టీటీడీ ఉద్యోగుల్ని భ‌య‌పెడుతున్న విజిలెన్స్‌

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు చెప్పిన‌ట్టు టీటీడీ నుంచే ప్ర‌క్షాళ‌న సంగ‌తేమో గానీ, ఉద్యోగుల్లో భ‌యాందోళ‌న మాత్రం సృష్టించ‌గ‌లిగారు. టీటీడీ ఇన్‌చార్జ్ ఈవో ధ‌ర్మారెడ్డిని ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపాల‌నే అత్యుత్సాహంలో ప్ర‌భుత్వం చేయ‌కూడ‌ని…

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు చెప్పిన‌ట్టు టీటీడీ నుంచే ప్ర‌క్షాళ‌న సంగ‌తేమో గానీ, ఉద్యోగుల్లో భ‌యాందోళ‌న మాత్రం సృష్టించ‌గ‌లిగారు. టీటీడీ ఇన్‌చార్జ్ ఈవో ధ‌ర్మారెడ్డిని ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపాల‌నే అత్యుత్సాహంలో ప్ర‌భుత్వం చేయ‌కూడ‌ని త‌ప్పుల‌న్నీ చేస్తోంది. ధ‌ర్మారెడ్డి ల‌క్ష్యంగా రాష్ట్ర విజిలెన్స్ అధికారుల‌తో ప్ర‌భుత్వం రోజుల త‌ర‌బ‌డి టీటీడీలో సోదాలు చేయించింది. చివ‌రికి కొండ‌ను త‌వ్వి ఎలుక‌ను కూడా ప‌ట్టుకోలేక‌పోయారు.

అయితే ధ‌ర్మారెడ్డిని ఏమీ చేసుకోలేక‌, టీటీడీలో ఇంజినీరింగ్ ఉద్యోగుల‌పై ప‌డ్డారు. టీటీడీ నేతృత్వంలో చేప‌ట్టిన వివిధ ర‌కాల ప‌నుల‌కు సంబంధించి వివ‌ర‌ణ ఇవ్వాలంటూ 50 మందికి పైగా విజిలెన్స్ ఎస్పీ నోటీసులు ఇవ్వ‌డం తీవ్ర దుమారం రేపుతోంది. గ‌తంలో ఎప్పుడూ ఈ ర‌కంగా జ‌ర‌గ‌లేద‌ని ఉద్యోగులు విమ‌ర్శిస్తున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌స్తే త‌మ‌కెంతో ప్ర‌యోజ‌నం వుంటుంద‌ని భావించి ఎన్నిక‌ల్లో గంప గుత్త‌గా ఓట్లు వేశామ‌ని, అయితే ప్ర‌స్తుత పాల‌కులపై న‌మ్మ‌కం, అభిమానం పోవ‌డానికి ఎంతో కాలం ప‌ట్ట‌లేద‌ని టీటీడీ ఉద్యోగులు మండిప‌డుతున్నారు.

టీటీడీ పాల‌క మండ‌లి తీర్మానం చేసిన ప‌నుల‌కు సంబంధించి ఆచ‌రించ‌డం మాత్ర‌మే త‌మ విధుల ధ‌ర్మ‌మ‌ని, అడ్డు చెప్ప‌డం కాద‌ని ఇంజినీర్లు అంటున్నారు. విజిలెన్స్ అధికారుల విచార‌ణ‌లో ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేసిన‌ట్టు గుర్తు చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ నోటీసులు ఇచ్చి త‌మ‌ను వేధించ‌డం ఏంట‌ని వారు నిల‌దీస్తున్నారు.

టీటీడీ బోర్డు తీర్మానించిన ప‌నులపై ఎందుకు అభ్యంత‌రం చెప్ప‌లేదు? ఏ విధంగా పాల‌నాప‌రంగా నిర్ణ‌యాలు తీసుకుంటార‌ని త‌మ‌ను ప్ర‌శ్నిస్తూ నోటీసులు జారీ చేయ‌డం విడ్డూరంగా వుంద‌ని ఇంజినీర్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్పుడు కూట‌మి ప్ర‌భుత్వంలో కూడా బోర్డు తీర్మానం ప్ర‌కార‌మే ప‌నులు చేయాల్సి వుంటుంద‌ని, ఇలా భ‌య‌పెడితే, తామెలా చేయాల‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. ఇప్పుడు ప‌నులు చేస్తే, ప్ర‌భుత్వం మారి, విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తే ఎవ‌రు బాధ్య‌త వ‌హించాల‌ని ఇంజినీర్లు ప్ర‌శ్నిస్తున్నారు.

గ‌తంలో ఈవోగా వినాయ‌క్ ఉన్న‌ప్పుడు కూడా ఇప్ప‌ట్లాగే ఉద్యోగుల‌కు అన‌వ‌స‌రంగా షోకాజ్ నోటీసులు ఇచ్చి వేధించార‌ని, ఆ త‌ర్వాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ ఘోర ప‌రాజ‌యం పాలైన సంద‌ర్భాన్ని ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు. ఈ ద‌ఫా టీటీడీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి రెగ్యుల‌ర్ ఉద్యోగుల‌కు ఇంటి స్థ‌లాలు, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగుల‌కు భారీ మొత్తంలో జీతాల పెంపు, ఇత‌ర ప్ర‌యోజ‌నాలు క‌లిగించిన‌ప్ప‌టికీ, ఇన్‌చార్జ్ ఈవో ధ‌ర్మారెడ్డిపై కోపంతో వైసీపీని ఓడించార‌ని ఉద్యోగులు చెబుతున్నారు.

వైసీపీ హ‌యాంలో టీటీడీలో ఏదో జ‌రిగిపోతోంద‌ని నిత్యం సోష‌ల్ మీడియాలో బీజేపీ నాయ‌కుడు న‌వీన్‌కుమార్‌రెడ్డి ఆవేద‌న వ్య‌క్తం చేసేవారు. ఇప్పుడు టీటీడీలో ఐఏఎస్‌ను కాకుండా ఐఆర్ఎస్‌ను స్పెష‌ల్ ఆఫీస‌ర్‌గా నియ‌మించినా, అలాగే విజిలెన్స్ అధికారుల‌తో సోదాలు చేయిస్తూ మాన‌సికంగా వేధిస్తున్నా న‌వీన్ నోరు మెద‌ప‌క‌పోవ‌డంపై ఉద్యోగులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఐడీఎస్ ఆఫీస‌ర్ అయిన ధ‌ర్మారెడ్డిని అద‌న‌పు ప్ర‌త్యేక అధికారిగా ఎలా నియ‌మిస్తార‌ని న‌వీన్ ప్ర‌శ్నించ‌డాన్ని గుర్తు చేస్తున్నారు. కేవ‌లం ధ‌ర్మారెడ్డి త‌న సిఫార్సు లేఖ‌లకు ద‌ర్శ‌నం ఇవ్వ‌లేద‌నే ఏకైక కార‌ణంతో న‌వీన్‌, ఇత‌ర బీజేపీ నాయ‌కులు ర‌చ్చ చేశార‌ని, వీరికి కొండ‌పై దేవుడు, ఉద్యోగుల ప్ర‌యోజ‌నాలు ప‌ట్ట‌వ‌ని వారు మండిప‌డుతున్నారు.

ఇదిలా వుండ‌గా పెద్ద సంఖ్య‌లో ఇంజినీర్ల‌కు నోటీసులు ఇవ్వ‌డం, అలాగే ఇత‌ర శాఖ‌ల‌కు సంబంధించి ఒక‌రిద్ద‌రిపై చిన్న విష‌యానికే సస్పెన్ష‌న్ వేటు వేయ‌డంతో కూట‌మి ప్ర‌భుత్వంపై టీటీడీ ఉద్యోగులు మండిప‌డుతున్నారు. ఏదో అనుకుంటే, మ‌రేదో అవుతోంద‌ని రుస‌రుస‌లాడుతున్నారు.

5 Replies to “టీటీడీ ఉద్యోగుల్ని భ‌య‌పెడుతున్న విజిలెన్స్‌”

  1. తప్పు చేస్తే భయపడొద్దా?? సాక్షాత్తు స్వామివారి సమక్షంలో తప్పు చేస్తే శిక్షపడొద్దా??

Comments are closed.