మంత్రి ప‌ద‌వి పోయినందుకు కాదు…అందుకే బాధంతా!

మేక‌తోటి సుచ‌రిత‌… ఏపీ మొట్ట‌మొద‌టి ద‌ళిత హోంమంత్రి. ఈ విష‌యాన్ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌, వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఎంతో గొప్ప‌గా చెప్పుకునే వారు. మూడేళ్ల పాటు జ‌గ‌న్ కేబినెట్‌లో కీల‌క మంత్రిత్వ‌శాఖ బాధ్య‌త‌లు…

మేక‌తోటి సుచ‌రిత‌… ఏపీ మొట్ట‌మొద‌టి ద‌ళిత హోంమంత్రి. ఈ విష‌యాన్ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌, వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఎంతో గొప్ప‌గా చెప్పుకునే వారు. మూడేళ్ల పాటు జ‌గ‌న్ కేబినెట్‌లో కీల‌క మంత్రిత్వ‌శాఖ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. జ‌గ‌న్ ముందే చెప్పిన‌ట్టు, కేబినెట్ మార్పున‌కు శ్రీ‌కారం చుట్టారు. కేబినెట్ అంతా మూకుమ్మ‌డిగా రాజీనామాలు చేశారు. మంత్రి ప‌ద‌వుల‌కు రాజీనామా చేస్తున్నందుకు త‌మ‌కెలాంటి ఆవేద‌న లేద‌ని, జ‌గ‌న్ మాటే శిరోధార్య‌మ‌ని ఆర్భాటంగా ప్ర‌క‌టించారు.

అయితే త‌మ స‌హ‌చ‌రుల్లో 11 మంది తిరిగి మంత్రి ప‌ద‌వులు ద‌క్కించుకోవ‌డంతో, తిరిగి మంత్రి ప‌ద‌వులు పొందిన వాళ్ల మ‌న‌సులో ఏముందో బ‌య‌ట‌ప‌డింది. వైఎస్ జ‌గ‌న్‌కు ఎంతో న‌మ్మ‌క‌స్తురాలిగా ఇంత కాలం గుర్తింపు పొందిన మేక‌తోటి సుచ‌రిత అనూహ్యంగా బ‌హిరంగంగానే నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

కేబినెట్‌లో తిరిగి బెర్త్ ద‌క్క‌క‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి సుచ‌రిత రాజీనామా చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. త‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డాన్ని నిర‌సిస్తూ ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గం వ్యాప్తంగా పార్టీతో పాటు ప‌లు స్థానిక సంస్థ‌ల ప‌ద‌వుల‌కు నాయ‌కులు రాజీనామాలు శ్రీ‌కారం చుట్టిన నేప‌థ్యంలో ఇవాళ ఆమె వారితో స‌మావేశం నిర్వ‌హించారు.

సుచ‌రిత మాట్లాడుతూ మంత్రి ప‌ద‌వి ద‌క్క‌క‌పోవ‌డం పెద్ద‌గా బాధ క‌లిగించ‌లేదన్నారు. కానీ తొల‌గించిన తీరు మాత్రం తీవ్ర ఆవేద‌న‌కు గురి చేసింద‌న్నారు. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో స్పీక‌ర్ ఫార్మ‌ట్‌లో ఎమ్మెల్యే ప‌ద‌వికి మాత్రం రాజీనామా చేసిన‌ట్టు ప్ర‌క‌టించారు. చివ‌రి వ‌ర‌కూ జ‌గ‌న్ వెంట న‌డుస్తాన‌ని ఆమె ప్ర‌క‌టించ‌డం విశేషం. త‌ను మిన‌హా మిగిలిన వారెవ‌రూ రాజీనామాలు చేయొద్ద‌ని ఆమె కోరారు. సుచ‌రిత క‌ఠిన నిర్ణ‌యంపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.