చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు (జీడీనెల్లూరు) టీడీపీ అభ్యర్థి వీఎం థామస్ కులంపై వివాదం నెలకుంది. ఈ మేరకు ఆయనపై సామాజిక కార్యకర్తలు ఆధారాలతో సహా జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. థామస్‌పై విచారించి తగిన చర్యలు తీసుకోవాలంటూ విన్నవించడం గమనార్హం.
కార్వేటినగరం మండలం అల్లాగుంట గ్రామంలో 28.06.74 లో థామస్ పుట్టారు. అప్పటికే ఆయన తల్లిదండ్రులు క్రైస్తవ మతం స్వీకరించారు. అయినా రిజర్వేషన్ కోసం ఆయన ఆది ద్రావిడ కులానికి చెందిన వ్యక్తిగా కొనసాగుతున్నారనేది ఫిర్యాదుదారుల ఆరోపణ. థామస్ 12 ఏళ్ళ బాప్టిస్ట్ అయ్యారని ఆయన తల్లి చెప్పిందని గుర్తు చేశారు.
ఇలా అనేక రకాల ఆధారాలతో గంగాధర నెల్లూరు నియోజక వర్గం టీడీపీ అభ్యర్థి డాక్టర్ వడింగాడు మునస్వామి థామస్ (డాక్టర్ వి ఎం థామస్) క్రైస్తవ మతస్థుడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆది ద్రావిడ కులంలో పుట్టినప్పటికీ క్రైస్తవ మతం స్వీకరించిన ఆయనకు ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని తెలిపారు. మతం మారిన వారిని బీసీలుగా గుర్తించాలని చట్టం చెబుతుండడాన్ని ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లారు. అయినా ఆయన తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం సమర్పించి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ద పడుతున్నారని వెల్లడించారు.
సహజంగా పదో తరగతి మార్కుల సర్టిఫికెట్‌ను పుట్టిన తేదీకి, టిసిని కుల ధ్రువీకరణకు ప్రామాణికంగా చూస్తారని ఫిర్యాదులో తెలిపారు. ఇక్కడ ఆ ప్రస్తావన లేదని పేర్కొన్నారు. కులం పై వివాదం వచ్చినపుడు గ్రామంలో నలుగురిని అడిగి పంచనామ చెయ్యాలి. అవి ఏవి చేయకుండా, టి సి, పాస్ పోర్టులో పేరు వేరు వేరుగా ఉన్నందుకు కారణం తెలపకుండా గతంలో రెవెన్యూ అధికారులు నివేదిక ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఎన్నికల అధికారికి చేసిన ఫిర్యాదులో ప్రస్తావించారు.
ఇంకా ఆ ఫిర్యాదులో ఏం పేర్కొన్నారంటే… సహజంగా పాస్ పోర్టు మంజూరు సమయంలో ఒక అక్షరం తప్పు ఉన్నా అధికారులు ఆమోదించరు. మునస్వామి పక్కన థామస్ అన్న పదం కలవడానికి సరైన ఆధారం చూపకుండా సమ్మతించరు. పేరు మార్చుకోవాలి అంటే గెజిట్ నోటిఫికేషన్ ఉండాలి. మతం మార్చుకుని ఉంటే సంబంధిత ధృవీకరణ పత్రాలు సమర్పించాలి. కాబట్టి పాస్ పోర్టు సమయంలో మత మార్పిడి ధృవీకరణ పత్రం, గెజిట్ నోటిఫికేషన్ సమర్పించి ఉంటారు. పాస్ పోర్టు కార్యాలయం నుంచి నివేదిక తెప్పించుకుంటే ఆ విషయం తెలుస్తుంది. అలా కాకుండా తూతూ మంత్రంగా నివేదికలు ఇవ్వడం తగదని ఫిర్యాదులో పేర్కొన్నారు.