టీటీడీ మాజీ ఇన్‌చార్జ్ ఈవో ధ‌ర్మారెడ్డికి నోటీసులు

టీటీడీ మాజీ ఇన్‌చార్జ్ ఈవో ధ‌ర్మారెడ్డిని ఏదో ఒక కేసులో జైలుకు పంపాల‌ని చంద్ర‌బాబు స‌ర్కార్ ప‌ట్టుద‌ల‌తో వుంది. ఇందులో భాగంగా ఆయ‌న హ‌యాంలో టీటీడీలో ఏవైనా అక్ర‌మాలు జ‌రిగాయేమో అని రెండు నెల‌లుగా…

టీటీడీ మాజీ ఇన్‌చార్జ్ ఈవో ధ‌ర్మారెడ్డిని ఏదో ఒక కేసులో జైలుకు పంపాల‌ని చంద్ర‌బాబు స‌ర్కార్ ప‌ట్టుద‌ల‌తో వుంది. ఇందులో భాగంగా ఆయ‌న హ‌యాంలో టీటీడీలో ఏవైనా అక్ర‌మాలు జ‌రిగాయేమో అని రెండు నెల‌లుగా రాష్ట్ర విజిలెన్స్ అధికారుల్ని ప్ర‌భుత్వం రంగంలో దింపింది. అయితే ఇంత వ‌ర‌కూ అక్ర‌మాల‌కు సంబంధించి ఎలాంటి ఆధారాలు ల‌భ్యం కాలేద‌ని తెలిసింది.

ఈ నేప‌థ్యంలో టీటీడీ ఆధ్వ‌ర్యంలో పెద్ద ఎత్తున చేప‌ట్టిన వివిధ ర‌కాల పనుల్ని ఎలా మంజూరు చేశారంటూ ధ‌ర్మారెడ్డితో పాటు కీల‌క‌మైన ఇద్ద‌రు నాయ‌కుల‌కు ఉన్న‌తాధికారులు నోటీసులు పంపిన‌ట్టు తెలిసింది. ఇప్ప‌టికే ఇదే విష‌య‌మై సుమారు 72 మంది ఇంజినీర్ల‌కు రాష్ట్ర‌, టీటీడీ విజిలెన్స్ అధికారులు నోటీసులు ఇవ్వ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. టీటీడీ ఉద్యోగుల్లో అభ‌ద్ర‌త‌తో పాటు మాన‌సిక ఆందోళ‌న‌ల‌కు ఈ నోటీసులు కార‌ణ‌మ‌య్యాయి.

గ‌తంలో ఎప్పుడూ ఇలాంటి ప‌రిణామాలు లేవ‌ని ఉద్యోగులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. టీటీడీ పాల‌క మండ‌లి తీర్మానాల్ని మాత్ర‌మే తాము అమ‌లు చేస్తామ‌ని, సొంత నిర్ణ‌యాలు వుండ‌వ‌ని టీటీడీ ఇంజ‌నీర్లు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ధ‌ర్మారెడ్డికి నోటీసులు ఇవ్వ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. త‌క్కువ కాలంలో ఎక్కువ నిధుల్ని ఎలా మంజూరు చేస్తారంటూ ధ‌ర్మారెడ్డికి పంపిన నోటీసుల్లో ప్ర‌శ్నించిన‌ట్టు స‌మాచారం.

అయితే ప‌నుల మంజూరుకు సంబంధించి టీటీడీలో ప్ర‌త్యేకంగా నిబంధ‌న‌లేవీ లేవ‌ని తెలిసింది. కేవ‌లం క‌క్ష‌పూరితంగానే ధ‌ర్మారెడ్డిని, అలాగే గ‌తంలో పాల‌క మండ‌ళ్ల‌కు నేతృత్వం వ‌హించిన నాయ‌కుల్ని కేసుల్లో ఇరికించ‌డానికి ప్ర‌భుత్వం అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శిస్తోంద‌న్న చ‌ర్చ‌కు తెర‌లేచింది.

3 Replies to “టీటీడీ మాజీ ఇన్‌చార్జ్ ఈవో ధ‌ర్మారెడ్డికి నోటీసులు”

Comments are closed.