రూ.1000 కోట్ల ఓటేరు చెరువు టీడీపీ నేత క‌బ్జా!

సామాన్య పేద ప్ర‌జ‌లు ఒక‌ట్రెండు సెంట్ల ప్ర‌భుత్వ స్థ‌లంలో ఇల్లు క‌ట్టుకుందామ‌ని స్వాధీనం చేసుకుంటే, ఒక‌ట్రెండు బుల్డోజ‌ర్లు, వంద‌ల సంఖ్య‌లో పోలీసులు వాలిపోతారు.

సామాన్య పేద ప్ర‌జ‌లు ఒక‌ట్రెండు సెంట్ల ప్ర‌భుత్వ స్థ‌లంలో ఇల్లు క‌ట్టుకుందామ‌ని స్వాధీనం చేసుకుంటే, ఒక‌ట్రెండు బుల్డోజ‌ర్లు, వంద‌ల సంఖ్య‌లో పోలీసులు వాలిపోతారు. ప్ర‌భుత్వ స్థ‌లం నుంచి పేద‌ల‌ను త‌రిమి కొడ‌తారు. వైసీపీ నేత‌లు ఎక్క‌డైనా ప్ర‌భుత్వ భూమిని ఆక్ర‌మించార‌నే వార్త‌లొస్తే చాలు… వెంట‌నే కూట‌మి ప్ర‌భుత్వం విచార‌ణ‌కు ఆదేశిస్తుండడాన్ని చూస్తున్నాం.

అలాంటిది చెన్నై-చిత్తూరు నేష‌న‌ల్ హైవే ప‌క్క‌న‌, చంద్ర‌గిరి ఎమ్మెల్యే పులివ‌ర్తి నాని నివాసానికి స‌మీపంలో 36 ఎక‌రాల ఓటేరు చెరువును టీడీపీ నేత‌, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీనాయుడు ఆక్ర‌మించార‌నే విమ‌ర్శ‌లు, ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. సాక్ష్యాత్తు శ్రీ‌కాళ‌హ‌స్తి ఎమ్మెల్యే బొజ్జ‌ల సుధీర్‌రెడ్డి అసెంబ్లీలోనే ఓటేరు చెరువు ఆక్ర‌మ‌ణ గురించి ప్ర‌స్తావించారు. ఈ చెరువును కాపాడాల‌ని రెవెన్యూశాఖ మంత్రి అన‌గాని స‌త్య‌ప్ర‌సాద్‌కు విన్న‌వించారు.

మ‌రోవైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో భూఆక్ర‌మ‌ణ‌దారుల వెన్నులో వ‌ణుకు పుట్టించేందుకే ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిషేధ చ‌ట్టాన్ని శాస‌న‌స‌భ, శాస‌న మండ‌లిలో ఆమోదించామ‌ని, ఇక కేంద్ర ప్ర‌భుత్వ అధికారిక గ్రీన్‌సిగ్న‌ల్ కావాలంటూ ఇటీవ‌ల ఢిల్లీలో కేంద్ర‌హోంశాఖ మంత్రి అమిత్‌షాను సీఎం చంద్ర‌బాబు కోరిన సంగ‌తి తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యే, త‌న పార్టీకి చెందిన నాయ‌కుడు ఓటేరు చెరువును ఆక్ర‌మించార‌ని ఫిర్యాదు చేసినా ప్ర‌భుత్వంలో చ‌ల‌నం లేక‌పోవ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తోంది.

చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం తిరుప‌తి రూర‌ల్ ప‌రిధిలోని అవిలాల గ్రామ రెవెన్యూ లెక్క దాఖ‌లా స‌ర్వే నంబ‌ర్ 370లో 6.76 ఎక‌రాలు, 376లో 12.40 ఎక‌రాలు, 333లో 17.18 ఎక‌రాలు…మొత్తం 36.34 ఎక‌రాలుంది. రెవెన్యూ రికార్డుల ప్ర‌కారం ఇదంతా చెరువే.వంద‌లాది ఎక‌రాల‌కు సాగునీరు అందించేందుకు ఈ చెరువును ఉప‌యోగించుకోవ‌చ్చు. అయితే పాల‌కుల్లో చిత్త‌శుద్ధి కొర‌వ‌డ‌డంతో అన్యాక్రాంత‌మ‌వుతోంది.

ప్ర‌ధానంగా ఈ చెరువును మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్సీవీ నాయుడే ఆక్ర‌మించార‌ని, అదే పార్టీకి చెందిన ప్ర‌జాప్ర‌తినిధి ఆరోపించ‌డంతో ఆరోప‌ణ‌ల‌కు బ‌లం క‌లుగుతోంది. కానీ త‌న ఇంటి స‌మీపంలోని, అలాగే సొంత నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఓటేరు చెరువు ఆక్ర‌మ‌ణ‌కు గురి అవుతున్నా, చంద్ర‌గిరి ఎమ్మెల్యే పులివ‌ర్తి నాని నోరు మెద‌ప‌క‌పోవ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు, అనుమానాల‌కు దారి తీస్తోంది.

ప్ర‌జ‌ల, ప్ర‌భుత్వ ఆస్తుల‌కు ప‌రిర‌క్ష‌కుడిగా వుండాల్సిన పులివ‌ర్తి నాని…ఓటేరు చెరువును త‌న పార్టీ, అలాగే సొంత సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు ఆక్ర‌మించ‌డం వ‌ల్లే మౌనాన్ని ఆశ్ర‌యించి, వ‌త్తాసు ప‌లికార‌నే విమ‌ర్శ వెల్లువెత్తుతోంది. మ‌రోవైపు సీపీఐ, సీపీఎం నాయ‌కులు ఓటేరు చెరువును సంద‌ర్శించి, ఎలాగైనా కాపాడుకుంటామ‌ని ప్ర‌క‌టించారు. ఈ చెరువు ఆక్ర‌మ‌ణ ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఎస్సీవీ నాయుడికి నాని వ‌త్తాసుకు ఎంత బేరం కుదిరింద‌ని వామ‌ప‌క్షాల నేత‌లు ప్ర‌శ్నించ‌డం ఆలోచింప‌జేసేలా వుంది.

ఈ ఆక్ర‌మ‌ణ భూమి విలువ బొజ్జ‌ల సుధీర్‌రెడ్డి అసెంబ్లీలో చెప్పిన ప్ర‌కారం రూ.800-900 కోట్లు. కానీ హైవే రోడ్డు త్వ‌ర‌లో ఆరులేన్ల మార్గంగా మారి, మ‌రింత విశాల‌మైన ప్ర‌ధాన రోడ్డుగా తయారుకానుంది. దీంతో హైవేకి స‌మీపంలోని భూముల విలువ అమాంతం పెర‌గ‌నుంది. స్థానికులు, వామ‌ప‌క్షాల నాయ‌కులు చెబుతున్న ప్ర‌కారం …ఈ ఆక్ర‌మ‌ణ భూమి విలువ రూ.1000 కోట్లు. ఇంత‌కంటే, ప‌ది రూపాయిలు ఎక్కువే త‌ప్ప‌, త‌గ్గే ప్రశ్నే వుండ‌ద‌ని వాళ్లు అంటున్నారు.

ఓటేరు చెరువును గ‌తంలో త‌మ తండ్రి కాపాడుకుంటూ వ‌చ్చార‌ని, ఆ కార‌ణంతోనే నేడు తాను మాట్లాడుతున్న‌ట్టు బొజ్జ‌ల సుధీర్‌రెడ్డి అంటున్నారు. ఎస్సీవీ నాయుడు మాత్రం త‌న‌దే భూమి అని గ‌ట్టిగా వాదిస్తున్నారు. ఆక్ర‌మ‌ణ అని ఎవ‌రు మాట్లాడినా వాళ్ల‌పై ఆయ‌న విరుచుకుప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. అస‌లే భూగ‌ర్భ జ‌లాలు అడుగంటుతున్న త‌రుణంలో చెరువుల్ని కాపాడుకోవాల్సిన అవ‌స‌రం ఎంతైనా వుంది.

కానీ ఎస్సీవీ నాయుడు విలువైన భూమి కావ‌డంతో, చెరువు అని కూడా చూడ‌లేద‌న్న విమ‌ర్శ ప్ర‌జ‌ల నుంచి వ‌స్తోంది. ముఖ్యంగా పులివ‌ర్తి నాని త‌న ఇంటికి కూత‌వేటు దూరంలో ఉన్న చెరువు క‌బ్జాపై తీవ్ర ఆరోప‌ణ‌లు వ‌స్తున్నా… అబ్బే త‌న‌కు ఏ మాత్రం సంబంధం లేద‌న్న‌ట్టు వ్య‌వ‌హ‌రించ‌డం చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు కోపం తెప్పిస్తోంది.

అయ్యా నానీ గారూ… చెడు విన‌కు, చెడు చూడ‌కు, చెడు మాట్లాడ‌కు అని జాతిపిత మ‌హాత్మాగాంధీ చెప్పిన సంద‌ర్భం వేర‌ని, చెరువు లాంటి ప్ర‌జా ఆస్తుల దోపిడీల‌కు వ‌ర్తించ‌ద‌ని చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గ వాసులు హిత‌వు చెబుతున్నారు. ఆక్ర‌మ‌ణ‌లో ఎమ్మెల్యేకు వాటా వుంద‌నే ఆరోప‌ణ‌ల్లో నిజం లేక‌పోతే, త‌క్ష‌ణం రెవెన్యూ అధికారుల‌తో విచారణ‌కు ఆదేశాలు ఇప్పించి, త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని అంద‌రి ఆస్తుల‌కు తానే ర‌క్ష‌కుడిగా వుంటాన‌ని పులివ‌ర్తి నాని నిరూపించుకోవాల్సిన త‌రుణం ఆస‌న్న‌మైంది. త‌న ఇంటికి కూత‌వేటు దూరంలోని చెరువు ఆక్ర‌మ‌ణ‌పై, ప‌క్క నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్ర‌స్తావించ‌డాన్ని త‌మ‌కు అవ‌మానంగా చంద్ర‌గిరి వాసులు భావిస్తున్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల మ‌నోభావాల‌కు అనుగుణంగా పులివ‌ర్తి నాని న‌డుచుకోవాల్సిన అవ‌స‌రం వుంది.

7 Replies to “రూ.1000 కోట్ల ఓటేరు చెరువు టీడీపీ నేత క‌బ్జా!”

  1. నిన్ననేగా SPY నాయుడు బొజ్జల సుధీర్ రెడ్డి ని ఎదో అన్నాడు అని తెగ చించుకున్నావ్…ఇప్పుడు ఏమో 100కోట్ల ఆక్రమణ ను సుధీర్ రెడ్డి అడ్డుకుంటున్నాడు అంటావ్.క్లారిటీ మిస్ ఐంది పుష్ప

  2. సొంత సామాజిక వర్గం అని నాని పట్టించుకోవటం లేదా??ఇలా ప్రతీ దాంట్లో కుల ప్రస్తావన తెస్తుంటే నీ ఆర్టికల్స్ ఎవడు నమ్ముతాడు?

  3. ఓహో ఇదేనా సుధీర్ కి ఎన్సివి నాయుడుకి గొడవ.

    బొజ్జల సుధీర్ గారికి కూడా ఒక షేర్ చేస్తే సరిపోద్ది కదా

    కూటమి ప్రభుత్వం ఫార్మ్ చేసిన తర్వాత రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళు అందరు దగ్గర అధికార పార్టీ ఎమ్మెల్యేలు కమిషన్స్ తీసుకు ంటూ వాళ్లను భయపెడుతుంది.

    అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంత నీచంగా తయారయ్యారు అంటే దీపావళి పండుగ కు తపాకాయల అంగడి పెట్టుకునే వాళ్ళ దగ్గర కూడా కమిషన్ తీసుకున్నారు అది కూడా వాళ్ల పార్టీ కార్యకర్తల దగ్గరే

  4. sontha land ni kooda kabja chesukovadam antunnara ee madhya. That is MLA’s own land. Daaniki intha negative pracharam chestunnara ra GA.

Comments are closed.