చంద్రబాబు కనీసం ఇవాళైనా తేలుస్తారా?

చంద్రబాబునాయుడు.. కనీసం ఇవ్వాళైనా నాలుగుపేర్లను తేలుస్తారా?

ఇప్పుడంటే డిజిటల్ స్ట్రీమింగ ద్వారా.. శ్రమ తెలియకుండా సినిమాలు విడుదల అవుతున్నాయి గానీ.. గతంలో ఫిల్ముల ద్వారా ప్రొజెక్షన్ జరుగుతున్న రోజుల్లో చాలా చిత్రాలు చోటుచేసుకుంటూ ఉండేవి. పెద్ద హీరోల చిత్రాలు కొన్ని.. టెక్నికల్ వర్క్ ఆలస్యం కావడం వల్ల.. విడుదల తేదీ ముంచుకువచ్చేసినా.. కాపీలు రెడీ అయ్యేవి కాదు. అలాంటి సందర్భాల్లో కాపీ రెడీ అయిన వెంటనే.. దూర ప్రాంతంలో ఉండే నగరాలకు హెలికాప్టర్ ద్వారా బాక్సులు పంపిన దాఖలాలు మనకు ఉన్నాయి.

కేవలం సినిమా రంగంలో మాత్రమే కాదు.. రాజకీయ రంగంలో కూడా.. నామినేషన్ల దాఖలు పర్వం పూర్తయిపోయిన తర్వాతకు కూడా నియోజకవర్గంలో అభ్యర్థులు ఎవరో ఖరారు చేయకుండా, తీరా ఉపసంహరణలు, స్క్రూటినీ కూడా పూర్తయిపోయే సమయానికి, గడువు ముగిసిపోయే చివరిక్షణాలకు బీ ఫారాలను హెలికాప్టరు ద్వారా పంపి.. రిటర్నింగ్ అధికారులకు అందేలా చూసిన చరిత్ర చంద్రబాబునాయుడుకు ఉంది. వ్యవహారం పీకల మీదకు వచ్చేసేదాకా ఏ సంగతీ తేల్చకుండా.. ఆయన ఎలా సాగదీస్తుంటారో తెలుసుకోవడానికి ఇది చిన్న ఉదాహరణ మాత్రమే.

అలాంటి చంద్రబాబునాయుడు ఇప్పుడు కూడా నిర్ణయం తీసుకోవడంలో అదే ఆలసత్వ ధోరణి ప్రదర్శిస్తూ ఎమ్మెల్సీ ఆశావహులకు బీపీ పెంచేస్తున్నారు. ఏపీలో ఇప్పుడు ఎమ్మెల్యేల కోటాలో భర్తీ చేయాల్సిన అయిదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. సంఖ్యాబలాలను బట్టి.. ఈ అయిదు సీట్లు కూడా కూటమి పార్టీలకు మాత్రమే దక్కబోతున్నాయి.

ఒకసీటు జనసేనకు కేటాయించగా.. గెలిచిన వెంటనే మంత్రి కాబోతున్న కొణిదెల నాగబాబు ఆ స్థానానికి నామినేషన్ కూడా వేసేశారు. సోమవారం నామినేషన్ల దాఖలుకు తుదిగడువు. అయిదుకు మించి నామినేషన్లు దాఖలు కాకపోతే గనుక.. ఏకగ్రీవంగా ప్రకటించే అవకాశం ఉంటుంది. అయితే తెలుగుదేశం తరఫున అభ్యర్థులు ఎవరనేది ఇంకా నిర్ణయం జరగలేదు.

శనివారం నాటికి పేర్ల ప్రకటన ఉంటుందని తొలుత ప్రచారం జరిగింది. సోమవారమే నామినేషన్ దాఖలుకు చివరితేదీ కాగా.. నాలుగుపేర్లను ఇంకా చంద్రబాబు తేల్చలేదు. దాదాపు పాతిక మందికి పైగా పోటీపడుతుండగా.. తాను మనసులో అనుకున్న నాలుగుపేర్లు తప్ప మిగిలిన వారిని బుజ్జగించడానికే ఆయన సమయం మొత్తం సరిపోతోంది. పవన్ కల్యాణ్ కోసం తన నియోజకవర్గం త్యాగం చేసిన పిఠాపురం వర్మకు ఈసారి అవకాశం గ్యారంటీ అనే ప్రచారం జరుగుతోంది. అలాగే ఇంకొందరు త్యాగమూర్తులు- మాజీమంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కెఎస్ జవహర్, పీతల సుజాత తదితరులున్నారు.

టీటీడీ బోర్డు సభ్యుడి పదవి దక్కించుకున్నప్పటికీ.. జంగా కృష్ణమూర్తి కూడా తన అనుకూలురతో సిఫారసులు చేయించుకుంటున్నారు. కొమ్మాల పాటి శ్రీధర్, బుద్ధా వెంకన్న, బీద రవిచంద్ర, పరసారత్నం తదితరులు కూడా ఆశిస్తున్నారు. బీసీ ఎస్సీలకు తెదేపా పెద్దపీట వేస్తుందని అనుకుంటున్న నేపథ్యంలో రకరకాల ఊహాగానాలు రేగుతున్నాయి. చంద్రబాబునాయుడు.. కనీసం ఇవ్వాళైనా నాలుగుపేర్లను తేలుస్తారా? లేదా, సోమవారం మధ్యాహ్నం దాకా నాన్చి, అప్పటికప్పుడు పార్టీ అభ్యర్థులను తేల్చి, పురమాయించి పంపుతారా అనేది పార్టీ వారికే అంతు చిక్కడం లేదు.

4 Replies to “చంద్రబాబు కనీసం ఇవాళైనా తేలుస్తారా?”

  1. janasena is setting trend here by declaring candidates early and finishing the process on time. That is why new parties come with fresh ideas. Jai Janasena.

  2. మా అన్నయ్య లా పార్టీ నీ ఎవరు నడిపించలేరు..

    సింగిల్ డెసిషన్ తీసుకుంటాడు బిసి, ఎస్సీ, ఎస్టీ, మహిళా, జనరల్ తలా ఒకటి ఇస్తాడు అంతే బుజ్జగింపులు,బతిమాలటాలు ఉండవు పార్టీ నడిచేదే మా అన్నయ్య ఇమేజ్ తో కాబట్టే..

Comments are closed.