“అసమర్థులకు కీలక శాఖలు అప్పగించారు. కనీస అవగాహన లేని వాళ్లు మంత్రులయ్యారు. టేబుల్ పైకి ఓ ఫైల్ వస్తే చదవగలరా? అసలు జగన్ కు బుద్ధి లేదు. పరిపాలన మొత్తం పనికిమాలిన వ్యక్తుల చేతిలోకి వెళ్లింది.” గడిచిన కొన్ని రోజులుగా ఎల్లో మీడియా చేస్తున్న యాగి ఇదంతా.
ఏబీఎన్, టీవీ5 చర్చల్లో వినిపిస్తున్న మాటలివి. జగన్ కాబట్టి ఎల్లో మీడియా పనికిమాలిన వాగుడుకు అలవాటు పడిపోయారు. వాళ్లంతే అన్నట్టు, కూరలో కరివేపాకులా తీసి పక్కనపడేశారు. అదే ఒక్కసారి కేసీఆర్ లా జగన్ ఆలోచిస్తే ఏం జరిగి ఉండేది?
ఏడేళ్ల కిందటి సంగతి.. అప్పుడే తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఎంతోమంది రాజకీయ నాయకులిగా ఎదిగారు. వాళ్లలో కొందరు మంత్రులయ్యారు. ప్రమాణస్వీకారాలు చేసినప్పుడు కొత్త కాబట్టి టెన్షన్ లో కాస్త తడబడ్డారు. దానిపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ, అప్పట్లో ఓ లీడింగ్ న్యూస్ ఛానెల్ పెద్ద ప్రొగ్రామ్ పెట్టింది. ఆ తర్వాత మంత్రులకు ల్యాప్ టాప్స్ ఇచ్చారు. అక్షరం ముక్క రానోళ్లకు ల్యాప్ టాప్ ఇస్తే ఎక్కడ పెట్టుకుంటారంటూ మరో కథనం.
దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పట్లో భగ్గుమన్నారు. ప్రతీకార చర్య ఉంటుందంటూ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. సదరు మీడియా ఛానెల్ పై తన విశ్వరూపం చూపించారు. దాదాపు 6 నెలల పాటు ఆ ఛానెల్ ఉక్కిరిబిక్కిరైంది. ఒక దశలో ఉద్యోగుల జీతాల్లో కూడా కోతపడింది. కాలక్రమేణా ఆ ఛానెల్ యాజమాన్యమే మారిపోయింది. వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. దీనంతటికీ కారణం, అప్పట్లో కేసీఆర్ కన్నెర్రచేయడమే.
కేసీఆర్ లాగా జగన్ చేయలేరా..?
అధికారంలో ఉన్నవారికి మీడియాని ఇబ్బంది పెట్టడం పెద్ద పనేం కాదు. అందుకే టీడీపీ హయాంలో మీడియా మొత్తం వారికి వంతపాడేది. సాక్షి యాజమాన్యమే వైసీపీ కాబట్టి ఆ ఛానెల్ ని, పేపర్ ని టచ్ చేయడం బాబుకి సాధ్యం కాలేదు.
ఇక సోషల్ మీడియాని బాబు కాదు కదా ఎవరూ కంట్రోల్ చేయలేరు. 2019లో టీడీపీ అధికారం పోయింది.. ఛానెళ్లు, పేపర్లు తమ స్టాండ్ మార్చుకున్నాయి. కానీ కులాభిమానం, అంతకు మించిన లావాదేవీల వల్ల ఆ రెండు పత్రికలు మూడు ఛానెళ్లు మాత్రం పక్కా టీడీపీ అని ముద్ర వేయించుకున్నాయి. ఒకరిద్దరు జనసేనకు వంతపాడుతూ వైసీపీపై బురదజల్లుతున్నారు.
వీరందర్నీ సెట్ రైట్ చేయడం జగన్ కు చేతకాక కాదు. ఇంకా చెప్పాలంటే చిటికెలో పని. కానీ అది మొదటికే మోసం తెస్తుంది. మీడియా అతిగా ప్రొజెక్ట్ చేయడం వల్లే చంద్రబాబు తన ఓటమిని ఊహించలేకపోయారు. ఇప్పుడు కేసీఆర్ పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. తెలంగాణలో టీఆర్ఎస్ కి గడ్డుకాలం వస్తుందని ఊహించలేం కానీ, అక్కడ ప్రజల అభిప్రాయాలు చెప్పేందుకు ఎవరూ సాహసించడంలేదు.
చాపకింద నీరులా బీజేపీ బలపడినా, 2024నాటికి కాంగ్రెస్ కి జవసత్వాలు వచ్చినా.. మీడియా మాత్రం కేసీఆర్ దే అధికారం అంటుంది. అంటే వారు చేసిన తప్పే వారికి శాపంగా మారే అవకాశం ఉంది. తప్పుల్ని సరిదిద్దుకునే అవకాశమే ఉండదు. దీనికి చంద్రబాబే పెద్ద ఎగ్జాంపుల్.
అందుకే జగన్, మీడియాని ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. తనపని తాను చేసుకుంటూ వెళ్తున్నారు, బురదజల్లే వారికి దూరంగా ఉండాలని, వారిని పట్టించుకోవద్దని పార్టీ నేతలకు హితబోధ చేస్తున్నారు. ఆయా పత్రికలు, ఛానెళ్లు.. ఎవరివైపు ఉన్నాయి, ఎలాంటి వార్తలు ఇస్తాయనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. వాటి విశ్వసనీయతను దెబ్బకొట్టారు.
సో.. జగన్ ఇక్కడ కర్ర విరగకుండానే పాముని చావగొట్టారు. కోరలు పీకి పక్కనపడేశారు. ఇప్పటికైనా ఎల్లో మీడియా జగన్ సహనాన్ని గుర్తించాలి. తెగేదాకా లాగితే తమకే ఇబ్బంది అని గుర్తించాలి.