ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై ముప్పేట దాడి మొదలైంది. ఒకవైపు తెలుగుదేశం పార్టీ, మరోవైపు భారతీయ జనతా పార్టీ, ఇంకా.. జనసేన, ఇంకోవైపు ఉన్నారో లేరో తెలియని కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ వాళ్లు. వీళ్లకు తోడు.. జగన్ అంటే వ్యతిరేకత ఉన్న ప్రతి ఒక్కరూ తలా ఒకవైపు నుంచి తమకు అందిన అస్త్రాలతో జగన్ ను టార్గెట్ గా చేసుకున్న వైనం స్పష్టం అవుతోంది. ఇక జగన్ పై విరుచుకుపడటానికి మీడియా ఉండనే ఉంది.
ఏడాదిన్నర పాలన తర్వాత జగన్ ను తాము సమర్థత విషయంలోనో, పాలనా దక్షత విషయంలోనో, పథకాల అమలు విషయంలోనో టార్గెట్ చేసుకోలేమని జగన్ వ్యతిరేకులకు స్పష్టత వచ్చింది.
ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేర్చి ప్రతిపక్షాలకు ఎలాంటి అవకాశం లేకుండా చేస్తున్నాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రజల్లో అసంతృప్తి రానంత వరకూ ప్రతిపక్షాలు ఎంత గొంతు చించుకున్నా ఉపయోగం ఉండదు.
అందుకే తెలుగుదేశం పార్టీ ఇన్నాళ్లు ఏం మాట్లాడినా, అనుకూల మీడియాలో ఏం రాయించుకున్నా ఉపయోగం అయితే కనిపించలేదు. అలాగే బీజేపీ, జనసేనలది కూడా ఉత్తుత్తి హడావుడే అయ్యింది.
ఇక జగన్ ప్రభుత్వంలో అస్థిరత సృష్టించడానికీ అక్కడ స్పష్టమైన మెజారిటీ ఉంది. ఏ వంద సీట్లతోనో జగన్ సీఎం అయ్యి ఉంటే.. చంద్రబాబు నాయుడు కచ్చితంగా తన మార్కు వ్యూహాలకు పదును పెట్టేవారు.
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేసినట్టుగా.. ధనబలంతో జగన్ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు చంద్రబాబు నాయుడు కచ్చితంగా ప్రయత్నించేవారు. అయితే ఇప్పుడు గెలిచిన 23 మందిలో ఎంతమంది తన వెంట ఉన్నారో లెక్కబెట్టుకునే సాహసం చేసే పరిస్థితుల్లో లేరు చంద్రబాబు నాయుడు.
ఇక బీజేపీకీ ఆరాటం చాలా ఉంది. పవన్ కల్యాణ్ సంగతి చెప్పనక్కర్లేదు. ఆయనకు ఆశలావు, పీక సన్నం! ఇక కమ్మనిజాన్ని నమ్ముకున్న కమ్యూనిస్టుల కథ చెప్పనక్కర్లేదు. కాంగ్రెస్ లో మిగిలిన తాలు నేతలకు జగనంటే అక్కసు. మీడియా మోతుబరులకు జగన్ అంటే ఎక్కడి వరకూ ఉందో ఉందో చెప్పనక్కర్లేదు.
జగన్ పై మతయుద్ధాన్ని మొదలుపెట్టాయి ఈ వర్గాలన్నీ. జగన్ -క్రిస్టియానిటీ అనే అంశాన్నే తమ మనుగడకు ఆధారమని నమ్ముకున్నాయి. ఎక్కడో మారుమూల దేవాలయాల్లో విగ్రహాలు ధ్వంసం.. ఇలాంటి ఆలయాలు ఏపీలో లక్షల కొద్దీ ఉంటాయి! ఒక్కో ఊరి చుట్టూ.. కనీసం ఇరవై ముప్పై ఆలయాలు ఉండనే ఉంటాయి. ప్రతి గుడికీ దాని పవిత్రత ఉండనే ఉంటుంది. అలాగే ఆయా ఆలయాలు ఊర్లకు దూరం, కొండల మీద ఉండేవీ ఉంటాయి.
రాయలసీమ ప్రాంతంలో ఇలాంటి ఆలయాల్లో ఇది వరకూ గుప్తనిధుల కోసం వేటాడే వారు తవ్వేవారు. రాత్రుల పూట తవ్వడం, వెళ్లడం..జనాలు కూడా ఇవన్నీ మామూలే అన్నట్టుగా చూసే వాళ్లు. ఊర ఇలవేల్పుల దేవాలయాల్లో కూడా ఇలాంటివి జరిగేవి. అలాంటప్పుడు మళ్లీ విగ్రహప్రతిష్టాపనలు జరిగేవి.
గత పదేళ్లలోనే తీసుకుంటే.. రాయలసీమ జిల్లాల్లోనే ఇలా అనేక ఆలయాల్లో విధ్వంసం జరిగి ఉంటుంది. అలాంటి వాటిపై ఎన్ని కేసులు పెట్టారు? ఎంతమంది దోషులను పట్టుకున్నారు? అనే వాటిని అడిగిన వారు లేరు! ఇప్పుడు ఆలయాల్లో చీమ చిటుక్కుమన్నా చంద్రబాబు దిగబడేలా ఉన్నారు.
రామతీర్థం ఆలయాన్నే గమనిస్తే.. అది ఎవరి ఆదరణకూ నోచుకోని వైనం ఇప్పుడు టీవీల్లో చూస్తుంటే సామాన్య జనాలకు అర్థం అవుతూ ఉంది. అక్కడ విగ్రహాలను పగలగొట్టారు కాబట్టి ఇప్పుడు అందరూ ఆ ఆలయ పవిత్రత గురించి మాట్లాడేవారే. అయితే.. ఇన్నాళ్లూ ఆ ఆలయాన్ని పట్టించుకున్నది ఎంతమంది? ఇప్పుడు రాజకీయానికి పనికి వస్తోంది కాబట్టి.. తెలుగుదేశం, బీజేపీ, జనసేనలు ఎన్ని ఫీట్లు అయినా చేస్తాయి.
ఈ క్రూసేడ్ ఇప్పుడే మొదలైంది. రాష్ట్రంలో ఉన్న లక్షల ఆలయాల్లో ఇంకా ఎలాంటి వినాశనాలు చోటు చేసుకుంటాయనేది శేష ప్రశ్న. జగన్ ను మరో రకంగా ఎదుర్కోలేమనే క్లారిటీతో ఈ క్రూసేడ్ కు తెరతీసిన వైనం స్పష్టం అవుతోంది.
ఇది జగన్ సమర్థతకు అసలు పరీక్ష!
ఇప్పటి వరకూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నో ఆటంకాలను దాటి వచ్చినవాడే. అధికారం ఏమీ జగన్ కు వెన్నుపోటుతో దక్కలేదు, తండ్రి పోగానే ఆయనను సీఎం సీటు మీదా ఎవరూ కూర్చోబెట్టలేదు. ఎన్నో ఆటుపోట్లను, ఆటంకాలను దాటితే కానీ జగన్ కు అధికారం దక్కలేదు.
ఈ మొత్తం పోరాటంలో జగన్ తన సమర్థతను నిరూపించుకుంటూ వచ్చాడు. అడుగడుగునా తనను తాను నిరూపించుకుంటూ వచ్చే సీఎం పీఠమెక్కాడు. ఇలాంటి నేపథ్యంలో పాత ప్రత్యర్థులే జగన్ పై కొత్తగా విరుచుకుపడుతున్నారు. మరి ఈ పరిణామాలను జగన్ ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తిదాయకమైన అంశం.
ఇప్పటికే ఒకటీ రెండు సమావేశాల్లో జగన్ ఈ అంశాల గురించి స్పందించారు. అయితే అది సరిపోదు. గుళ్లలో ఇలాంటి అపచారాలు మరిన్ని చోటు చేసుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వాటిని ఎలా డీల్ చేస్తారు? అనేది కీలకమైన ప్రశ్న. కొన్ని లక్షల ఆలయాల్లో.. ఎక్కడ ఏం జరిగినా.. అది సంచలనమే అవుతుంది.
చీమ చిటుక్కుమన్నా జగన్ మీద దాడికి ప్రత్యర్థులు ఉపయోగించుకుంటారు. ఈ విషయంలో అడుగడుగునా జగన్ తనను తాను నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ జగన్ రాజకీయ ప్రత్యర్థులు వ్యూహాత్మకంగా ఈ ఆలయ విధ్వంసాలను సృష్టిస్తూ ఉంటే.. ఎక్కడో ఒక చోట పక్కగా దొరక్కపోరు. అలా దొరికితే మాత్రం.. అక్కడితో జగన్ ప్రత్యర్థుల వినాశనం పూర్తవుతుంది!
ప్రతి మారుమూల ఆలయాలకూ పోలీసులను కాపాలా ఉంచాలంటే.. రాష్ట్రంలో ఉన్న బలగం అంతా జనాలను వదిలి గుళ్లను కాపాడాలన్నా సరిపోదు. అయితే.. సరైన రీతిలో పని చేస్తే మాత్రం ఇది మరీ తీవ్ర సమస్య కాదు.
నేతలు, మంత్రులు ఏం చేస్తున్నట్టు?
గుళ్లపై దాడుల ఘటనలతో హోం శాఖ తీరు పలు ప్రశ్నలను రేకెత్తిస్తూ ఉంది. ఇలాంటి వాటిల్లో క్లూస్ పట్టుకోలేకపోవడం, నిందితులను అరెస్టు చేయలేకపోవడం హోం శాఖ ఫెయిల్యూర్ కిందే.
మహిళను అయితే హోం శాఖా మంత్రిగా నియమించారు కానీ..జరుగుతున్న ఘటనలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాప కిందకే నీరు తీసుకొస్తున్నాయి. ఇప్పుడు అభిమానాలు, ఆత్మీయతల సంగతెలా ఉన్నా.. సమస్యను పరిష్కరించడం ముఖ్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలి.
అలాగే చాలా మంది మంత్రులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. అంతా జగన్ చూసుకుంటారనే ధీమానో, లేక పట్టించుకునే తత్వమో లేదో కానీ.. ఆర్థికశాఖా మంత్రి దగ్గర నుంచి చాలా మంది కిక్కురుమనడం లేదు. అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా గడవక ముందే కొందరు మంత్రులు చాలా చాలా తాపీగా మారిపోయినట్టుగా ఉన్నారు.
అలాగే కాంగ్రెస్ నుంచి వచ్చిన పాత నేతలకూ, జగన్ వెంట నడిచి వెలుగులోకి వచ్చిన వారికి మధ్యన సమన్వయం కుదురడం లేదనే విషయాలు స్పష్టం అవుతున్నాయి.
మొత్తానికి ఇది పరీక్షా సమయం!
సంక్షేమ పథకాల అమలు ఒక్కటే సరిపోదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వైరి పక్షాలు తమ సవాళ్లతో చెబుతున్నాయి. చంద్రబాబు హయాంలో ఎన్ని గుళ్లు కూలగొట్టినా, పుష్కరాల్లో అంత దుర్మార్గం జరిగినా, 'ఏం జనాలు పుష్కరాల్లోనే చనిపోయారా, కుంభమేలాలో చనిపోలేదా?' అంటూ స్వయంగా చంద్రబాబు నాయుడే బరితెగించి మాట్లాడినా.. రేగని హిందుత్వ వాదం జగన్ ఎంతో బాధ్యతాయుతంగా ఉంటున్నా, అంతఃకరణశుద్ధితో పని చేస్తున్నా రేగుతోంది.
ఈ విషయాన్ని విజ్ఞులైన జనాలు అయితే గమనిస్తున్నారు. కానీ.. భావోద్వేగాలకు రెచ్చిపోయే ప్రజలూ మన దగ్గర చాలా మంది ఉంటారు. వారిని జగన్ సమాధాన పరచాలిప్పుడు. అదెలా అనేది ఆయన ముందున్న పెద్ద పరీక్ష!