టెన్త్ ఫెయిల్ అయ్యాక క‌సిగా చ‌దివానంటున్న మంత్రి

పిల్ల‌ల‌కు మార్కులు త‌క్కువ వ‌స్తే వాళ్ల‌ను తిట్టొద్ద‌ని, సంబంధిత ఉపాధ్యాయుల‌తో మాట్లాడితే స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌ని మంత్రి నారాయ‌ణ స‌ల‌హా ఇచ్చారు.

మున్సిప‌ల్‌శాఖ మంత్రి నారాయ‌ణ కార్పొరేట్ విద్యారంగంలో ఎదురులేని వ్యాపారి. తన విద్యా ప్ర‌స్థానం ఎలా సాగిందో ఆయ‌న చెప్పి, విద్యార్థుల్లో స్ఫూర్తి నింపే ప్ర‌య‌త్నం చేయ‌డం విశేషం. ప‌దో త‌ర‌గ‌తి ఫెయిల్ అయ్యిన‌ట్టు చెప్పి…అంద‌ర్నీ ఆశ్చ‌ర్యానికి గురి చేశారాయ‌న‌. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ఉపాధ్యాయులు, త‌ల్లిదండ్రుల స‌మావేశాన్ని నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇందులో భాగంగా నెల్లూరు న‌గ‌రంలోని బీవీఎస్ న‌గ‌ర‌పాల‌క సంస్థ బాలిక‌ల ఉన్న‌త పాఠ‌శాల‌లో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి మంత్రి నారాయ‌ణ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. నారాయ‌ణ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధికి త‌న వంతు స‌ల‌హాలు ఇస్తున్న‌ట్టు చెప్పారు. త‌ల్లిదండ్రులు, ఉపాధ్యాయులు త‌ర‌చూ స‌మావేశ‌మైతే మంచి ఫ‌లితాలు వ‌స్తాయ‌న్నారు.

తాను వీధిబ‌డిలో చ‌దువుకున్న‌ట్టు నారాయ‌ణ చెప్పారు. టెన్త్ ఫెయిల్ అయ్యిన‌ట్టు ఆయ‌న తెలిపారు. అయితే అప్ప‌టి ముఖ్య‌మంత్రి భ‌వ‌నం వెంక‌ట్రామ్ రెండు గ్రేస్ మార్కులు క‌ల‌ప‌డంతో తాను పాస్ అయ్యిన‌ట్టు ఆయ‌న చెప్పారు. ఆ త‌ర్వాత క‌సిగా చ‌దివాన‌న్నారు. డిగ్రీ, పీజీలో యూనివ‌ర్సిటీ ఫ‌స్ట్ వ‌చ్చాన‌న్నారు.

విద్యా సంస్థ‌ను ప్రారంభించి అగ్ర‌స్థానంలో నిలిపిన‌ట్టు నారాయ‌ణ తెలిపారు. త‌న‌కు విద్యారంగంలో 44 ఏళ్ల అనుభ‌వం వుంద‌న్నారు. పిల్ల‌ల‌కు మార్కులు త‌క్కువ వ‌స్తే వాళ్ల‌ను తిట్టొద్ద‌ని, సంబంధిత ఉపాధ్యాయుల‌తో మాట్లాడితే స‌మ‌స్య ప‌రిష్కారం అవుతుంద‌ని మంత్రి నారాయ‌ణ స‌ల‌హా ఇచ్చారు.

4 Replies to “టెన్త్ ఫెయిల్ అయ్యాక క‌సిగా చ‌దివానంటున్న మంత్రి”

Comments are closed.