మంత్రివర్గ పునర్వ్యస్థీకరణ వైసీపీలో అసమ్మతి రాగాలను వినిపిస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి సమీప బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రూపంలో అధికార పార్టీలో అసంతృప్తి తుపాను చెలరేగింది. ఇది ఒక రకంగా ముఖ్యమంత్రి స్వయంకృతాప రాధమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి మొదట చెప్పినట్టు మొత్తం మంత్రి వర్గాన్ని మార్చకుండా, 11 మందిని తిరిగి కొనసాగించడంతో అసంతృప్తికి బీజం వేసింది.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తన అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మంత్రి బాలినేని మీడియాతో మాట్లాడుతూ కేబినెట్‌లోని మంత్రులందరినీ సీఎం తొలగిస్తారని ఆర్నెళ్ల క్రితమే చెప్పానని, తానేమీ అతీతుడుని కాదని ప్రకటించారు. తామంతా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని ఆనందంగా చెప్పారు. అయితే బాలినేనిని తొలగించి, ఆదిమూలపు సురేష్‌ను కొనసాగించాలనే నిర్ణయాన్ని నేరుగా ఆయనతోనే సీఎం జగన్ చెప్పినప్పటి నుంచి ఆయన తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు.
ఐదారు పర్యాయాలు ఒంగోలు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడం, దివంగత వైఎస్సార్ కేబినెట్‌లో మంత్రిగా బాలినేని పని చేశారు. వైఎస్సార్ మరణానంతరం ఆయన కుమారుడు వైఎస్ జగన్ సొంతంగా పార్టీని స్థాపించారు. ఆ సమయంలో మంత్రి పదవిని కూడా వదులుకుని జగన్ వెంట బాలినేని నడిచారు. 2012లో ఒంగోలు ఉప ఎన్నికలో వైసీపీ తరపున బాలినేని గెలుపొందారు. మంత్రి పదవి కోసం బంధుత్వాలను కూడా కాదనుకునే రోజుల్లో, వరుసకు అల్లుడైన జగన్ కోసం తాను అమాత్య పదవిని వద్దనుకున్న విషయాన్ని బాలినేని గుర్తు చేస్తున్నారు.
జగన్ కోసం మంత్రి పదవిని కాదనుకున్న తనను కాదని, ఆదిమూలపు సురేష్‌ను కొనసాగించడం ఏంటనేది బాలినేని ప్రశ్న. ఈ నేపథ్యంలో బాలినేనిని పలు దఫాలుగా సజ్జల రామకృష్ణారెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి నచ్చచెప్పినప్పటికీ వెనక్కి తగ్గలేదు. ఈ పరంపరలో మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మీడియా ముందుకు వస్తానని బాలినేని ప్రకటించడం ఆ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. సొంత బంధువే జగన్ నిర్ణయంపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తే, ఇక మిగిలిన ప్రజాప్రతినిధుల మాటేంటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వింత పోకడలతో విసిగిపోయి… ఇక శాశ్వతంగా రాజకీయాలకు గుడ్‌బై చెప్పనున్నారని బాలినేని వర్గీయులు చెబుతున్నారు. బాలినేని మనసులో ఏముందో కాసేపటి తర్వాత తెలియనుంది. కానీ తన కోసం అన్నీ వదులుకుని వచ్చిన నేతల విషయంలో జగన్ నిరాదరణ మాత్రం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. జగన్ ప్లెక్సీలను బాలినేని అనుచరులు కాల్చుతున్నారంటే, వారిలో ఎంత అసహనం కలిగించారో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో బాలినేని కాసేపట్లో చేయనున్న ప్రకటనపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకుంది.