వైసీపీలో పాదపూజ కల్చర్ పెరిగినట్టుంది. మంత్రివర్గ ప్రమాణం తర్వాత కొందరు సీనియర్లు మినహా ఎక్కువ మంది జగన్‌కి పాదాభివందనం చేసి వెళ్లారు. వయసులో జగన్ కంటే పెద్దవాడయిన నారాయణస్వామి కూడా జగన్ పాదాలు తాకడానికి పోటీ పడడం ఎబ్బెట్టుగా అనిపించింది.
అసలీ పాదాభివందనం ఉత్తరాది పద్ధతి. మనం కూడా పెద్దలకి పాద నమస్కారం చేస్తాం కానీ, పండగలు లేదా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే. కనపడగానే కాళ్లకి దండం పెట్టే అలవాటు లేదు.
పాదాభివందనం ఉత్తరాది సంస్కృతే అయినా ఇందిరాగాంధీ ఎప్పుడూ దీన్ని ప్రోత్సహించలేదు. ఆంధ్రాలో అంతకు ముందు లేదు కానీ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత బాగా పెరిగింది. సినిమా ఫీల్డ్‌లో ఈ అలవాటు ఎక్కువ. మీడియా ముందు కబుర్లు చెప్పే చాలా మంది హీరోలు ఈ పాదాభివందనాలని ఎంజాయ్ చేస్తారు. పాద నమస్కారం చేయనివాళ్లని గుర్రుగా చూస్తారు.
ఏ విషయంపైనైనా ధైర్యంగా మాట్లాడతాడని పేరున్న ఒక క్యారెక్టర్ నటుడికి కూడా కాళ్లకి దండం పెట్టించుకునే అలవాటు వుండడం విచిత్రం. ఎన్టీఆర్ హయాంలో ఒక రేంజ్‌లో పాదపూజ కొనసాగింది. ఆయన కాళ్లకి దండం పెట్టిన వాళ్లే ముందు వరసలో నిలబడి కాళ్లు లాగేసి కింద పడేసారు. సముద్రంలో ఉప్పు వున్నంత సహజంగా రాజకీయాల్లో నమ్మక ద్రోహం వుంటుంది.
వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ సంస్కృతిని ప్రోత్సహించేవాడు కాదు. కాళ్ల మీద పడడానికి ప్రయత్నించినా ఇబ్బందిగా వారించేవాడు. కాళ్లులాగే విద్యలో చంద్రబాబుకి మాస్టర్ డిగ్రీ వుంది కాబట్టి, పాదపూజలను భయంగా చూసేవాడు.
పాదపూజ పీక్స్‌కి తీసుకెళ్లింది జయలలితే. వయసుతో నిమిత్తం లేకుండా ఎవరైనా ఆమె కాళ్లపై పడాల్సిందే. వాళ్లే కేబినెట్‌లో వుంటారు. అందువల్ల జయలలిత ఫొటోకి కూడా మంత్రులు సాష్టాంగ నమస్కారం చేసేవాళ్లు.
జగన్ కూడా ఈ సంస్కృతికి శ్రీకారం చుట్టినట్టున్నాడు. కాళ్లులాగే అవకాశం, పాదాలపై పడేవాళ్లకే ఎక్కువగా వుంటుంది. చరిత్రలో ఇదే జరిగింది. ఇదే జరుగుతుంది. చరిత్ర నుంచి ఏమీ నేర్చుకోకపోతే మనం ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్‌గా మిగిలిపోతాం.