వినాశకాలే విపరీత బుద్ధి అని పెద్దలు అన్నారు. వినాశకాలం దాపురించినప్పుడు ఎవరికైనా విపరీత బుద్ధులు పుడుతాడని పెద్దల మాటల్లోని సారాంశం. చంద్రబాబుకు రాజకీయంగా వినాశకాలం దరి చేరిందని, అందుకే ఆయన విపరీత చర్యలకు దిగారనే చర్చకు తెరలేచింది. ఇందుకు తాజా ఉదాహరణ పింఛన్‌దారులకు వలంటీర్ల ద్వారా డబ్బు పంపిణీ చేయకూడదని తన నీడ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ద్వారా ఈసీకి ఫిర్యాదు చేయించారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ సంస్థ ఎవరి జేబులో సంస్థనో, దాని ముసుగులో నిమ్మగడ్డ చేస్తున్న అప్రజాస్వామిక పనులేంటో అందరికీ తెలుసు. ఆ సంస్థ పేరులో ప్రజాస్వామ్యం తప్ప, చేష్టలన్నీ అప్రజాస్వామికమే. పింఛన్దారులంటేనే… నిస్సహాయ స్థితిలో ఉండేవారని అర్థం. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాల పింఛన్‌దారులు సుమారు 66.40 లక్షల మంది ఉన్నారు. గత 55 నెలలుగా జగన్ ప్రభుత్వం ప్రతినెలా ఒకటో తేదీన వలంటీర్ల ద్వారా ఇళ్ల దగ్గరికే వెళ్లి పింఛన్ సొమ్మును అందజేస్తోంది.
అయితే వలంటీర్లతో రాజకీయంగా చంద్రబాబు, ఆయన నేతృత్వంలోని కూటమికి రాజకీయంగా నష్టం వస్తుందని నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఆందోళన చెందారు. ఎలాగైనా ఎన్నికల సమయానికి వాళ్ల ఊసే లేకుండా చేయాలని కూటమి పంతం పట్టడం, ఇందుకు నిమ్మగడ్డను అస్త్రంగా ప్రయోగించారు. చివరికి పింఛన్‌దారులకు వెన్నుపోటు పొడిచారనే చెడ్డపేరు సంపాదించుకున్నారు.
వలంటీర్లను అడ్డుకోకపోతే, ఇవాళ తెల్లవారుజామునే పింఛన్‌దారులందరికీ లబ్ధి కలిగేది. కానీ చంద్రబాబు వైఖరితో ఏప్రిల్ 3 నుంచి పింఛన్ పంపిణీ చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. అది కూడా గ్రామ, వార్డు సచివాలయాల వద్దకే లబ్ధిదారులు వెళ్లి పింఛన్ సొమ్ము తీసుకోవాలి. వలంటీర్లతో పంపిణీ చేయకుండా అడ్డుకున్న నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ హాయిగా సేదతీరారు. ఇప్పుడు నష్టమల్లా కూటమికే. అందుకే కూటమి నేతలు ఆందోళన చెందుతున్నారు.
ఎప్పుడైతే నష్టం జరుగుతుందనే సంకేతాలు వెలువడ్డాయో …చంద్రబాబు అప్రమత్తమై ఈసీ, సీఎస్‌కు లేఖలు రాశారు. ఇది ఎలా వుందంటే మొగున్ని కొట్టి మొగసాలకు ఎక్కిన సామెతను చంద్రబాబు ధోరణి గుర్తు చేస్తోంది. 66.40 లక్షలకు పైగా పింఛన్‌దారులకు సంబంధించిన వ్యవహారంలో ఆచితూచి అడుగు వేయాల్సిన చంద్రబాబు, అందుకు విరుద్ధంగా నడుచుకున్నారు.
ఇప్పుడు చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారాయన. తమకు ఒకటో తేదీన పింఛన్ అందకపోవడానికి, అలాగే మళ్లీ టీడీపీ పాలనలో క్యూలు, గంటల తరబడి ఎదురు చూడాల్సిన దుస్థితికి చంద్రబాబే కారణమని నిస్సహాయులైన పింఛన్‌దారులంతా నమ్ముతున్నారు. ఎన్నికల ముంగిట వారి ఆగ్రహాన్ని కోరి తెచ్చుకోవడం అంటే… వినాశకాలం కాక, మరేంటనే ప్రశ్న ఉత్పన్నమైంది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అని పెద్దలు ఊరికే చెప్పలేదు. బాబు ఆదేశించారు … నిమ్మగడ్డ పాటించారు. పింఛన్‌దారులకు ద్రోహం చేసిందంతా చేసి, ఇప్పుడు ఏమీ తెలియని నంగనాచిలా చంద్రబాబు కబుర్లు చెబితే నమ్మేదెవరు? మూల్యం చెల్లించుకోడానికి బాబు సిద్ధంగా ఉండాలి.