మంత్రి పదవి దక్కని ఆశావహులు తమ అసంతృప్తిని బహిరంగంగా ప్రకటిస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా నేరుగా సీఎం జగన్ కోటరీపైనే విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ పరిణామాలను అధికార పార్టీ జీర్ణించుకోలేకపోతోంది. ఇంత కాలం సీఎం జగన్ నిర్ణయాన్ని బహిరంగంగా తప్పు పట్టేవాళ్లే కనిపించలేదు. అలాంటిది ఇప్పుడు నేరుగానే విమర్శలు సంధిస్తున్నారు.
జగన్ విధేయుడిగా గుర్తింపు పొందిన జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో విమర్శలకు దిగారు. ఒకవైపు కొత్త కేబినెట్ ప్రమాణస్వీకారం చేస్తుండగా, మరోవైను ఉదయభాను విమర్శలు చేయడం అధికార పార్టీకి తలనొప్పిగా మారింది.
సీఎం జగన్ వద్ద కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు కోటరీగా ఏర్పడ్డారని ఆరోపించారు. వారి కోటరీ కారణంగానే తనకు మంత్రి పదవి రాలేదని భావిస్తున్నట్టు ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. పరోక్షంగా మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలపై ఆయన విమర్శలు చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పని చేశానన్నారు. మాజీ ఎమ్మెల్యేగా తానే మొదట పార్టీలో చేరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. జగన్‌ను అరెస్టు చేస్తే… జిల్లాలో పార్టీ కోసం పని చేశానన్నారు. తన తరువాత వచ్చిన వారికి మంత్రి పదవి ఇచ్చినా తాను బాధ పడలేదన్నారు.
రెండో విడత ఇస్తారని భావించానని.. ఇప్పుడు కూడా అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పదవితో సంబంధం లేకుండా జగన్‌కు విధేయునిగా ఉంటానని ఆయన స్పష్టం చేయడం గమనార్హం. ఒకవైపు జగన్‌పై విధేయతను ప్రకటిస్తూనే, మరోవైపు ఆయన కోటరీపై ఉదయభాను విమర్శలు చేయడం చర్చనీయాంశమైంది. రానున్న రోజుల్లో ఈ అసంతృప్తులు పార్టీకి డ్యామేజీ కలిగిస్తాయనే ఆందోళన మాత్రం వైసీపీలో ఉంది.