మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత భూమా అఖిలప్రియ భర్త మద్దూరి భార్గవ్‌రామ్ నాయుడిని నెటిజన్లు ఆడుకుంటున్నారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన భార్గవ్‌రామ్‌ను అఖిలప్రియ ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట అన్యోన్య దాంపత్యానికి తీపి గురుతుగా ఇటీవల మగబిడ్డ జన్మించాడు.
ఇదిలా వుండగా ఫేస్‌బుక్‌లో అఖిలప్రియ భర్త పెట్టిన పోస్టింగ్‌పై ది యాక్సిడెంటల్ సీఎం పేరుతో ఉన్న ఖాతాదారుడు ఎంత దారుణమైన కామెంట్ చేశాడో ముందు తెలుసుకుందాం. ఆ తర్వాత అంత తీవ్రంగా కామెంట్ చేయడానికి దారి తీసిన పరిస్థితుల గురించి మాట్లాడుకుందాం.
“ఇదెక్కడి సిగ్గులేని పనిరా బాబు…నీకు పుట్టిన బిడ్డకి నీ ఇంటి పేరు, నీ కులం పేరు కాకుండా ఎవరిదో పెట్టడం ఏంటో నాకేం అర్థం కాలా. ఒక పని చెయ్ అన్నా…నీ పేరు కూడా మద్దూరు భార్గవ్‌రామ్ నాయుడు అని తీసి భూమ భార్గవ్‌రామ్‌రెడ్డి అని పెట్టుకో బాగుంటుంది. భూమా నాగిరెడ్డి గారి పిల్లను లాగావు. డబ్బును లాగావు. ఇప్పుడు ఇంటి పేరుని, కులాన్ని కూడా లాగేశావు. నువ్వు మామూలోడివి కాదు అన్న” అంటూ కామెంట్ చేయడం గమనార్హం. ఇంతకూ అసలు విషయం ఏంటంటే…
భార్గవ్‌రామ్ తన సామాజిక వర్గం, అలాగే తన ఇంటి పేరు లేకుండా అఖిలప్రియ వైపు వారసత్వాన్ని కుమారుడికి కొనసాగించడంపై కొందరు సోషల్ మీడియాలో తప్పు పడుతున్నారు. ఇవాళ తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని ప్రసిద్ధ చెంగాలమ్మ పరమేశ్వరి ఆలయంలో అఖిలప్రియ కుమారుడికి నామకరణం చేశారు. ఆ పేరు కొంతమంది నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.
ఆ బుడ్డోడికి భూమా వీర వెంకట నాగిరెడ్డి అని నామకరణం చేశారు. హిందూ సంప్రదాయం ప్రకారం తండ్రి ఇంటి పేరే బిడ్డలకు వర్తిస్తుంది. ఇందుకు విరుద్ధంగా మాజీ మంత్రి కుమారుడికి అఖిలప్రియ ఇంటి పేరు భూమా, అలాగే తండ్రి పేరు, ఆమె సామాజిక వర్గాన్నే కొనసాగిస్తూ నిర్ణయించడం చర్చకు తెరలేచింది.
తండ్రి వారసత్వాన్నే పిల్లలకు రావాలనేదే పురుషాధిక్య సమాజ భావనగా అఖిలప్రియ అభిప్రాయపడుతున్నారు. తన వైపు వారసత్వాన్ని కొనసాగిస్తే తప్పేంటని ఆమె ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ వాదనల్లో ఏదీ నిజం కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. డబ్బు, పలుకుబడి, పాపులారిటీ భూమా ఇంటిపేరుతో ముడిపడి వుండడం వల్ల బలిజ సామాజిక వర్గానికి చెందిన భార్గవ్‌రామ్ కూడా ఒప్పుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదే భార్గవ్‌రామ్ వైపు అఖిలప్రియ కంటే అన్ని మించుగా ఉంటే, భూమా, అలాగే పేరు చివర రెడ్డి అని అఖిలప్రియ తగిలించేదా? అని ప్రశ్నిస్తున్నారు. పవర్ అనేది పేరులో కాదు, డబ్బు, ఆస్తి, రాజకీయ పలుకుబడిలో ఉందని అఖిలప్రియ తన కుమారుడికి పేరు పెట్టడం ద్వారా చాటి చెప్పిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.