నారా రూల్: సామాన్యులకేనా? అధికులకు కూడానా?

‘పార్టీ నిర్ణయం తీసుకోకపోతే.. ఒకే వ్యక్తి ఒకే పదవిలో ఎన్ని దశాబ్దాలైనా కొనసాగవచ్చు’ అనే అర్థం కూడా వస్తుంది కదా

ప్రజాస్వామ్యం నిర్వచనమే.. ‘ఇక్కడ ప్రజలందరూ సమానులు.. కొందరు మాత్రం అధిక సమానులు’ అని కొందరు చెబుతుంటారు. ఇప్పుడు నారా వారు చెబుతున్న పార్టీ అంతర్గత నిర్మాణమూ మరియు ఇతర వ్యవహారాల గురించిన కొత్త నిబంధన వింటూ ఉంటే.. ఈ ప్రజాస్వామ్య నిర్వచనాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలని అనిపిస్తోంది.

నారా లోకేష్ చెబుతున్న సరికొత్త నియమం.. కేవలం సాధారణ కార్యకర్తలకు, ఇతర నాయకులకు మాత్రమే వర్తిస్తుందా? లేదా, పార్టీలో అధిక సమానులు, పెత్తందార్లు అయిన వారికి కూడా వర్తిస్తుందా అనే అనుమానం కలుగుతోంది.

ఇంతకూ లోకేష్ చెబుతున్న సిద్ధాంతం ఏంటంటే.. ‘ఎవరైనా సరే రెండుసార్లు ఒక పదవిలో కొనసాగిన తర్వాత.. పై పదవికైనా వెళ్లాలి. లేదా, ఒక విడత ఖాళీగా ఉండాలి’ అని! పార్టీ నిర్ణయం తీసుకుంటే కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అయినా, తానైనా పదవి తీసుకోకుండా సామాన్య కార్యకర్తల్లాగా పనిచేయాల్సిందే అని లోకేష్ అంటున్నారు.

సూత్రప్రాయంగా చూసినప్పుడు.. ఈ నియమం చాలా గొప్పగా కనిపిస్తుంది. పార్టీలో అందరికీ అవకాశాలు రావడం.. అలాగే ఔత్సాహికులైన నాయకత్వ పటిమను పదును పెట్టడం, వారందరి సేవలను వాడుకోవడం వంటి అంశాలు ఈ నియమం ద్వారా సాకారం అవుతాయి. ఇలాంటి నియమం లేకపోతే.. పార్టీలోని పెత్తందార్లతో సత్సంబంధాలు కలిగి ఉండేవాళ్లు మాత్రమే ఎప్పటికీ కీలక పదవుల్లో పాతుకుపోయినట్టుగా కొనసాగుతారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది తరువాత.. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం, అందరికీ ప్రాధాన్యం దక్కడం వంటి సూత్రాలు మంటగలిసిపోతాయి.

అయితే ఈ సూత్రాన్ని కొందరికే వర్తింపజేస్తారా? లేక అందరికీనా? అనేది తెలియడం లేదు. అందరికీ వర్తింపజేసేట్లయితే.. ఇప్పటికే సుదీర్ఘకాలంగా పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న నారా లోకేష్ కూడా ఈసారికి తప్పుకుని మరొకరికి ఆ పదవి ఇవ్వాల్సి ఉంటుంది. లేదా, ఆయన రూలు ప్రకారం ప్రమోషన్ పొందితే.. మరో పదవిలోకి వెళ్లాల్సి ఉంటుంది. అలా జరుగుతుందా? అనేది పలువురి అనుమానం.

పార్టీ జాతీయ అధ్యక్షుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వంటి అధికారాలు సమస్తం కేంద్రీకృతమై ఉండే నారా కుటుంబ పదవుల విషయంలో తప్ప, మిగిలిన పదవుల విషయంలో ఈ నియమం వర్తిస్తుందేమో అని పలువురు భావిస్తున్నారు. ‘పార్టీ నిర్ణయం తీసుకుంటే’ అని లోకేష్ ఒక మెలిక పెట్టడం గమనిస్తే.. ‘పార్టీ నిర్ణయం తీసుకోకపోతే.. ఒకే వ్యక్తి ఒకే పదవిలో ఎన్ని దశాబ్దాలైనా కొనసాగవచ్చు’ అనే అర్థం కూడా వస్తుంది కదా అనుకుంటున్నారు.

5 Replies to “నారా రూల్: సామాన్యులకేనా? అధికులకు కూడానా?”

  1. తొమ్మిది, మూడు ఎనిమిది, సున్నా, ఐదు, మూడు, ఏడు, ఏడు, నాలుగు, ఏడు వీసీ

  2. మా జగన్ అన్నా సామాన్య కార్యకర్తతొ అయితె అసలు మాట్లాడను కూడా మాట్లాడడు! నువ్వు లైట్ తీస్కొ!

Comments are closed.