ప‌దేళ్లూ, ప‌దిహేనేళ్లు.. పెంచుకుంటూ పోతున్న ప‌వ‌న్!

కూట‌మిలో పెద్ద‌న్న‌గా టీడీపీ, ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా టీడీపీ నాయ‌కుడు కూడా కొన‌సాబోతాడ‌నే అనుకోవాలి!

మొన్నామ‌ధ్య మాట్లాడుతూ రాబోయే ప‌ది సంవ‌త్స‌రాలూ చంద్ర‌బాబు నాయుడే సీఎంగా ఉండాలంటూ వ్యాఖ్యానించారు జ‌న‌సేన అధిప‌తి ప‌వ‌న్ కల్యాణ్. తాజాగా ఆయ‌న అసెంబ్లీలో మాట్లాడుతూ రాబోయే ప‌దిహేను సంవ‌త్స‌రాలూ ఎన్డీయే కూట‌మిలో త‌మ మూడు పార్టీలూ కొన‌సాగుతాయ‌ని, ఏదైనా విబేధాలు వ‌చ్చినా అవి ఒక కుటుంబంలో వ‌చ్చే వైరుధ్యాలే అని, వాటి గురించి త‌మ‌లో తాము కూర్చుని మాట్లాడుకుంటామ‌న్న‌ట్టుగా చెప్పుకొచ్చారు! మ‌రి మొన్న‌టి వ‌ర‌కూ ప‌ది సంవ‌త్స‌రాల పాటు చంద్ర‌బాబు నాయుడే సీఎం అంటూ నిఖార్సైన జ‌నసైనికుల ఉత్సాహంపై ప‌వ‌న్ క‌ల్యాణ్ నీళ్లు చ‌ల్లారు. ఇప్పుడు ప‌దిహేను సంవ‌త్స‌రాలు ఎన్డీయే కూట‌మి అంటూ.. ప‌వ‌న్ ఏం సందేశం ఇచ్చార‌నేది ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం!

వాస్త‌వానికి రాజ‌కీయాల్లో ఈ రోజు అభిప్రాయాలు రేపు ఉంటాయ‌ని అన‌డానికి వీల్లేదు! అలాంటిది ఇలా ప‌వ‌న్ ప‌దేళ్లు, ప‌దిహేనేళ్లు అంటూ మాట్లాడ‌టం చిత్రంగానే ఉంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎప్పుడెప్పుడు సీఎం అవుతారా అని ఇప్ప‌టికే ప‌దేళ్ల‌కు పై నుంచి ఆయ‌న అభిమానులు ఆశిస్తూ ఉన్నారు. అయితే వాస్త‌వానికి తెలుగుదేశంతో పొత్తు కుద‌ర్చుకుని కొన్ని అసెంబ్లీ సీట్ల‌కు మాత్ర‌మే పోటీ చేసిన‌ప్పుడే జ‌న‌సైనికులు నీరుగారి పోయారు. మ‌రీ అన్ని త‌క్కువ సీట్ల‌కు ప‌వ‌న్ ఎందుకు పొత్తుకు ఒప్పుకున్నార‌న్న‌ట్టుగా వారు నిస్పృహ చెందారు! అయితే అనూహ్యంగా కూట‌మి సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డం, అందులో భాగంగా జ‌న‌సేన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ నెగ్గ‌డంలో ప‌వ‌న్ అభిమానులు కొంత‌లో కొంత ఊర‌ట చెందారు. ఒక‌వేళ పోటీ చేసిన స్థానాలు త‌క్కువ నేప‌థ్యంలో.. అన్ని స్థానాల్లో గెల‌వ‌క‌పోయి ఉంటే జ‌న‌సేన ఇంత చెప్పుకోవ‌డానికి కూడా ఏమీ ఉండేది కాదు. వంద‌శాతం స్ట్రైక్ రేట్ అనేది జ‌న‌సేన‌కు గ‌ర్వించ‌ద‌గిన అంశంగా మారింది. అది కూడా పొత్తులో భాగంగా జ‌రిగిందే!

ఇక ఎన్నిక‌ల త‌ర్వాత ప‌వ‌న్ కు చంద్ర‌బాబు నాయుడు ఉప‌ముఖ్య‌మంత్రి ప‌ద‌విని ఇచ్చారు. గ‌తంలో ఏపీకి చాలా మంది ఉప ముఖ్య‌మంత్రులుగా వ్య‌వ‌హ‌రించారు. చంద్ర‌బాబు నాయుడు క్రితం సారి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన‌ప్పుడు ఇద్ద‌రు ఉప‌ముఖ్య‌మంత్రులు, ఆ త‌ర్వాత జ‌గ‌న్ హ‌యాంలో ఏకంగా ఐదు మంది ఉప ముఖ్య‌మంత్రులు ఉండేవారు. ప్ర‌స్తుతానికి అయితే ప‌వ‌న్ ఒక్క‌రే డిప్యూటీ సీఎం. కానీ కొన్నాళ్లుగా లోకేష్ కు ఉప‌ముఖ్య‌మంత్రి అనే టాక్ వ‌స్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ నేత‌లు బాహాటంగా ఈ డిమాండ్ ను తెర‌పైకి తెచ్చారు.

తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున ఎవ‌రేం మాట్లాడినా అందో ఒక వ్యూహం ఉంటుంద‌నేది చ‌రిత్ర చెప్పే సంగ‌తి. అలాంటి వ్యూహాల మేర‌కే లోకేష్ కు డిప్యూటీ సీఎం అనే డిమాండ్ బ‌య‌ల్దేరింద‌ని చాలా మంది న‌మ్ముతారు! మ‌రి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఒక్క‌రే డిప్యూటీ సీఎంగా కొన‌సాగాల‌నేది స‌గ‌టు పీకే అభిమాని కోరిక‌. ఈ ప‌రిణామాల మ‌ధ్య‌లో లోకేష్ గ‌నుక డిప్యూటీ సీఎం హోదాను పొందితే.. అది ప‌వ‌న్ అభిమానుల‌కు చిన్న‌బుచ్చుకునేలా చేయ‌డంలో పెద్ద ఆశ్చ‌ర్యం లేదు. మ‌రి అదే గ్ర‌హించారో ఏమో కానీ.. చివ‌ర‌కు లోకేష్ కు డిప్యూటీ సీఎం అనే డిమాండ్ ను ప్ర‌స్తుతానికి వార్త‌ల్లో లేకుండా చేశారు. ఆ విష‌యంలో ఎవ‌రూ ఏం మాట్లాడ‌కూడ‌ద‌ని టీడీపీ అధిష్టానం నుంచి ఆదేశాలు అనే వార్త‌లు కూడా వ‌చ్చాయి!

ప్ర‌స్తుతానికి అయితే త‌మ కూట‌మి చాలా స‌ఖ్య‌త‌తో ఉంద‌ని ప‌వ‌న్ చెప్ప‌ద‌లుచుకున్న‌ట్టుగా ఉన్నారు. అందుకే ఈ ప‌దేళ్లు, ప‌దిహేనేళ్లు అనే మాటలు వ‌చ్చాయ‌నుకోవాలి. అయితే ప‌దేళ్లు చంద్ర‌బాబు నాయుడే సీఎంగా ఉండాల‌నే ప‌వ‌న్ ఆకాంక్ష ఏ మేర‌కు నెర‌వేరుతుందో వేచి చూడాల్సి ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల‌కు తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ ను ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించుకుని వెళ్లినా పెద్ద ఆశ్చ‌ర్యం లేదు. నారా లోకేష్ గ‌త ప‌ర్యాయంలో ఒక‌సారి మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు, ఇప్పుడూ మంత్రిగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో లోకేష్ ను సీఎం అభ్య‌ర్థిగా తెలుగుదేశం పార్టీ ప‌రిగ‌ణిస్తుంద‌నే ఊహాగానాలు లేక‌పోలేదు వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి! చంద్ర‌బాబు ఇప్ప‌టికే సుదీర్ఘ‌కాలంగా సీఎం హోదాలో కొన‌సాగుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌ను జాతీయ స్థాయి బాధ్య‌త‌ల‌కో పంపి లోకేష్ ను సీఎంగా చూసుకోవాలే ఆకాంక్ష తెలుగుదేశం వీరాభిమాన‌వ‌ర్గంలోనూ ఉండ‌వ‌చ్చు! లోకేష్ కాబోయే ముఖ్య‌మంత్రి అంటూ ఇప్ప‌టికే ద‌శాబ్దం నుంచి తెలుగుదేశం పార్టీ వాళ్లు చెబుతూనే ఉన్నారు. లోకేష్ ఆ త‌ర్వాత దేవాన్ష్ కూడా ఏపీకి కాబోయే ముఖ్య‌మంత్రులే అని తెలుగుదేశం వాళ్లు చెబుతూ ఉంటారు.

మ‌రి తెలుగుదేశం పార్టీ వ‌ర‌కూ చూసుకుంటే.. కూట‌మికి ఆ పార్టీనే పెద్ద‌న్న‌. గ‌త ఎన్నిక‌ల్లో అయినా, భ‌విష్య‌త్తు ఎన్నిక‌ల్లో అయినా ఆ పార్టీనే ఏపీలో మెజారిటీ అసెంబ్లీ సీట్ల‌కు పోటీ చేస్తుంది. అది కూడా జ‌న‌సేన‌, బీజేపీల‌కు ఆ పార్టీ కేటాయించే సీట్లు చాలా త‌క్కువ స్థాయిలోనే ఉంటాయి కూడా గ‌త ఎన్నిక‌లను బ‌ట్టి చూస్తే! అయిన‌ప్ప‌టికీ త‌మ కూట‌మి ప‌దేహేనేళ్లు అని ప‌వ‌న్ అంటున్న వైనాన్ని బ‌ట్టి చూస్తే.. ఇదే రాజ‌కీయం ఇంకో ప‌దేహేనేళ్ల‌ పాటు సాగ‌బోతోంద‌ని ప‌వ‌న్ చెబుతున్న‌ట్టుగా ఉంది. కూట‌మిలో పెద్ద‌న్న‌గా టీడీపీ, ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా టీడీపీ నాయ‌కుడు కూడా కొన‌సాబోతాడ‌నే అనుకోవాలి! మ‌ధ్య మ‌ధ్య‌ల్లో ఎన్నిక‌ల‌ను ఎదుర్కొనాల్సి ఉన్నా, త‌మ మైత్రి అయితే చెక్కుచెద‌ర‌ద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెబుతున్న‌ట్టుగా ఉంది!

7 Replies to “ప‌దేళ్లూ, ప‌దిహేనేళ్లు.. పెంచుకుంటూ పోతున్న ప‌వ‌న్!”

  1. ఇరు పార్టీలు లాభనష్టాలు చూసుకోకుండా ఇంకా 15 సంవత్సరాలు కలిసి ఉంటే (ఉండక్కర్లేదు) 2029 తర్వాత అసలు వైసీపీ వుంటుందా వైసీపీ ముఖ్యనాయకులంతా us uk పారిపోతారు వీళ్ళు నొక్కేసిన డబ్బుతో అక్కడ ఇండస్ట్రీస్ పెడతామంటే వీళ్లకు రెడ్ కార్పెట్ పరుస్తారు ఇక్కడ క్యాడర్ మాత్రం గోక్కుంటా జనసేన లేదా టీడీపీ కి వెళ్లాల్సివుంటుంది కానీ బూతు పోస్ట్ లు పెట్టె paytm బ్యాచ్ ని ఎవరు తీసుకోరు వీళ్లకు ఎంప్లాయిమెంట్ శ్రీ రెడ్డి గారు ఇవ్వాల్సి ఉంటుంది

Comments are closed.