టోటల్ ఉత్తరాంధ్రాలో యువ మంత్రిగా అనకాపల్లి జిల్లాకు చెందిన గుడివాడ అమరనాధ్ ఉన్నారు. అందరూ ఆయన కంటే సీనియర్లే. ఏ రకంగా చూసినా అనుభవం కలిగిన వారే. ఇక జగన్ని నమ్ముకుని టీడీపీ నుంచి పదకొండేళ్ళ క్రితం వైసీపీలో చేరిన గుడివాడకు పూర్తి న్యాయం జరిగింది అని అంతా అంటున్నారు.
టీడీపీలో కార్పోరేటర్ గా జీవితాన్ని మొదలెట్టిన గుడివాడ అక్కడ ఎదగడం కష్టమని వైసీపీలో చేరారు. జగన్ సైతం గుడివాడది రాజకీయ కుటుంబం కావడంతో అక్కున చేర్చుకున్నారు. గత కొన్నేళ్ళుగా అనేక రాజకీయ అవకాశాలు గుడివాడకు ఇస్తూనే ఉన్నారు.
తొలి దఫాలోనే మంత్రి కావాల్సి ఉన్నా అవంతి శ్రీనివాసరావు కారణంగా చాన్స్ తప్పిపోయింది. ఇపుడు మాత్రం జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకుని మంత్రిని చేశారు. బలమైన సామాజికవర్గానికి చెందిన గుడివాడ మంత్రిగా అనకాపల్లి జిల్లాలో వైసీపీ మెరుపులు మెరిపించాల్సి ఉంది.
అనకాపల్లి జిల్లా అంతా వైసీపీ స్వీప్ చేసింది. మరో మారు ఆ మ్యాజికి రిపీట్ చేయడమే యువ మంత్రి చేయాల్సి ఉంది. మొత్తానికి చంద్రబాబు సహా రాజకీయ ప్రత్యర్ధులను చెడుగుడు ఆడించడంలో ముందు వరసలో ఉండే గుడివాడ ఇపుడు స్వపక్షం సిక్సర్లు కొట్టేలా మెరుపు షాట్లు విరగదీయాల్సి ఉంది. దానికి నేను రెడీ అంటున్నారు గుడివాడ.