లైసెన్సులు రద్దయ్యేదాకా ఎవ్వరినీ నమ్మలేం!

అరాచకానికి పాల్పడుతున్న దుకాణం లైసెన్స్ రద్దు చేయకుండా ఇలాంటి దుర్మార్గాలను కట్టడి చేయడం సాధ్యమవుతుందా?

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త లిక్కర్ పాలసీని తీసుకువచ్చింది. ఇది చాలా పారదర్శకమైన పాలసీ అని, ధరలను తగ్గిస్తున్నామని, అయినా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని రకరకాలుగా ఊదరగొట్టారు. మద్యం సిండికేట్లు ఏర్పడుతున్నాయని అంతా అంటోంటే… సిండికేట్లు ఏర్పడడానికి వీల్లేదని, అలా జరిగితే ఎమ్మెల్యేల మీద కూడా చర్యలు తీసుకుంటానని చంద్రబాబు హూంకరించారు.

లిక్కర్ షాపుల కేటాయింపులు జరిగిన తర్వాత అధికార కూటమికి చెందిన లోకల్ ఎమ్మెల్యేలు, లిక్కర్ షాపుల్లో ఫలానా వాటా ప్రతి నెలా తమకు కప్పం కట్టాల్సిందేనని డిసైడ్ చేస్తే, అలాంటి ఆరోపణల మీద కూడా చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రతిచోటా ఎమ్మెల్యేలకు వాటాలు చెల్లించుకుంటూనే దుకాణాలు నడుపుకుంటున్నారు.

ఆ తర్వాత బెల్టు షాపుల వంతు వచ్చింది. రాష్ట్రంలో ఒక్క బెల్టు షాపు కూడా ఉండడానికి వీల్లేదని, బెల్టు షాపులు పెడితే నేను బెల్టు తీస్తానని చంద్రబాబు పంచ్ డైలాగులు కూడా వేశారు. షాపుల లైసెన్సులు రద్దు చేసేస్తానని గదమాయించారు! కానీ ఏం జరుగుతోంది? బెల్టు షాపులు యథేచ్ఛగా నడుస్తున్నాయి. బెల్టు షాపుల కోసం విచ్చలవిడిగా సరఫరా చేయడానికి డోర్ డెలివరీ వ్యాన్లు కూడా తిరుగుతున్నాయి.

ఇలాంటి వ్యాను ఒకటి పట్టుబడిన తర్వాత లిక్కర్ వ్యాపార బాగోతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో వాహనంలో భారీ సంఖ్యలో లిక్కర్ సీసాలు పెట్టుకుని ఊరూరూ తిరుగుతూ వాటిని అమ్ముతున్న వారిని పోలీసులు పట్టుకున్నారు. ఇది ఎప్పటినుంచో జరుగుతోంది. ఇలాంటి విక్రయాలు సాగిస్తున్న దృశ్యం వీడియోగా సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత మాత్రమే పోలీసులు వారిని అరెస్టు చేశారు.

వాహనం కనిపించడంతో, నంబరు ఆధారంగా తనిఖీలు చేసి వ్యక్తులను పట్టుకోవడం పెద్ద విశేషం కాదు. కానీ ఆ వీడియో వైరల్ అయ్యేదాకా ఎక్సైజ్ పోలీసులు ఏం చేస్తున్నారనేది పెద్ద సందేహం.

అలా వాహనంలో గ్రామాలు తిరుగుతూ అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. అంతవరకు బాగానే ఉంది. మద్యం సరఫరా చేస్తున్న దుకాణం నిర్వాహకుడిని కూడా అరెస్టు చేశారు. కానీ ఈ చర్యలు సరిపోతాయా? ఇలాంటి అరాచకానికి పాల్పడుతున్న దుకాణం లైసెన్స్ రద్దు చేయకుండా ఇలాంటి దుర్మార్గాలను కట్టడి చేయడం సాధ్యమవుతుందా? మిగిలిన వారికి ఒక హెచ్చరిక పంపడం సాధ్యమవుతుందా? అనేది ప్రశ్న.

ఈ అరెస్టులు జరగ్గానే మద్యం సిండికేటునుంచి వాటాలు పొందే ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగకుండా ఉంటారా? అనే అనుమానం కూడా ప్రజల్లో ఉంది.

దుకాణాల లైసెన్సును రద్దు చేయకుండా ఉత్తుత్తి చర్యలు తీసుకుంటే, చంద్రబాబు హూంకరింపులకు కూడా ప్రజల్లో విలువ లేకుండా పోతుందని పలువురు భావిస్తున్నారు.

6 Replies to “లైసెన్సులు రద్దయ్యేదాకా ఎవ్వరినీ నమ్మలేం!”

  1. PPPP అయ్యింది? ఇప్పుడు MMMM “మధ్య0” , metadoor లో “మీ” “మూతికి” . ఇదొక సం-పద సృష్టి

Comments are closed.