జ‌న‌సేన‌లో డిష్యూం.. డిష్యూం!

జ‌న‌సేన ద్వితీయ శ్రేణి నాయ‌కుల మ‌ధ్యే తీవ్రంగా కొట్టుకోవ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

అధికారంలో ఉన్న పార్టీలో అసూయ కూడా వుంటుంది. రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్థుల కంటే, స్వ‌ప‌క్షీయుల‌తోనే ఎక్కువ ప్ర‌మాదం. మ‌రీ ముఖ్యంగా మూడు పార్టీలు క‌లిసి అధికారంలో వుంటే, ఇక గొడ‌వ‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. రెండు రోజుల పాటు పిఠాపురంలో జ‌న‌సేన‌, టీడీపీ మ‌ధ్య గొడ‌వ‌లే గొడ‌వ‌లు. ఎమ్మెల్సీ నాగ‌బాబును టీడీపీ కార్య‌క‌ర్త‌లు ఎలా అడ్డుకున్నారో అంద‌రూ చూశారు. ఈ సంద‌ర్భంగా టీడీపీ, జన‌సేన నాయ‌కుల మ‌ధ్య ఫైటింగ్ సీన్స్‌, కేసుల వ‌ర‌కూ వెళ్లాయి.

తాజాగా జ‌న‌సేన ద్వితీయ శ్రేణి నాయ‌కుల మ‌ధ్యే తీవ్రంగా కొట్టుకోవ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ ఘ‌ట‌న అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లా అయిన‌విల్లి జ‌రిగింది. పి.గ‌న్న‌వ‌రం జ‌న‌సేన కార్యాల‌యంలో మండ‌ల‌స్థాయి పార్టీ స‌మావేశంలో ఆదివారం ఆ పార్టీ మండ‌ల అధ్య‌క్షుడు పోలిశెట్టి రాజేష్‌, తొలేటి ఉమా మ‌ధ్య వాగ్వాదమే, చివ‌రికి ఒక‌రిపై మ‌రొక‌రు భౌతిక‌దాడుల వ‌ర‌కూ వెళ్లింది.

అయిన‌విల్లి జ‌న‌సేన నాయ‌కుడు తొలేటి ఉమా ఇంటిపైకి గ‌త రాత్రి పోలిశెట్టి రాజేష్ మందీమార్బలంతో వెళ్లాడు. ఉమా, ఆయ‌న భార్య‌ను తీవ్రంగా కొట్టారు. ఇదే సంద‌ర్భంలో ఉమా అనుచ‌రులు రాజేష్ కారును ధ్వంసం చేశారు. జ‌న‌సేన మండ‌ల అధ్య‌క్షుడి నేతృత్వంలో జ‌రిగిన దాడిలో ఉమా దంప‌తుల‌కు, వారి అనుచ‌రుల‌కు గాయాల‌య్యాయి. గాయ‌ప‌డిన జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల్ని అమ‌లాపురం ఏరియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

ఇదిలా వుండ‌గా ఈ వ్య‌వ‌హారంపై పోలీసులు సీరియ‌స్‌గా ఉన్నారు. దాడికి పాల్ప‌డిన రాజేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే అత‌ని వాహ‌నాన్ని ధ్వంసం చేసిన వారిపై కూడా కేసు న‌మోదు చేసిన‌ట్టు తెలిసింది. ఈ వ్య‌వ‌హారంపై జ‌న‌సేన అధిష్టానం ఎలా స్పందిస్తుందో మ‌రి!

5 Replies to “జ‌న‌సేన‌లో డిష్యూం.. డిష్యూం!”

Comments are closed.