కొత్త సంవ‌త్స‌రంలో ఇలాంటి వాళ్ల‌ను వ‌దిలించుకోండి!

త‌మ ప్ర‌శాంత జీవ‌నం కోసం ఇలాంటి వారిని దూరంగా ఉంచాల‌ని రిలేష‌న్ షిప్ ఎక్స్ ప‌ర్ట్స్ వీరికి సూచిస్తూ ఉన్నారు.

మ‌నం ప్ర‌శాంతంగా ఉండాలంటే.. మ‌న చుట్టూ ఉన్న వాళ్లు కూడా మ‌న‌ల్ని అలా ఉండ‌నివ్వాలి! అది స్నేహితులు అయినా, బంధువులు అయినా, మ‌రింత ద‌గ్గ‌రి వాళ్లు అయినా, స‌హోద్యోగులు అయినా.. మ‌రెవ‌రైనా! వారు ప్ర‌వ‌ర్తించే తీరు కూడా మ‌న మాన‌సిక ప్ర‌శాంత ఆధార‌ప‌డి ఉంటుంది. కొంద‌రుంటారు.. ప‌క్క వాళ్ల అభిప్రాయాల‌ను అస్స‌లు ప‌ట్టించుకోరు. వీరు ప‌క్క వాళ్ల‌తో స‌న్నిహితంగా ఉంటారంటే, ఉంటారంతే! త‌మ‌కు న‌చ్చిందే చేస్తారు, త‌మ‌కు తోచిన‌ట్టుగా ఉంటారు, వీరికి ప‌క్క‌వాళ్ల‌తో ఇబ్బంది కూడా ఉండ‌దు! అయితే ప‌క్క వాళ్ల మాట‌ల‌ను, అభిప్రాయాల‌ను, వారితో సాన్నిహిత్యాన్ని మ‌న‌స్ఫూర్తిగా తీసుకునే వాళ్ల‌కే ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. పక్క‌వాళ్లు పొగిడితే వీరేమీ పొంగిపోరు కానీ, వారి అభిప్రాయాల‌ను అయితే వీరు ప‌ట్టించుకుంటారు. ఇలాంటి వారు మాత్రం కొంద‌రికి దూరంగా ఉండ‌టం మంచిది. త‌మ ప్ర‌శాంత జీవ‌నం కోసం ఇలాంటి వారిని దూరంగా ఉంచాల‌ని రిలేష‌న్ షిప్ ఎక్స్ ప‌ర్ట్స్ వీరికి సూచిస్తూ ఉన్నారు.

ఏడిపించే వాళ్ల‌ను!

స్నేహితుల్లోనే కొంద‌రుంటారు.. మ‌నల్ని ఏదో ర‌కంగా ఏడిపించ‌డ‌మే వారికి ప‌ని. కొంద‌రు వ‌ర్బ‌ల్ గా, మ‌రి కొంద‌రు మెంట‌ల్ గా, ఇంకొంద‌రు ఫిజిక‌ల్ గా కూడా.. మ‌న‌ల్ని ఏడిపించడ‌మే వారికి న‌వ్వొచ్చే ప‌నిగా ఉంటుంది. మీ ప‌ర్స‌నాలిటీ గురించి కామెంట్లు చేయ‌డం, మీరు న‌డ‌వ‌డిక‌ల్లో త‌ప్పుల‌ను ఎంచ‌డం, మీకు ఏమీ తెలియ‌ద‌న్న‌ట్టుగా ప్ర‌వ‌ర్తించ‌డం, అడ్డ‌గోలు కామెంట్లు చేయ‌డం, అడ్డ‌దిడ్డంగా మాట్లాడ‌టం, ఏదైనా ఎదురుచెబితే.. దాన్నీ కామెడీ చేయ‌డం! స్నేహితుల ముసుగులోనే కొంద‌రు ఉంటారు. త‌మ వ‌ర‌కూ వీరు అన్నీ క‌రెక్ట్ అన్న‌ట్టుగా, ప‌క్క‌వారిని ఏదోలా ఏడిపిస్తూ అదో ఆనందాన్ని పొందుతూ ఉంటారు. మ‌ళ్లీ మీకు స‌న్నిహితులుగా ముసుగు వేసుకునే ఉంటారు, స్నేహితులం అంటారు. అయితే వీరి క‌ర్క‌శ‌త్వానికి మాత్రం హ‌ద్దుండ‌దు! వీళ్ల‌ను అస్స‌లు స్పోర్టివ్ గా తీసుకోవాల్సిన అవ‌స‌రం లేదు, ఎంత త్వ‌ర‌గా వీరిని ప‌క్క‌న పెడితే అంత మంచిది!

నిత్యం విమ‌ర్శించే వాళ్ల‌ను!

మీరేదైనా ప్ర‌య‌త్నం చేసిన‌ప్పుడు వీళ్లు ప్రోత్స‌హించే ముసుగులోనే మిమ్మ‌ల్ని తీవ్రంగా విమ‌ర్శిస్తూ ఉంటారు! మీరు చేస్తున్న ప్ర‌య‌త్నాన్ని ఇంకెవ‌రితోనో పోలుస్తూ మిమ్మ‌ల్ని నిస్పృహ‌కు గురి చేస్తూ ఉంటారు. అలాగ‌ని మీరు చేసే ప‌నిలో వీరు ఎక్స్ ప‌ర్ట్సా అంటే అదేం లేదు, మిమ్మ‌ల్ని విమ‌ర్శిస్తూ ఉంటారంతే! దాని వ‌ల్ల మీరు ఎంతో కొంత సాధించే ప‌నిలో ఉన్నా.. వీరి మాట‌లు మిమ్మ‌ల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి, స‌న్నిహితులు కావ‌డంతో వీరి మాట‌ల‌తో బాగా ప్ర‌భావితం అయ్యి మీరు చేస్తున్న ప్ర‌య‌త్నాన్ని కూడా ఆపేలా చేయ‌డం వీళ్ల శ‌క్తి! మీకు ప‌నిలో సాయం చేయ‌రు కానీ, విమ‌ర్శ‌ల‌తో మీ ప్ర‌య‌త్నాన్ని కూడా చేయ‌కుండా చేయ‌డంలో వీరు పాత్ర పోషిస్తారు. త‌ర‌చి చూస్తే ప్ర‌తి ఒక్క‌రి జీవితంలోనూ ఇలాంటి వారు త‌రాస‌ప‌డి ఉంటారు. ఇప్ప‌టికీ కొంద‌రికి ప‌క్క‌నే ఉంటారు కూడా!

మీ మీద‌కు నెట్టేసే వాళ్లు!

ప్ర‌త్యేకించి లైఫ్ పార్ట్ న‌ర్, స‌హోద్యోగుల్లో ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌న‌ప‌డ‌తాయి. వారి వైపు ఎలాంటి ప‌రిస్థితుల్లో కూడా ఎలాంటి త‌ప్పు ఉండ‌దు, ఎప్పుడూ అవ‌త‌లి వాళ్ల‌లోనూ, ప‌క్క వాళ్ల‌లోనే త‌ప్పులుంటాయి. ఇలాంటి బ్లేమ్ గేమ్ ఆడ‌టంలో వీరికి మాస్ట‌ర్ డిగ్రీ ఉంటుంది. పార్ట్ న‌ర్ అయితే.. ఈ విష‌యాన్ని వారికి అర్థ‌మ‌య్యేలా చేసి చెప్ప‌డం మంచిది. స‌హోద్యోగులు అయితే.. డైరెక్టుగా వారి తీరును ఎండ‌గ‌ట్టినా త‌ప్పులేదు!

గాసిప‌ర్స్!

మీతో మ‌రొక‌రి గురించి గాసిప్ ల‌ను చెప్పే వాళ్లు, మిమ్మ‌ల్ని మ‌రొక‌రి ద‌గ్గ‌ర గాసిప్ గా మారుస్తార‌న‌డంలో ఏ మాత్రం ఆశ్చ‌ర్యం లేదు! మీ ద‌గ్గ‌ర ఉన్నంత‌సేపూ మీరే బెస్ట్ ఫ్రెండ్స్, మీరు అక్క‌డ లేరంటే మీ గురించినే వారు చ‌ర్చ పెడ‌తారు! అందుకు రుజువు ఏమిటంటే.. మీ ద‌గ్గ‌ర వేరే వారి గురించి ప్ర‌స్తావిస్తూ ఉండ‌ట‌మే! వారికి అదో వ్యాప‌కం, అదో స‌ర‌దా, అదే ప‌ని అంతే!

ఫేక్ ఫ్రెండ్స్!

రోజులో ఎక్కువ సేపు ఆఫీసులో గ‌డిపే రోజులు ఇవి. దీంతో ఆఫీసులో త‌గిలే వాళ్ల‌నే ఫ్రెండ్స్ గా భావిస్తూ ఉంటాం. కానీ, కొలీగ్స్ ఎప్ప‌టికీ, ఎన్న‌టికీ ఫ్రెండ్స్ కాదు. వారిని స్నేహితులుగా భావించి అన్నీ షేర్ చేసుకోవ‌డ‌మో, ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ను పంచుకుంటే.. ముప్పును కొని తెచ్చుకోవ‌డ‌మే! ఆ త‌ర్వాత మీరు నిల‌దీసేందుకు కూడా ఏమీ ఉండ‌దు. వారికి మీరో లెక్క కూడా కాదు. ఎంత స‌న్నిహితంగా ఉన్నా ఆఫీసు, ప‌ర్స‌న‌ల్స్ కు సంబంధించి స్ప‌ష్ట‌మైన విభ‌జ‌న రేఖ‌ను గీసుకుని ఉండ‌టం తెలివైన వారి ప‌ని!

3 Replies to “కొత్త సంవ‌త్స‌రంలో ఇలాంటి వాళ్ల‌ను వ‌దిలించుకోండి!”

Comments are closed.