమాయకత్వం (???) చంబా అవకాశవాదం ల గురించి రాస్తారు

  2. “అందర్నీ ప్రేమిస్తాడు; అన్నిటినీ ఇష్టపడతాడు; ఎవరి మీదా కంప్లైంట్ ఉండదు; ఏదైనా ఉన్నా క్షమించేయాలంటాడు; బలమైన ఎద్దైనా, విషమున్న పామైనా, ప్రాణం లేని సైకిలైనా, ఎప్పుడో చిన్నప్పుడు సెలవల్లో ఆడించిన వ్యక్తి అయినా…అందరూ తనకి ఇష్టమే”

    There’s a blunt flaw in characterization. Any person can live like that, but once he gets married to a loud mouth, egoistic, narcissistic, shameless, selfish, sociopathic woman then let’s see how he manages to hold 0.00000001% of the above mentioned qualities.

  3. “అందర్నీ ప్రేమిస్తాడు; అన్నిటినీ ఇష్టపడతాడు; ఎవరి మీదా కంxప్లైంట్ ఉండదు; ఏదైనా ఉన్నా క్షమించేయాలంటాడు; బలమైన ఎద్దైనా, విషమున్న పామైనా, ప్రాణం లేxని సైకిలైనా, ఎప్పుడో చిన్నప్పుడు సెలవల్లో ఆడించిన వ్యక్తి అయినా…అందరూ తనకి ఇష్టమే”

    There’s a blunt flaw in characterization. Any person can live like that, but once he gets married to a loud mouth, egoistic, narcissistic, shameless, selfish, sociopathic woman then let’s see how he manages to hold 0.00000001% of the above mentioned qualities.

  4. కొందరికి జీవితం లో అద్దం లాంటి మనుషులు ఎదురువుతారు, అప్పుడు వాళ్ళు తమలో ఉన్న లో పాలు సరిచూసుకుంటారు..

  5. Ekkado kodatandi Seena.. laddu topic valla extra positive ga raasinattu anipistundenti?. Example.

    Sannani daram lanti katha, tinnaga sage kathanam, serial la slow narration – Vere movies ki ive negatives ga rastav.

    1. సూర్య ప్రొడ్యూస్ చేసిన సినిమా, సూర్య ఎప్పుడో ఒక సిమెంట్ కంపెనీ కి యాడ్ చేసాడు అనుకుంటాను.

Comments are closed.