ఆంధ్రప్రదేశ్‌లో అర సున్న ఓటు బ్యాంక్ వున్న బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం సహజంగానే ఆ పార్టీ శ్రేణులతో పాటు రాష్ట్ర ప్రజానీకాన్ని నివ్వెరపరిచింది. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా వ్యవస్థల సహకారం వుంటుందని చంద్రబాబునాయుడి వ్యూహమని కూటమి నేతలు చెబుతున్నారు. ఎన్నికలు కాస్త ఆలస్యం కావడానికి బీజేపీతో పొత్తే కారణమని టీడీపీ నేతలు బాహాటంగానే అంటున్నారు.
ఈ నేపథ్యంలో వ్యవస్థల్ని అడ్డం పెట్టుకుని ఇంత వరకూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఏమీ చేయలేకపోయారు. భవిష్యత్‌లో ఏదో చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే, వ్యవస్థల్ని సామాన్య జనంపై ప్రయోగించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 55 నెలలుగా పింఛన్లను లబ్ధిదారులకు నేరుగా ఇంటికెళ్లి వాలంటీర్లు అందజేస్తున్నారు. అయితే వాలంటీర్లు వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తారనే భయంతో నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను అడ్డం పెట్టుకుని చంద్రబాబునాయుడు తన మార్క్ కుట్ర రాజకీయానికి తెరలేపారు.
దీని పర్యవసానమే పింఛన్లకు తిప్పలు. బీజేపీతో టీడీపీ, జనసేన పొత్తు వల్ల మొదటి బాధితులుగా పింఛన్‌దారులు మిగలడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. వృద్ధులు, వికలాంగుల, గడప దాటలేని దయనీయ స్థితిలో ఉన్న వివిధ రకాల పింఛన్‌దారుల గోడు వర్ణనాతీతం. చంద్రబాబు ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తారని కలలో కూడా అనుకోలేదని వారు మండిపడుతున్నారు. వ్యవస్థల్ని తమపై ప్రయోగించడానికా బీజేపీతో పొత్తు అని వారు నిలదీస్తున్నారు.
బీజేపీతో పొత్తు వల్ల వ్యవస్థల సహకారం తీసుకోవడం అంటే ఇదేనా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడే ఇంత దుర్మార్గంగా వుంటే, రేపు ప్రభుత్వం వస్తే ఇంకేం చేస్తాడో అని చంద్రబాబుపై తిట్ల వర్షం కురిపిస్తున్నారు. బీజేపీతో పొత్తు, వ్యవస్థల సహకారం అంటే జగన్‌ను ఏదైనా చేస్తారని భయపడ్డామని, కానీ తమపై అస్త్రాన్ని ప్రయోగించి, ఒకటో తేదీ అందాల్సిన పింఛన్ సొమ్ము దక్కకుండా చేయడంలో చంద్రబాబు విజయం సాధించారంటూ పింఛన్‌దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.