ఈ నెల 30న పవన్‌కల్యాణ్ పిఠాపురానికి వెళ్తున్నారు. అక్కడి నుంచి ఆయన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో తాను పోటీ చేస్తున్న పిఠాపురం నుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టడానికి పవన్‌కల్యాణ్ మొగ్గు చూపారు. ఓకే గుడ్. పిఠాపురంలో మూడు రోజులు ఆయన మకాం వేయనున్నారు. పిఠాపురంలో తన గెలుపు కోసం ముఖ్యమైన నాయకులను కలవనున్నారు.
మరోవైపు ఆయన్ను ఓడించేందుకు వైసీపీ పకడ్బందీ వ్యూహం రచిస్తోంది. వైసీపీ తరపున కాకినాడ ఎంపీ వంగా గీతను బరిలో నిలిపారు. ఆమెకు మంచి పేరు వుంది. మరీ ముఖ్యంగా కాపులు తమ ముద్దు బిడ్డగా ఆమెను చూస్తారు. ఇది వైసీపీకి కలిసొచ్చే అంశం. అలాగే ఒక్కో మండలానికి ఒక్కో నాయకుడిని ఇన్చార్జ్గా సీఎం జగన్ నియమించారు. పిఠాపురంలో మూడు మండలాలు, రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి.
పిఠాపురంలో ప్రధానంగా పోల్ మేనేజ్మెంట్ వైసీపీకి కలిసొస్తుంది. ఇందులో జనసేన వీక్. టీడీపీ ఇన్చార్జ్ వర్మను పవన్ నమ్ముకున్నారు. వర్మను నమ్ముకుంటే పవన్‌కల్యాణ్ పుట్టిమునగడం ఖాయం. పైకి కనిపించే ప్రత్యర్థి వైసీపీ అయితే, కనిపించని ప్రత్యర్థి వర్మ అని స్థానిక జనసేన నాయకులు అంటున్న మాట. టీడీపీ కార్యకర్తలు పవన్‌కల్యాణ్ గెలుపు కోసం మనస్ఫూర్తిగా పని చేయడం లేదని పిఠాపురం జనసేన నాయకులు వాపోతున్నారు.
మరోవైపు పిఠాపురంలో వైసీపీ తమలో చిన్నచిన్న విభేదాలను పక్కన పెట్టి, పవన్‌ను ఓడించే సమరంలో అంతా ఏకతాటిపై నడుస్తున్నారు. సిటింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు సీఎం జగన్‌తో మాట్లాడిన తర్వాత వంగా గీత గెలుపు బాధ్యతల్ని భుజాన వేసుకోవడం విశేషం. పిఠాపురంలో వైసీపీ పద్మ వ్యూహాన్ని రచిస్తోంది. పిఠాపురానికే పవన్‌ను కట్టడి చేయాలనేది వైసీపీ ప్రధాన ఎత్తుగడ. కదిలితే ఏదో చేస్తారనే భయాన్ని పవన్‌లో కలిగించే పనిలో వైసీపీ వుంది.
ఏదో మూడు రోజులు పిఠాపురంలో పర్యటిస్తే, తనను గెలిపిస్తారని పవన్ అనుకుంటే, శాశ్వతంగా తనకు రాజకీయ సమాధి కట్టుకున్నట్టే. ఎన్నికలంటే కొంత మందితో మాట్లాడితే సరిపోతుందని భావిస్తే చేయగలిగిందేమీ లేదు. వైసీపీకి దీటుగా అన్ని రకాలుగా క్షేత్రస్థాయిలో నాయకులు, వివిధ పార్టీల కార్యకర్తలను సంతృప్తి పరచాల్సి వుంటుంది. అప్పుడు బరిలో నిలబడగలుగుతారు. అది ఏ మేరకు పవన్ చేయగలరనేది ముఖ్యం. ఏం మాట్లాడినా చూపే చానళ్లు ఉన్నాయి కదా అని, ఓటర్‌కు వైసీపీ లక్ష రూపాయిలు ఇస్తోందన్న ఆరోపణలతో రాజకీయంగా ఒరిగేదేమీ వుండదు. తానేం చేస్తాననేదే గెలుపోటములను డిసైడ్ చేస్తుందని పవన్ గ్రహించాలి. అందుకు తగ్గట్టు ఎన్నికల వ్యూహాన్ని రచించాలి.
ఇవేవీ చేయకుండా పిఠాపురంలో మూడు రోజులున్నా, 30 రోజులున్నా ప్రయోజనం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరోసారి ఓటమికే సిద్ధమైతే, అది పవన్‌కల్యాణ్ ఇష్టం. కానీ క్షేత్రస్థాయిలో వైసీపీ వ్యూహం, అందరినీ కలుపుకెళుతున్న తీరు చూస్తుంటే, పవన్‌కు కీడు జరుగుతుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.