ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేబినెట్ విస్తరణలో బీసీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో టీడీపీ గుండెల్లో గుబులు పుట్టింది. టీడీపీకి బీసీ సామాజిక వర్గం మొదటి నుంచి వెన్నుదన్నుగా నిలుస్తోంది. అయితే అందుకు తగ్గట్టు బీసీలకు టీడీపీ పదవుల పంపిణీలో తగిన న్యాయం చేయలేదు. మరోవైపు పార్టీ, ప్రభుత్వ పదవుల్లో బీసీలకు అగ్రస్థానం కల్పిస్తూ, టీడీపీ ఓటుబ్యాంకుకు జగన్ చిల్లు పెట్టారు. గత ఎన్నికల్లో బీసీలు అత్యధికంగా వైసీపీ వైపు మొగ్గు చూపడం వల్లే 151 అసెంబ్లీ, 22 పార్లమెంట్ స్థానాలు దక్కాయి. మరోసారి ఆ ఓటు బ్యాంకును నిలుపుకునేందుకు జగన్ వ్యూహాత్మకంగా నడుచుకుంటున్నారు.
దీన్ని గ్రహించిన టీడీపీ, నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఆ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చొరవ చూపారు. పార్టీ లేదు, బొక్కా లేదన్న అచ్చెన్నాయుడు మరోసారి కొత్త పల్లవి అందుకున్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తమ పార్టీకి 160 అసెంబ్లీ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన బీసీల సదస్సులో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడారు. తాజా మంత్రివర్గ పునర్వ్యస్థీకరణలో అత్యధికంగా బీసీలకు చోటు కల్పించడంతో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఆందోళన చెందుతోంది. ఇందుకు అచ్చెన్నాయుడి మాటలే నిదర్శనం.
ఒకవైపు వైసీపీ బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో టీడీపీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. వెంటనే బీసీలతో సమావేశం నిర్వహించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ బీసీ నాయకులను తయారు చేసే కర్మాగారం టీడీపీ అని అన్నారు. మూడేళ్లలో బలహీనవర్గాలకు ఏం చేశారో సీఎం జగన్ శ్వేత పత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు.
బీసీలకు ఎవరేం చేశారన్నదానిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని జగన్‌కు సవాల్ విసిరారు. బీసీలకు ఎన్నో పథకాలు తీసుకొచ్చింది టీడీపీ హయాంలోనే అని గుర్తు చేశారు. బలహీన వర్గాల నిధులను దారి మళ్లించిన ఘనత వైసీపీదే అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి బలహీన వర్గాలంటే కోపమన్నారు. అచ్చెన్నాయుడు ఎన్ని విమర్శలు చేసినా, అంతిమంగా బీసీల ఓటు బ్యాంకు చేజారిపోతోందనే అలజడి స్పష్టంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.