మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డికి రాజంపేట పార్లమెంట్ సీటు ఇవ్వడపై ఆయన తమ్ముడు, పీలేరు టీడీపీ అభ్యర్థి కిషోర్‌రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. ఆ ప్రభావం తనపై తీవ్రంగా పడుతుందని ఆయన ఆందోళన చెందుతున్నారు.
పీలేరు నుంచి వరుసగా మూడోసారి కిషోర్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. ఈ దఫా ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు సానుభూతి కలిసొస్తుందని కిషోర్‌రెడ్డి భావిస్తున్నారు. అయితే పొత్తులో భాగంగా తన అన్న కిరణ్‌కుమార్‌రెడ్డికి రాజంపేట సీటు కేటాయించడంతో కిషోర్ షాక్‌కు గురయ్యారు. పీలేరు పరిధిలో ముస్లిం ఓటర్లు ఎక్కువ. తన కుటుంబ సభ్యుడే బీజేపీ అభ్యర్థి అయితే, ముస్లిం ఓట్లు తనకు పడవనే భయం ఆయన్ను వెంటాడుతోంది. అందుకే తన అన్నకు రాజంపేట పార్లమెంట్ సీటు ఇవ్వకుంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని చంద్రబాబు వద్ద కిషోర్ వెల్లడించారు.
కానీ కిరణ్ పట్టు పట్టి మరీ రాజంపేట సీటును దక్కించుకున్నారు. దీంతో పీలేరులో మరోసారి ఓటమిని మూటకట్టుకోవాల్సి వస్తుందేమో అనే ఆందోళన కిషోర్‌లో వుంది. దీని నుంచి ఎలా అధిగమించాలనే ప్రశ్నకు సమాధానం దొరకడం లేదు. పీలేరులో మాత్రం ముస్లిం ఓటర్లకు టీడీపీకి వేయరనే నిర్ణయానికి కిషోర్ వచ్చారు.
మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పీలేరులో తనకు అనుకూల వాతావరణం వుందని ఆయన కొంత కాలంగా సంతోషంగా కనిపించారు. ఇప్పుడు ఒక్కసారిగా నిరుత్సాహానికి గురైనట్టు తెలుస్తోంది.