గంటాపై టీడీపీ అధిష్టానం సీరియ‌స్‌

ఇక మీద‌ట ఏదైనా వుంటే, ప్ర‌భుత్వం లేదా పార్టీ పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్లాల‌ని ఆయ‌న‌కు సూచించిన‌ట్టు టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

విశాఖ నుంచి రాజ‌ధాని అమ‌రావ‌తి చేరాలంటే తెలంగాణ రాజ‌ధాని హైద‌రాబాద్‌కు వెళ్లి, అక్క‌డ మ‌రో విమానాన్ని క్యాచ్ చేసి, నానా క‌ష్టాలు ప‌డి వెళ్లాల్సి వ‌స్తోందంటూ మాజీ మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు చేసిన ట్వీట్‌పై టీడీపీ అధిష్టానం సీరియ‌స్ అయ్యిన‌ట్టు తెలిసింది. కూట‌మి ప్ర‌భుత్వ ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చేలా సోష‌ల్ మీడియాలో గంటా పెట్టిన పోస్టు వుంద‌ని టీడీపీ అధిష్టానం ఆగ్ర‌హంగా ఉన్న‌ట్టు తెలిసింది.

ఈ మేర‌కు టీడీపీ సీనియర్ నాయ‌కులు గంటాకు ఫోన్ చేసి, త‌మ అసంతృప్తిని వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిసింది. మంత్రిగా కూడా ప‌ని చేసిన గంటా శ్రీ‌నివాస్‌కు ఏ విష‌యాలు బ‌హిరంగంగా చెప్పాలి? ఏవి చెప్ప‌కూడ‌ద‌నే విచ‌క్ష‌ణ కూడా లేదా అని టీడీపీ నేత‌లు ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. ఉద్దేశ పూర్వ‌కంగానే గంటా శ్రీ‌నివాస‌రావు ఎక్స్‌లో పోస్టు పెట్టిన‌ట్టు అర్థ‌మ‌వుతోంద‌ని వారు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

త‌మ పార్టీకే చెందిన శ్రీ‌కాకుళం ఎంపీ రామ్మోహ‌న్‌నాయుడు విమాన‌యాన‌శాఖ మంత్రి అని తెలిసి కూడా, ఆయ‌న దృష్టికి స‌మ‌స్య తీసుకెళ్ల‌కుండా, ఇలా సోష‌ల్ మీడియాలో అభిప్రాయాల్ని బ‌హిరంగ‌ప‌ర‌చ‌డం సీనియ‌ర్ నేత‌కు త‌గ‌ద‌నే అభిప్రాయాన్ని టీడీపీ అధిష్టానం వ్య‌క్తం చేసిన‌ట్టు స‌మాచారం.

విశాఖ – విజయవాడ మధ్య ఉదయం వేళల్లో నడిచే రెండు విమానాలు రద్దు చేయడంతో హైద‌రాబాద్‌ను చుట్టేసుకుని, వెళ్లాల్సి వ‌స్తోంద‌ని గంటా శ్రీ‌నివాస‌రావు పోస్టు పెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దురదృష్టవశాత్తు ఈరోజు మంగళవారం కావడంతో వందేభారత్ రైలు కూడా లేకపోవడంతో రెండు విమానాలు మారి విజయవాడ చేరాల్సి వచ్చిందని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డం ప్ర‌త్య‌ర్థుల‌కు అస్త్రం ఇచ్చిన‌ట్టుగా వుంద‌ని టీడీపీ నేత‌ల భావ‌న‌. ఇక మీద‌ట ఏదైనా వుంటే, ప్ర‌భుత్వం లేదా పార్టీ పెద్ద‌ల దృష్టికి తీసుకెళ్లాల‌ని ఆయ‌న‌కు సూచించిన‌ట్టు టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

5 Replies to “గంటాపై టీడీపీ అధిష్టానం సీరియ‌స్‌”

  1. టికెట్ ప్రింట్ ఔట్ కూడా సోషల్ మీడియాలో లో పెట్టాడంటేనే ఆయన ఇంటెన్షన్ అర్థమవుతోంది.

  2. ఇది పార్టీ అంతర్గత వ్యవహారం ఇందులో తమ జోక్యం

    అనవసరం అనుకుంటాను గ్యాస్ ఆంధ్ర .

Comments are closed.