‘తళపతి’ పార్టీకి తమిళ పీఠం ఎంత దూరం?

వెండి తెరమీద నుంచి నాయకులు దిగి రావటం తమిళ, తెలుగు రాష్ట్రాలకు కొత్త కాదు. దిగాక ఎదిగిన వారు కొందరే. మునిగినవారు ఎందరో.

తార తీరే వేరు. తనకు తాను వేరు అనుకుంటాడు. విజయ్‌ తళపతి అలాగే అనుకుంటున్నారు. ఆయన తమిళనాట అగ్రతార. దేశంలో తెలిసిన తార. ఆయన రాజకీయ ప్రవేశం చేశారు. తమిళగ వెట్రి కజగమ్‌(టీవీకే) పార్టీ పెట్టారు.

వెండి తెరమీద నుంచి నాయకులు దిగి రావటం తమిళ, తెలుగు రాష్ట్రాలకు కొత్త కాదు. దిగాక ఎదిగిన వారు కొందరే. మునిగినవారు ఎందరో. తమిళ నాట ఎమ్జీఆరూ, తెలుగు నాట ఎన్టీఆరూ దిగటంతోనే సర్వస్వతంత్రంగా ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చున్నారు. తర్వాత ఏ తారా, ఇలా ఎకాఎకిన అధికారాన్ని చేపట్టలేదు. తమిళనాట అయితే మరీను. విజయ్‌ తళపతికి ముందు ముగ్గురు తారలు మురిపించారు.

విజయ్‌ కాంత్‌ వచ్చారు, నిలిచారు. కానీ సర్కారును ఏర్పరచలేక పోయారు. రజనీ కాంత్‌ వచ్చినట్టే వచ్చి వెనక్కి తగ్గారు. కమల్‌ హాసన్‌ వచ్చారు కానీ, ఉనికినే చాటుకోలేక పోయారు. ఈ ముగ్గురూ సొంత వేదికలతో వచ్చిన వారే. ఇదంతా ఇటీవలి చరిత్రే. ఈ ముగ్గురు తర్వాత కూడా విజయ్‌ తళపతి వస్తున్నారంటే, ‘నేను వారిలా కాదు’ అని అనుకునే వుండాలి.

ఆంధ్రప్రదేశ్‌ లో కూడా అలాగే జరిగింది. ఎన్టీఆర్‌ తర్వాత, చిరంజీవి వచ్చారు కానీ, నిలవలేక పోయారు. ఆ తర్వాత ఆయన తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ వచ్చారు. సొంత ఇంటిలోనే ఒక వైఫల్యం చూశాక, అదే పని చెయ్యటానికి ధైర్యం కావాలి. అది తనకు వుందనుకుని దిగారు. ముందు బరిలోకి దిగినప్పుడు ఘోరవైఫల్యం చెందారు. తర్వాత (2024లో) సొంతంగా తన పార్టీతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేక పోయినా, పొత్తు కారణంగా ప్రభుత్వంలో భాగమయ్యారు. ఇలాంటి అవకాశమన్నా తమిళ నాట విజయ్‌ తళపతికి వుందా? అక్కడ జరగబోయే 2026 అసెంబ్లీ ఎన్నికలలో విజయ్‌ భవితవ్యం తేలనుంది.

హీరో దొరికాడు కదా, సినిమా తీసినట్టు, నాయకుడు రెడీ అయ్యాడు కదా అని పార్టీ పెట్టలేరు. పెట్ట కూడదు కూడా. రాజకీయ సందర్భం వుండాలి. అంటే కొత్త పార్టీకి జాగా వుండాలి. అలాంటి సందర్భం ఇవాళ తమిళనాడులో వుందా?

నిన్నమొన్నటి దాకా అయతే అన్నాడీఎంకే, లేకుంటే డీఎంకే అన్నట్టుగానే అక్కడి ఎన్నికల తీర్పులు వుండేవి. అందుకు తగ్గట్టుగా రెండుపార్టీలకూ ఇద్దరు అగ్రనేతలు వుండేవారు. ఒకరు జయలలిత, మరొకరు కరుణానిధి.

అన్నాడీఎంకే అధికారంలో వుండగానే, జయలలిత మరణించటంతో, రాజకీయ సమీకరణలు మారాయి. అన్నాడీఎంకే బలహీనపడిపోయింది. ముఖ్యమంత్రిగా చేసిన పళని స్వామి కానీ, ఆయనకు పోటీగా నిలిచిన పన్నీర్‌ సెల్వం కానీ సమర్థవంతమయిన నాయకత్వాన్ని ఇవ్వలేక పోయారు. దాంతో స్టాలిన్‌ నాయకత్వంలోని డీఎంకె 2021లో సునాయస విజయాన్ని పొందగలిగింది. ఈ ఏడాదే (2024)లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో కూడా డీఎంకె, కాంగ్రెస్‌తోనూ ఇతర మిత్ర పక్షాలతో కలసి 39 సీట్లనూ క్లీన్‌ స్వీప్‌ చేసింది. అన్నాడిఎంకె కు ఒక్క స్థానం కూడా దక్కలేదు. అంతమాత్రాన ఆ పార్టీ అక్కడ తుడిచిపెట్టుకు పోయినట్టు మాత్రం కాదు. ఎందుకంటే 23 శాతం వోట్లు ఆ పార్టీ దక్కించుకోగలిగింది. అయితే డిఎంకే కేంద్రంగా వున్న ఇండియా ప్లస్‌ కూటమికి 47 శాతం వోట్లు వచ్చాయి.

బలహీనపడ్డ అన్నాడీఎంకేయే అందరికీ ఆశలు రేకెత్తిస్తోంది. జయలలిత మరణానంతరం, అన్నాడీఎంకెను వెనకనుంచి నడిపించాలని బీజేపీ విశ్వయత్నం చేసింది. కానీ కుదర లేదు. ఇప్పుడు పార్టీ మీద కాకుండా ఆ పార్టీ వోటు బ్యాంకు మీద కన్నేసింది. రిటయరయిన ఐపీఎస్‌ అధికారి అన్నామలై ను ముందుకు తెచ్చింది. అన్ని రాష్ట్రాలలో లాగానే, బీజేపీ ‘హిందూత్వ’ ఫార్ములాను ఇక్కడ దించే ప్రయత్నం చేస్తోంది. స్టాలిన్‌ సర్కార్‌ మీద ‘నాస్తిక’ ముద్ర వేసే ప్రయత్నం చేస్తోంది. ప్రతీచోటా ముస్లిం మైనారిటీలను బూచిగా చూపించి, మెజారిటీ హిందువుల వోట్లను కొల్లగొట్టే ప్రయత్నానికి కాస్త భిన్నంగా ఈ ఫార్ములాను అమలు జరుపుతోంది. ‘నాస్తికుల’కు వ్యతిరేకంగా ‘హిందువుల’ను సమీకరించే ప్రయత్నానికి శ్రీకారం చుట్టుతోంది.

సరిగ్గా ఇదే సమయంలో విజయ్‌ తళపతి తన టీవీకే పార్టీని ముందుకు తెచ్చి, రాజకీయ శంఖాన్ని పూరించారు. విజయ్‌ పిళ్ళై కులస్తుడయినా, క్రైస్తవుడు. ఆయన పూర్తి పేరు జోసెఫ్‌ విజయ్‌ చంద్రశేఖర్‌. తండ్రి క్రైస్తవుడు. తల్లి హిందువు.

తమిళ రాజకీయాలు ఇప్పటికీ ‘ద్రావిడ’ సిధ్ధాంత పరిధిలోనే సాగాయి. ఈ వాదానికి పితామహుడు పెరియార్‌ రామస్వామి. ఆయన తెచ్చిన ‘ఆత్మగౌరవ’ ఉద్యమం నుంచే ద్రావిడ పార్టీలు వచ్చాయి. పెరియార్‌ రామస్వామి మతాన్నీ, దేవుడినీ తిరస్కరించారు. కులాన్ని పాతరెయ్యాలన్నారు. స్త్రీపురుష సమానత్వాన్ని ఎలుగెత్తి చాటారు. కానీ డీఎంకెను స్థాపించిన అన్నాదొరై దేవుడి విషయంలో కాస్త దూరం జరిగారు.

‘నేను విగ్రహాన్నీ పగుల కొట్టను, కొబ్బరికాయనూ కొట్టను’ అన్నట్టుగా కేవలం పూజకు మాత్రమే దూరమయ్యారు. కానీ ఆయన తర్వాత వచ్చిన కరుణానిధి కఠోర నాస్తికుడిగానే కడవరకూ వున్నారు. హిందూ దేవాలయాలకు ఆలవాలం గా వుండే తమిళనాడులో, ద్రావిడ నేతలు, భక్తినీ, రాజకీయాలనూ వేర్వేరుగా చూడటం అక్కడి ప్రజలకు నేర్పించగలిగారు. స్టాలిన్‌ కూడా తండ్రి కరుణానిధి వారసత్వాన్ని కొనసాగించారు. ఇప్పుడు ఆ కుటుంబంలో మూడో తరం వచ్చింది. స్టాలిన్‌ తనయుడు ఉదయనిది స్టాలిన్‌, ఇప్పుడు డీఎంకె కు ముఖంగా మారాడు. ఆయన పూర్తిగా పెరియార్‌ భావనలు ప్రకటిస్తున్నారు.

ఈ తరుణంలో, వచ్చిన విజయ్‌ తళపతి (అక్టోబర్‌ 27న ఇచ్చిన) తన పార్టీ ఆవిర్భావ ఉపన్యాసంలో తాను పెరియార్‌ సిధ్ధాంతానికి వారసుడినని చెబుతూనే, ఆయన లోని ‘నాస్తికత్వానికి’ కాదూ అని చెప్పాడు. సరిగ్గా జయలలిత నాయకత్వంలోకి వచ్చాక అన్నా డిఎంకే కూడా ఇదే దారి తొక్కింది. అంతే కాదు, తన ఉపన్యాసంలో, డీఎంకేనూ, బీజేపీనూ ఉతికి ఆరేశారు కానీ, అన్నాడీఎంకేను ఒక్క మాట అనలేదు. కాబట్టి విజయ్‌ తళపతి, అన్నాడీఎంకే వోటు బ్యాంకును కైవసం చేసుకునే పన్నాగం పన్నినట్టుగానే కనిపిస్తోంది. అలా చూసినప్పుడు, ఆయన పార్టీకి తమిళ నాట కొంత జాగా కనిపిస్తోంది. కానీ, ముగ్గురు తారలు విఫలమయిన కాలంలో విజయ్‌ ఎంత భిన్నంగా నెగ్గుకురాగాలరో మరి..!?

6 Replies to “‘తళపతి’ పార్టీకి తమిళ పీఠం ఎంత దూరం?”

    1. ఒక క్రిస్టియన్ పార్టీ పెట్టగానే.. భలే ప్రచారం చేస్తారు ర.. వాటికన్ ఏజెంట్ గొర్రెల పార్టీ అని రకరకాలుగా చిల్లర వెధవల్లార ఎదగండి ర కులం అనే భావన నుండి మంచి చేసే వాడిని గుర్తించండి లూటీచేసే వాడికి కొమ్ము కాయటం మానేసి !

  1. ఏ ఐ డీ ఎం కే ఓట్లు అటు బీజేపీ,ఇటు డీ ఎం కే మధ్య చీలిపోతాయి. కొత్త పార్టీ వైపు ఆ పార్టీలోని అభిమానులు వెళ్లే అవకాశాలు ఉండొచ్చు. డీ ఎం కే,బీ జే పీ లను తక్కువ అంచనా వెయ్యలేం.

Comments are closed.