కాలమే గురువు!

ఇతరుల గురించి తప్పుగా మాట్లాడే వారి దగ్గర కూర్చోకు. నువ్వు లేచి వచ్చాక, వాళ్ళు మాట్లాడేది నీ గురించే సుమా!

ఎంత‌టి వారికైనా కాల‌మే గురువు. ఈ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం లేద‌ని చింతిస్తున్న త‌రుణంలో, దాన్ని కాలానికి వదిలేస్తే, అదే ఒక మార్గం చూపుతుంది. అందుకే మ‌నసుకి అయిన గాయాల్ని కాలం మాన్పుతుంద‌ని పెద్ద‌లు అంటుంటారు. కాలం ప్ర‌తి మ‌నిషికీ ఒక మార్గ‌నిర్దేశి. కాల ప్ర‌వాహంలో ఓడ‌లు బండ్లు; బండ్లు ఓడ‌లు అవుతుంటాయి. అయితే మ‌నిషికి కావాల్సింద‌ల్లా అనంత‌మైన ఓర్పు, స‌హ‌నం.

ఈ రెండు ఉన్న వాళ్ల‌కు కాలం మంచి భ‌విష్య‌త్ చూపుతుంది. వెన‌క్కి తిరిగి చూసుకుంటే కాలం మిగిల్చిన చేదు, తీపి జ్ఞాప‌కాలు ఎన్నెన్నో. అయ్య‌య్యో…. నేను అప్పుడు అలా ప్ర‌వ‌ర్తించానా? అని సిగ్గుప‌డేలా కొన్ని సార్లు కాలం చేస్తూ వుంటుంది. కాలం మ‌నిషిలో ఎన్నెన్నో మార్పులు తీసుకొస్తూ వుంటుంది. స‌మాజంపై, స‌హ‌చ‌రుల‌పై, రాజ‌కీయ నాయ‌కుల‌పై అభిప్రాయాల్ని మారుస్తూ వుంటుంది.

నిన్నటి కంటే ఈ రోజు, నేటి కంటే రేపు మ‌న ఆలోచ‌న‌ల్లో మెరుగు క‌నిపిస్తే… మ‌న‌కు కాలం క‌లిసొస్తున్న‌ట్టుగా భావించాలి. రోజువారీ జీవితంలో రాత్రి నిద్ర‌పోయే ముందు ఒక్క‌సారి, ఆ రోజు మ‌నం గ‌డిపిన క్ష‌ణాల్ని మ‌నమే నిజాయ‌తీగా ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాలి. ఎక్కువ మార్చుకోవాల్సిన‌వి ఉన్నాయ‌నిపిస్తే, మ‌న‌లో మంచికి బీజం ప‌డిన‌ట్టే. మ‌న‌తో ఈ స‌మాజం ఎలా వుండాల‌ని అనుకుంటామో, మ‌నం కూడా అదే ర‌కంగా వ్య‌వ‌హ‌రించాల్సి వుంటుంది.

సాధ్య‌మైనంత వ‌ర‌కూ ఇత‌రుల గురించి నెగెటివ్‌గా మాట్లాడ‌క‌పోవ‌డం ఉత్త‌మం. ఇత‌రుల గురించి నిత్యం నెగెటివ్ మాట్లాడే ఏ మ‌నిషైనా అథ‌ముడ‌ని గ్ర‌హించాలి.

“ఇతరుల గురించి తప్పుగా మాట్లాడే వారి దగ్గర కూర్చోకు. నువ్వు లేచి వచ్చాక, వాళ్ళు మాట్లాడేది నీ గురించే సుమా!” అనే కొటేష‌న్‌ను కొత్త ఏడాది సంద‌ర్భంగా గుర్తించుకుంటే చాలు… మ‌నం సుఖ‌సంతోషాల‌తో జీవిస్తాం.

నూతన ఆంగ్ల నామ సంవ‌త్స‌రం 2025, జ‌న‌వ‌రి 1న ప్ర‌తి ఒక్క‌రికి “గ్రేట్ ఆంధ్ర” త‌ర‌పున శుభాకాంక్ష‌లు. ఈ ఏడాది ప్ర‌తి ఒక్క‌రి జీవితాల్లో ఆనందాన్ని నింపాల‌ని ఆకాంక్షిస్తూ…కొత్త ఆలోచ‌న‌ల‌కు ఆచ‌ర‌ణ‌కు ఈ క్ష‌ణం నుంచే బీజం ప‌డాలని కోరుకుందాం.

3 Replies to “కాలమే గురువు!”

  1. అందుకే అన్న ఐదేళ్లు కళ్ళు మూసుకుంటే ఇంతలోకి అధికారం మన కాళ్ళ దగ్గర కి అని ఎప్పుడో తత్వం చెప్పేసారు

Comments are closed.